AP Poll Violence: అవి ప్రాణాంతక దాడులే!
ABN , Publish Date - May 21 , 2024 | 03:33 AM
పోలింగ్ రోజు, ఆ తర్వాత రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనలన్నీ ప్రాణాంతకమైనవేనని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తేల్చింది.
కుట్ర కోణమూ ఉంది
ఇంత తీవ్రత ఉన్న కేసుల్లో పోలీసుల దర్యాప్తు లోపభూయిష్ఠం
ఎన్నికల్లో హింసపై ‘సిట్’ ప్రాథమిక నివేదిక
డీజీపీకి సమర్పించిన ఐజీ బ్రిజ్‌లాల్, ఎస్పీ రమాదేవి
పల్నాడు, అనంత, తిరుపతి జిల్లాల్లో 33 కేసులు
పోలీసులు పేర్కొన్న నిందితులు 1,370 మంది
అరెస్టు చేసింది మాత్రం 124 మందినే
మిగతావారినీ త్వరగా పట్టుకోవాలి
కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలి
కుట్రదారులను గుర్తించి విచారించాలి
నమోదైన కేసుల్లో అదనపు సెక్షన్లు చేర్చాలి
ప్రత్యేక దర్యాప్తు బృందం సూచనలు
వాటిని అమలు చేయాలని ఎస్పీలకు పోలీసు బాస్ ఆదేశం
రిపోర్టును ఈసీకి పంపిన డీజీపీ
కొందరు పోలీసులపైనా కేసులు?
అమరావతి, మే 20 (ఆంధ్రజ్యోతి): పోలింగ్ రోజు, ఆ తర్వాత రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనలన్నీ ప్రాణాంతకమైనవేనని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తేల్చింది. ఇంతటి తీవ్రమైన కేసుల్లో స్థానిక పోలీసుల దర్యాప్తు లోపభూయిష్ఠంగా ఉందని ఆక్షేపించింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో నమోదైన 33 కేసుల్లో 1,370 మంది నిందితులు ఉంటే కేవలం 124 మందినే స్థానిక పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపింది. ఎఫ్‌ఐఆర్‌లలో నమోదు చేసిన సెక్షన్లకు అదనపు సెక్షన్లను చేర్చాలని స్థానిక ఎస్‌హెచ్‌వోలను ఆదేశించింది. సిట్ అధిపతి ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్, ఏసీబీ ఎస్పీ రమాదేవి సోమవారం మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు 150 పేజీల రహస్య ప్రాథమిక నివేదికను అందజేశారు. రెండ్రోజుల పాటు మూడు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యక్ష సాక్షులు, బాధితులతో మాట్లాడిన సిట్ బృందాలు హింస తీవ్రత, కుట్ర కోణాన్ని గుర్తించాయి. అందుకు అనుగుణంగా పోలీసులు సెక్షన్లు నమోదు చేయకపోవడం, అల్లర్ల కేసుల్లో నిందితులుగా ఉన్న 1,370 మందిలో కనీసం పదిశాతం మందిని కూడా అరెస్టు చేయక పోవడానికి కారణాలను నివేదికలో పొందుపరచింది.
ప్రాణాంతకమైన ఇనుప రాడ్లు, కత్తులు, సమ్మెటలు, రాళ్ల దాడులు బీభత్సంగా జరిగినా ఎఫ్‌ఐఆర్‌లలో ఆ స్థాయి ఐపీసీ సెక్షన్లు నమోదు చేయలేదని తేల్చింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు పోలింగ్ రోజు జరిగిన విధ్వంసం కేసుల్లో ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రస్తావనే లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని పేర్కొంది. నేరం తీవ్రత, లభించిన ఆధారాలకు అనుగుణంగా చర్యలు లేవని పెదవి విరిచింది. నలుగురు డీఎస్పీల నేతృత్వంలో 12 మంది సభ్యులతో కూడిన సిట్ బృందాలు మూడు జిల్లాలకు వెళ్లి విచారణ జరిపాయి. పల్నాడు జిల్లాలో 8 పోలీసు స్టేషన్ల పరిధిలో నమోదైన 22 కేసులు, అనంతపురం జిల్లాలో నమోదైన 7 కేసులు, తిరుపతి జిల్లాలో నాలుగు కేసులకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లను క్షుణ్ణంగా పరిశీలించాయి. నేరం/ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి అన్ని వర్గాలతో మాట్లాడి, నాటి దృశ్యాలను వీక్షించి, సాక్షుల వాంగ్మూలాలతో ధ్రువీకరించుకుని అన్ని అంశాలను నివేదికలో పొందుపరచింది. బాధ్యులెవరు.. బాధితులెవరు.. నిందితుల వెనకున్నది ఎవరు.. వారికి సహకరించిన పోలీసుల పాత్రేంటి.. రాజకీయ పార్టీల నేతల కుట్రలు ఏమైనా ఉన్నాయా.. తదితర కోణాల్లో పరిశీలించింది.
