Devineni Uma: ఒక్క ఛాన్స్ అని ప్రజలను మోసగించిన జగన్‌రెడ్డి
ABN , Publish Date - Mar 25 , 2024 | 09:35 PM
అమరావతే రాజధాని అని ఈ ప్రాంత ప్రజలను, రైతులను నమ్మించి సీఎం జగన్‌రెడ్డి గొంతు కోశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Umamaheswara Rao) అన్నారు. సోమవారం నాడు ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు కాన్వాయిని తనిఖీల పేరుతో ఉద్దేశపూర్వకంగా ఆపుతున్నారని మండిపడ్డారు.
ఎన్టీఆర్ జిల్లా: అమరావతే రాజధాని అని ఈ ప్రాంత ప్రజలను, రైతులను నమ్మించి సీఎం జగన్‌రెడ్డి గొంతు కోశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Umamaheswara Rao) అన్నారు. సోమవారం నాడు ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు కాన్వాయిని తనిఖీల పేరుతో ఉద్దేశపూర్వకంగా ఆపుతున్నారని మండిపడ్డారు. రోజు తనిఖీలు చేస్తున్నామని ముఖ్యమంత్రి మెప్పుకోసం కొంతమంది పోలీసు అధికారులు అత్యుత్సాహంతో ఈ కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్నారు.
అక్కడ పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి కారు తనిఖీ చేసే పరిస్థితి లేదన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్నికల కోడ్ నియమావళిని అనుసరిస్తున్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలను నమ్మించడానికి పాదయాత్ర పేరుతో ఒక్క ఛాన్స్ అని మాయ మాటతో ముద్దులు పెట్టి మోసం చేశారని ధ్వజమెత్తారు. ఐదేళ్లలో పరిపాలన చేయడం చేతకాక పాలన యంత్రాంగాన్ని చతికిల పడేశారని విరుచుకుపడ్డారు. పాదయాత్రలో జగన్ 730 హామీలిచ్చి ఎన్నికలకు వెళ్లే ముందు నవరత్నాల పేరుతో కలరు పుస్తకాలు ఇచ్చి ఆ హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.
అందరికీ అని చెప్పిన అమ్మ ఒడి కోతల మయమైందన్నారు. ఇలా ఏ కార్యక్రమం తీసుకున్న విఫలమయ్యారని... ఆరోగ్యశ్రీ అనారోగ్య శ్రీ పథకం అయిపోయిందని విమర్శించారు. రైతులకు కేంద్రం ఇచ్చే డబ్బులను కూడా తన ఖాతాలో వేసుకుని ఆయన ఇచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చారన్నారు.డ్యాముల్లో నీటి భద్రత మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. ఇద్దరు మంత్రులు పనిచేశారని.. మంచినీటి సమస్యపై మంత్రిగాని అధికారి గాని ఏ ఒక్కరూ మాట్లాడే వారే లేరని చెప్పారు. 5 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదన్నారు. పోలవరం ప్రాజెక్టును డయాఫ్రం వాళ్లను గోదావరిలో ముంచేశారని మండిపడ్డారు. పట్టిసీమకు బూజు పట్టించారని.. చింతలపూడి నాశనం చేశారని ఏకిపారేశారు. రూ.1600 కోట్లతో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఎయిమ్స్ ఆస్పత్రి కట్టిస్తే దానికి కృష్ణ నీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారన్నారు.
జాబు క్యాలెండర్, సీపీఎస్ రద్దు, ప్రత్యేక హోదా, కడప స్టీల్, విశాఖ ఉక్కు, రైల్వే జోన్, షెడ్యూల్ 9, 10 ఆస్తులు గురించి పట్టించుకున్న నాధుడే లేడని ధ్వజమెత్తారు. వైసీపీలో 31 మంది ఎంపీలు ఉండి ఏం చేశారు ? అని ప్రశ్నించారు. ఉన్న పరిశ్రమలు జగన్, తన అనుచరుల కమీషన్ల దందాలకు పారిపోయాయని మండిపడ్డారు. 1560 రోజులుగా రైతులు మహిళలు రైతు కూలీలు పడ్డ మానసిక భాద ఊరికే పోదన్నారు. మళ్లీ ఓట్లు దండుకొని ప్రజలను నమ్మించాలని ‘సిద్ధం’ సభలు అయిపోయాయని.. ఇప్పుడు ‘మేం సిద్ధం’ అని బస్సు యాత్రలు మొదలుపెట్టారన్నారు. చెత్త మీద పన్నులు వేశారని.. రోడ్లను బాగు చేయలేదని చెప్పారు.
జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు అవ్వలేదన్నారు. మధ్యనిషేధం చేసి ఓట్లు అడుగుతానని అన్నావు.. వీటన్నింటికీ సమాధానం చెప్పే బస్సు యాత్రకు బయలుదేరాలని చెప్పారు. విశాఖలో డ్రగ్ మాఫియా ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి కంటైనర్ దొరికింది లేకపోతే అది పట్టుకునే పరిస్థితి లేవని..సీబీఐ వచ్చే పరిస్థితి ఉండేది కాదని చెప్పారు. ల్యాండు, శాండ్, వైను, మైను, సెంటు పట్టాల్లో దోచిన రూ. 8లక్షల కోట్లను కక్కించి రాష్ట్ర ఖజానాకు రప్పిస్తామని దేవినేని ఉమామహేశ్వరరావు హెచ్చరించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి