Share News

Pawan Kalyan: ఏలూరు జిల్లాలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు.. పవన్ కల్యాణ్ సీరియస్

ABN , Publish Date - Nov 09 , 2024 | 09:35 AM

ఏలూరు జిల్లాలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ తవ్వకాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. పవన్ ఆదేశాలతో అధికార యంత్రాగం అప్రమత్తమై చర్యలు చేపట్టారు.

Pawan Kalyan: ఏలూరు జిల్లాలో  అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు.. పవన్ కల్యాణ్ సీరియస్

ఏలూరు జిల్లా: ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాధపురంలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరిపినట్లు అధికారులు నిర్ధారించారు. ఈనెల 1వ తేదీన ద్వారకా తిరుమల మండలం ఐ యస్ జగన్నాధపురంలో దీపం 2 కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కొండ దిగువున గ్రావెల్ తవ్వకాలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు. తవ్వకాలపై విచారణ చేసి తనకు రిపోర్ట్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో యంత్రాంగం కదిలింది.


20.95 ఎకరాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా రెడ్ గ్రావెల్ తవ్వకాలు జరిగినట్లు అధికారులు నిర్ధారణ చేశారు. సుమారు 6 లక్షల క్యూబిక్ మీటర్లు అక్రమంగా రెడ్ గ్రావెల్ తవ్వకాలు జరిగినట్లు గుర్తించారు. ఒకచోట పర్మిషన్ తీసుకుని మరొకచోట తవ్వినట్టు గుర్తించారు. బాధ్యులైన రెవెన్యూ , మైనింగ్ అధికారులకు కలెక్టర్ వెట్రిసెల్వి షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నారు.


తవ్వకాలు జరిపిన బెకెమ్ ఇన్‌ఫ్రా సంస్థకు కూడా నోటీసులు పంపించారు. భారీ తవ్వకాల కారణంగా కొండపై పచ్చదనం దెబ్బతిన్నట్లు గుర్తించారు. విచారణ చేసి అటవీ శాఖ అధికారులు నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అక్రమ తవ్వకాలు జరిగిన కొండ పక్కన మరో కొండపై జోరుగా గ్రావెల్ తవ్వకాలు సాగుతున్నాయి. వీటిపై కూడా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


ఆగని అక్రమార్కుల దందా

ఏపీలో ప్రభుత్వం మారి నెలలు గడుస్తున్నప్పటికీ సహజ వనరుల దోపిడీ యథావిధిగానే కొనసాగుతోంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అక్రమార్కుల దందా మాత్రం ఆగడంలేదు. ఎవరు అధికారంలో ఉంటే.. వారితో సన్నిహితంగా ఉంటూ ప్రభుత్వ భూములు, కొండవాలు ప్రాంతాల్లో మట్టి, గ్రావెల్‌ తవ్వకాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, లేఅవుట్‌లలో మెరక పనులకు గ్రావెల్‌, మట్టి తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.


యథేఛ్ఛగా సహజ వనరుల దోపిడీ

ఐదేళ్ల వైసీపీ పాలనలో సహజ వనరులను యథేఛ్ఛగా దోచుకున్నారు. గనుల శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, సీనరేజ్‌ చెల్లించకుండా మట్టి, గ్రావెల్‌ను భారీఎత్తున తవ్వుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సహజ వనరుల దోపిడీకి చెక్‌ పడుతుందని ప్రజలు భావించారు. కానీ ఎక్కడా మార్పు కనిపించడం లేదు. అధికారంలో ఉన్న పార్టీల నాయకుల సహకారంతో మట్టి, గ్రావెల్‌ అక్రమల తవ్వకాలు, రవాణాను ఎప్పటిలానే కొనసాగిస్తున్నారు. జిల్లాలో ఎక్కడా మట్టి, గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతులు ఇవ్వలేదని గనుల శాఖ అధికారులు చెబుతున్నారు. అయిన కొన్ని గ్రామాల్లో గ్రావెల్‌ తవ్వకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా, అధికారుల దాడుల నుంచి తప్పించుకునేందుకు రాత్రి పది గంటల తర్వాత ఎక్స్‌కవేటర్‌తో గ్రావెల్‌ తవ్వి, భారీ డంపర్‌ లారీలు, టిప్పర్లు, టాక్టర్లతో తరలిస్తున్నారు. తెల్లవారుజామున నాలగు గంటలకల్లా తవ్వకాలు, రవాణాను ఆపేస్తున్నారు.


రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు తరలింపు

ఏలూరు జిల్లా చుట్టూ పక్కల పలు పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. ఇంకా పరిశ్రమలు ఏర్పాటువుతూనే ఉన్నాయి. అలాగే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు పలు వెంచర్లు వేస్తున్నారు. లేఅవుట్‌లను ఎత్తు చేయడానికి, అంతర్గత రోడ్ల నిర్మాణానికి పెద్ద మొత్తంలో గ్రావెల్‌, మట్టి అవసరం. అక్రమార్కులు ఆయా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను సంప్రదించి గ్రావెల్‌ లేదా మట్టి సరఫరాకు ఒప్పందం చేసుకుంటున్నారు. దూరాన్ని బట్టి ట్రాక్టర్‌ గ్రావెల్‌ రూ.3-4 వేలు, లారీ అయితే రూ.6-8 వేలు వసూలు చేస్తున్నారు. ఇందులో సగం సొమ్ము గ్రావెల్‌ తవ్వకాలు, రవాణాకుపోను మిగిలిన సగం సొమ్ము అక్రమార్కులకు మిగులుతోంది. రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఇబ్బడిముబ్బడిగా ఆదాయం వస్తుండటంతో అక్రమార్కులు ఎక్కడపడితే అక్కడ గ్రావెల్‌ తవ్వేస్తున్నారు. గతంలో కొంతమంది వైసీపీ నాయకులు, వీరితో చేతులు కలిపి భారీ మొత్తంలో కూడబెట్టుకున్నారు. అక్రమార్కులు ఇప్పుడు కూటమి పార్టీలకు చెందిన కిందిస్థాయి నాయకులతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుని గ్రావెల్‌, మట్టి తవ్వకాలు, రవాణా చేస్తున్నారు.


మొక్కుబడిగా చర్యలు

ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా మట్టి, గ్రావెల్‌ తవ్వకాలపై పోలీసు, రెవెన్యూ, గనుల శాఖల అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. మొక్కుబడిగా దాడులు నిర్వహించి గ్రావెల్‌ తరలిస్తూ ట్రాక్టర్లు, లారీలు పట్టుబడితే అరకొరగా జరిమానా విధించి వదిలేస్తున్నారు. ఒకవేల రాత్రి గస్తీ పోలీసులు గ్రావెల్‌ రవాణా చేస్తున్న వాహనాలను పట్టుకుంటే... స్థానిక నేతల ఒత్తిళ్లతో మొక్కుబడిగా జరిమానా విధించి, తమ వాటా సొమ్ము తీసుకుని వాహనాలను విడిచిపెట్టేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు ఏలూరు జిల్లాలోని పలు మండలాల పరిధిలో అధికంగా జరుగుతున్నాయి. మట్టి, గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదని అధికారులు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Borugadda Anil: పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్‌

Chandrababu : కోరలు పీకండి!

Supreme Court: పుణ్య క్షేత్రాలను ప్రత్యేక రాష్ట్రాలు చేయాలా?

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 09 , 2024 | 09:49 AM