పలు ఎఫ్‌ఐఆర్‌లలో కొన్ని సెక్షన్లు చేర్చాలని.. బయటే ఉన్న 90శాతాని(1,246మంది)కి పైగా నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని సూచించింది. హింసాత్మక దాడుల కుట్ర దారులను గుర్తించి కస్టడీలోకి తీసుకుని విచారించాలని అభిప్రాయపడింది. ఇప్పటికే జిల్లా స్థాయిలో ఏర్పాటైన దర్యాప్తు బృందాలను మరింత బలోపేతం చేసి టెక్నాలజీ వినియోగించి ఎక్కడున్నా అరెస్టు చేయాలని నిర్దేశించింది. సీసీ ఫుటేజీలు, సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు, ఫొటోలు, సాక్షుల వాంగ్మూలాలు, బాధితుల ఆరోపణలన్నీ పరిగణనలోకి తీసుకుని పూర్తిస్థాయి ఆధారాలతో కోర్టుల్లో చార్జిషీట్లు వేయాలని స్థానిక ఎస్‌హెచ్‌వోలకు సూచించింది. సిట్ నివేదికపై డీజీపీ సంతృప్తి వ్యక్తం చేశారు. సిట్ బృందం సూచనలను పరిగణనలోకి తీసుకుని పకడ్బందీగా దర్యాప్తు పూర్తి చేయాలని ఆయా జిల్లాల ఎస్పీలు, గుంటూరు రేంజ్ ఐజీ, అనంతపురం డీఐజీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ నివేదికను కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ)కి పంపించారు.
విద్రోహ శక్తులను గట్టిగా విచారించాలి..
రెండు గ్రూపులు విచక్షణరహితంగా రాళ్లు రువ్వుకోవడానికి కొందరు సంఘ విద్రోహ శక్తులు నిర్భయంగా, ఉద్దేశపూర్వకంగా కారణమైనట్లు సిట్ గుర్తించింది. కొందరి గాయాల తీవ్రతను పరిశీలిస్తే కొన్ని మరణాలు కూడా సంభవించి ఉండేవని అనిపించినట్లు తెలిపింది. ఇటువంటి వారిపై గట్టిగా విచారణ చేపడితే అన్ని కోణాలు వెలుగులోకి వస్తాయని, వారు ఇప్పటికే తప్పించుకున్నందున వెతికి అరెస్టు చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటికే 94 మందికి 41ఏ నోటీసులు ఇచ్చినట్లు స్థానిక పోలీసులు తెలిపిన సమాచారాన్ని నివేదికలో ఉటంకించింది. విద్రోహ శక్తులతోపాటు కొంద రు రాజకీయ నాయకులపైనా చర్య తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కేసులు తేలేవరకు సిట్ కొనసాగింపు!
ఈ నివేదిక ఇవ్వడంతో సిట్ పని పూర్తికాలేదని డీజీపీ స్పష్టం చేసినట్లు తెలిసింది. 124 మందినే అరెస్టు చేశారని, 94 మందికి 41ఏ నోటీసులిచ్చారని.. మిగతా వారినీ అరెస్టు చేసి చార్జిషీట్లు వేయాలని సిట్ సభ్యులే సిఫారసు చేసినందున.. ఈ బాధ్యతను స్థానిక పోలీసులతో సమన్వయంతో వారే చేయాలని ఆదేశించిన ట్లు సమాచారం. పూర్తిగా స్థానిక పోలీసులకు అప్పగిస్తే సరిగా జరగదని.. కఠినంగా వ్యవహరిస్తే తప్ప మరోసారి ఇలాంటి హింసాకాండకు అవకాశం ఉండదని చెప్పినట్లు తెలిసింది. అందుచేత ఈ ప్రక్రియ పర్యవేక్షణకు సిట్ కొనసాగడం అవసరమని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, అనంతపురం రేంజ్ డీఐజీ శేముషితో, జిల్లాల ఎస్పీలు, స్థానిక డీఎస్పీలతో సమన్వయం చేసుకుంటూ కేసులను మానిటర్ చేయాలని ఐజీ బ్రిజ్‌లాల్, ఎస్పీ రమాదేవిని ఆయన ఆదేశించినట్లు తెలిసింది. దీంతో సిట్ సభ్యులు సోమవారం కూడా ఆయా జిల్లాల పోలీసు స్టేషన్లలో రికార్డులు పరిశీలించారు. సిట్ అధికారి సౌమ్యలత నరసరావుపేట రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో నమోదైన ఐదు కేసులపై మరిన్ని వివరాలు సేకరించారు.
డీజీపీ దృష్టికి ఆ పోలీసుల పాత్ర?
ఈ నెల 13న పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో కొందరు పోలీసుల పాత్రను సిట్ గుర్తించినట్లు తెలిసింది. పల్నాడు ప్రాంతంలో ఏ పోలీసు అధికారి ఎవరికి వత్తాసు పలికారు.. ఏ కానిస్టేబుల్ ఎవరికి సమాచారం అందజేశారు.. డబ్బులకు అమ్ముడు పోయిన సీఐలు, ఎస్‌ఐలు ఎవరు.. అనే విషయాలపై కూపీ లాగిన సిట్ బృందాలు.. తప్పు చేసిన ఖాకీలపై ఎఫ్‌ఐఆర్‌ల నమోదుకు డీజీపీకి సిఫారసు చేసినట్లు సమాచారం. గొడవలు జరుగుతాయని ముందే తెలిసి అక్కడి నుంచి జారుకున్న ఓ సీఐ, ప్రతిపక్షాల అభ్యర్థుల కదలికలపై సమాచారం అందజేసిన ఇంకో సీఐ, రాళ్ల వర్షం కురుస్తున్నా చోద్యం చూసిన ఓ డీఎస్పీ.. ఇలా ఎవరెవరి పాత్ర ఎక్కడెక్కడ ఎంతో ఆయనకు వివరించినట్లు తెలిసింది. ఇప్పటికే సస్పెండైన 12 మందిలోనూ అలాంటి వారు ఉన్నట్లు తెలిసింది. మరికొందరి పాత్రపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం