Share News

Exit Polls : కూటమికే జై! ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా..

ABN , Publish Date - Jun 02 , 2024 | 03:20 AM

రాష్ట్రంలో టీడీపీ కూటమి ఘనవిజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలు అంచనా వేశాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతోందని ప్రకటించాయి. జాతీయ స్థాయి సర్వే సంస్థల్లో అత్యధికం.. కూటమి వైపే మొగ్గు చూపించాయి.

Exit Polls :  కూటమికే  జై! ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా..
TDP Alliance

మెజారిటీ జాతీయ సర్వే సంస్థలు కూటమికే మొగ్గు లోక్‌సభ సీట్ల ప్రాతిపదికన అంచనా

కూటమికి 21-23

రావచ్చన్న ‘ఇండియా టుడే’

3 పార్టీల మధ్య సమన్వయం

కుదిరిందన్న సంస్థ

ఓట్ల బదిలీ సవ్యంగా జరిగిందని వెల్లడి

21-25 సీట్లు ఇచ్చిన ఏబీపీ-సీవోటర్‌

19-23 రావచ్చన్న ఇండియా టీవీ

న్యూస్‌18 అంచనా 19-22 స్థానాలు

ఇక రాష్ట్ర స్థాయి సర్వే సంస్థల్లోనూ

ఒకట్రెండు తప్ప అన్నీ కూటమికే జై!

వైసీపీకి 94-104 రావచ్చన్న ‘ఆరా’


టీడీపీ కూటమికి అనుకూలంగా..

పీపుల్స్‌ పల్స్‌, ప్రిజమ్‌, చాణక్య స్ట్రాటజీ, రైజ్‌ పొలిటికల్‌, పీటీఎస్‌, పయనీర్‌,

జనగళం, కేకే సర్వేస్‌, ఇండియా టీవీ-

సీఎన్‌ఎక్స్‌, ఇండియాటుడే, రిపబ్లిక్‌ టీవీ-మాట్రిజ్‌, ఏబీపీ-సీవోటర్‌..

సీఎన్‌ఎన్‌-న్యూస్‌18, టుడే చాణక్య

161 స్థానాలు వస్తాయన్న ‘కేకే సర్వేస్‌’

గత ఎన్నికల్లో దాదాపుగా

నిజమైన ఆ సంస్థ అంచనాలు


అమరావతి, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో టీడీపీ కూటమి ఘనవిజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలు అంచనా వేశాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతోందని ప్రకటించాయి. జాతీయ స్థాయి సర్వే సంస్థల్లో అత్యధికం.. కూటమి వైపే మొగ్గు చూపించాయి. ఒక సర్వే సంస్థ మాత్రమే వైసీపీకి అనుకూల ఫలితాలను వెల్లడించింది.


కూటమిదే విజయం..!!

రాష్ట్రానికి చెందిన సర్వే సంస్థల్లో కొన్ని తప్ప మిగిలినవి కూడా టీడీపీ కూటమిదే విజయమని పేర్కొన్నాయి. కొన్ని సర్వేల్లో టీడీపీ కూటమికి భారీ మొగ్గు వ్యక్తం కావడం విశేషం. వైసీపీకి అనుకూలత వ్యక్తం చేసిన సర్వేలు ఆ పార్టీకి కొద్ది మొగ్గు మాత్రమే చూపించాయి. లోక్‌సభ ఎన్నికల తుది (ఏడో) దశ పోలింగ్‌ పూర్తయిన తర్వాత శనివారం సాయంత్రం 6.30 గంటల నుంచి ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడడం మొదలైంది. లోక్‌సభ స్థానాల ప్రాతిపదికన జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అనేక సంస్థలు తమ సర్వే ఫలితాలను విడుదల చేశాయి.


వాస్తవానికి దగ్గరగా..

ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు కొన్ని భాగస్వామ్య సంస్థలతో కలిసి పోలింగ్‌ సరళిపై సర్వేలు చేశాయి. పోలింగ్‌ రోజు ఓటు వేసిన ఓటర్ల నుంచి తెలుసుకున్న అభిప్రాయ సేకరణ కావడంతో వీటిని ఎగ్జిట్‌ పోల్స్‌గా పిలుస్తున్నారు. మిగిలిన సర్వేలతో పోలిస్తే ఇవి వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉంటాయన్న అభిప్రాయం ఉండడంతో ప్రజల్లో వీటిపై అమితమైన ఆసక్తి వ్యక్తమవుతోంది.


జాతీయ స్థాయి సంస్థలు

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సర్వే నిర్వహించిన జాతీయ స్థాయి మీడియా సంస్థల్లో ఎక్కువ.. ఏపీలో టీడీపీ కూటమి భారీ విజయం సాధించబోతున్నట్లు తెలిపాయి. ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్‌, సీఎన్‌ఎన్‌-న్యూస్‌18, ఏబీపీ-సీ-వోటర్‌, టుడేస్‌ చాణక్య, పిమార్క్‌, జన్‌ కీ బాత్‌, రిపబ్లిక్‌ టీవీ-మాట్రిజ్‌, ఇండియాటుడే సంస్థల సర్వేలు కూటమి విజయాన్ని అంచనా వేశాయి. ఒక్క టైమ్స్‌ నౌ-సీటీజీ మాత్రం వైసీపీ రెండోసారి గెలవబోతున్నట్లు అభిప్రాయపడింది.


కూటమికి మెజార్టీ సీట్లు

అదీ స్వల్ప మెజారిటీనే సూచించడం గమనార్హం. ఆ పార్టీకి 14 లోక్‌సభ స్థానాలు వస్తాయని.. కూటమికి 11 వస్తాయని పేర్కొంది. మిగిలిన సర్వేలు మాత్రం టీడీపీకి భారీ విజయాన్ని సూచించాయి. ఇండియా టీవీ సర్వే టీడీపీ కూటమికి 19-23 సీట్లు వస్తాయని పేర్కొంటే.. ఏబీపీ-సీ వోటర్‌ సర్వే ఏకంగా 21-25 ఎంపీ సీట్లు వస్తాయని తెలపడంవిశేషం. సీఎన్‌ఎన్‌-న్యూస్‌18 చానల్‌ కూటమికి 19-22 సీట్లు వస్తాయని తెలిపింది. పి-మార్క్‌ కూడా 19-22 ఎంపీ సీట్లు కూటమికే వస్తాయని పేర్కొనగా.. జన్‌ కీ బాత్‌ మాత్రం 12-15 సీట్లు వస్తాయని తెలిపింది. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ పూర్తిసమన్వయ సహకారాలతో పనిచేశాయని.. అధికారపక్షంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో మార్చుకోవడంలో విజయం సాధించాయని ‘ఇండియాటుడే’ చర్చలో పలువురు విశ్లేషకులు అభిప్రాయపడడం గమనార్హం.


కొన్ని అటు.. కొన్ని ఇటు!

రాష్ట్ర స్థాయిలో కొన్ని సర్వే సంస్థలు కూటమికి విజయాన్ని పేర్కొనగా మరి కొన్ని వైసీపీకి అనుకూల ఫలితాలు వెలువరించాయి. ఈసారి ఊరూ పేరూ లేని అనేక సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ పేరుతో సర్వేల వివరాలు ప్రకటించడంతో వాటిని చూసేవారు అయోమయానికి గురయ్యారు.

ఇందులో గత ఎన్నికల నుంచి సర్వే ఫలితాలు ప్రకటిస్తున్నవి కొన్ని మాత్రమే ఉన్నాయి. ఉదాహరణకు కేకే సర్వే అనే సంస్థ గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌ పోల్‌లో సూచించింది. ఆ పార్టీకి 140 వస్తాయని తెలుపగా.. ఓట్ల లెక్కింపులో 151 వచ్చాయి. అదే సంస్థ ఈసారి కూటమికి 161 సీట్లు వస్తాయని ప్రకటించింది.

ఇందులో టీడీపీకి 133, జనసేనకు 21, బీజేపీకి 7 సీట్లు వస్తాయని తెలిపింది. ఈ సంస్థ సర్వే ప్రకారం వైసీపీకి 14 మాత్రమే వస్తాయి.పలు రాష్ట్రాల్లో సర్వేలు నిర్వహిస్తూ ఆ రంగంలో ప్రఖ్యాతి పొందిన పీపుల్స్‌ పల్స్‌ సంస్థ కూడా టీడీపీ కూటమి 111-135 సీట్లతో విజయం సాధించబోతోందని తెలిపింది.

ఆ సంస్థ అంచనా ప్రకారం.. టీడీపీకి 95-110, జనసేనకు 14-20, బీజేపీకి 2-5.. వైసీపీకి 45-60 అసెంబ్లీ సీట్లు లభించే అవకాశం ఉంది. ఇక ఎంపీ సీట్లు టీడీపీకి 13-15 వస్తాయని, వైసీపీకి 3-5 వస్తాయని ఈ సంస్థ అంచనా వేసింది.


ఆరా మాత్రం

తెలుగు రాష్ట్రాల్లో పేరున్న సర్వే సంస్థల్లో ఒకటైన ‘ఆరా’ సంస్థ వైసీపీయే మళ్లీ విజయం సాధిస్తుందని పేర్కొంది. ఆ సంస్థ అంచనాల ప్రకారం.. వైసీపీకి 94-104 సీట్ల మధ్యలో వస్తాయి. టీడీపీ కూటమికి 71-81 రావచ్చు.

  • వైసీపీకి 49 శాతం ఓట్లు, కూటమికి 47 శాతం ఓట్లు వస్తాయని ఆ సంస్థ అభిప్రాయపడింది.

  • సర్వే రంగంలో తరచూ వినిపించే రైజ్‌ సంస్థ కూడా టీడీపీ కూటమి వైపే మొగ్గు ఉన్నట్లు తెలిపింది. కూటమికి 113-122 వస్తాయని, వైసీపీకి 48-60 రావచ్చని పేర్కొంది.

  • ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు ‘చాణక్య’ పార్థ దాస్‌ వైసీపీకి 110-120 స్థానాలు రావచ్చని అంచనా వేశారు.

  • లోక్‌సభ సీట్లు మాత్రమే ఎవరికి ఎన్ని వస్తాయో అంచనా వేసిన జాతీయ సర్వే సంస్థలు.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ కూటమే గెలుస్తుందని పేర్కొన్నా.. సీట్ల సంఖ్యను పేర్కొనలేదు.


  • వైసీపీకి అనుకూలంగా..

ఆరా, రేస్‌, ఆపరేషన్‌ చాణక్య, ఆత్మసాక్షి ఎస్‌ఏఎస్‌, పోల్‌ స్ట్రాటజీ, అగ్నివీర్‌, పొలిటికల్‌ లేబొరేటరీ, జన్‌మత్‌, ర్యాప్‌ స్ట్రాటజీ, టైమ్స్‌ నౌ-ఈటీజీ..

  • జనసేనకు జై కొట్టిన ఎగ్జిట్‌ పోల్స్‌

రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ జనసేనకు భారీ విజయాన్ని సూచిస్తున్నాయి. ఎక్కువ సర్వే సంస్థలు ఆ పార్టీ 15 నుంచి 18 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతున్నట్లు తెలిపాయి. అలాగే పోటీచేసిన రెండు లోక్‌సభ స్థానాలు.. మచిలీపట్నం, కాకినాడలో కూడా విజయం సాధించనుందని పేర్కొన్నాయి.

గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీచేసి ఓటమిపాలైన ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఈసారి పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి దాదాపు 40-50 వేల భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని వెల్లడించాయి. పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేయగా..

18 చోట్ల గెలుపు తథ్యమని పలు సర్వే సంస్థలు పేర్కొన్నాయి. 14 నుంచి 21 సీట్లు గెలిచే అవకాశం ఉందని ‘పీపుల్స్‌ పల్స్‌’ తెలిపింది. మొత్తం 21 స్థానాలూ దానివేనని ‘కేకే సర్వేస్‌’ అంచనా వేసింది. వైసీపీ మళ్లీ గెలుస్తుందని అంచనా వేసిన ‘ఆరా’ మస్తాన్‌ కూడా జనసేన మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతున్నట్లు చెప్పారు.


రాష్ట్ర స్థాయి సర్వే సంస్థల అంచనాలు (అసెంబ్లీ సీట్లు)

సంస్థ టీడీపీ వైసీపీ

కూటమి

కేకే సర్వేస్‌ 161 14

పీపుల్స్‌ పల్స్‌ 111-135 45-60

రైజ్‌ 103-118 48-60

స్మార్ట్‌ సర్వే 93 82

ఆరా 71-81 94-104


జాతీయ స్థాయి సంస్థల సర్వే అంచనాలు (ఎంపీ సీట్లు)

సంస్థ టీడీపీ వైసీపీ

కూటమి

ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్‌ 19-23 3-5

సీఎన్‌ఎన్‌-న్యూస్‌18 19-22 5-8

ఏబీపీ-సీ వోటర్‌ 21-25 0-4

టైమ్స్‌ నౌ-సీటీజీ 11 14

టుడేస్‌ చాణక్య 22 3

రిపబ్లిక్‌ టీవీ-మాట్రిజ్‌ 18 7

ఇండియాటుడే 21-23 2-4

Updated Date - Jun 02 , 2024 | 07:00 AM