AP Politics: ఓటమి తర్వాత జగన్ మాటలు ఆత్మస్తుతి పరనిందలా ఉన్నాయి: వర్లరామయ్య
ABN , Publish Date - Jun 07 , 2024 | 10:14 PM
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ మాటలు ఆత్మస్తుతి పరనిందలా ఉన్నాయని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు.
అమరావతి: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ మాటలు ఆత్మస్తుతి పరనిందలా ఉన్నాయని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు. తన ఓటమిని ఇతరులపై రుద్దుతున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డి ఇంకా ఊహాలోకాల్లోనే విహరిస్తున్నారని విమర్శించారు. జగన్ రెడ్డి చేసిన నేరాలు, ఘోరాలు ఎక్కడికి పోతాయన్నారు. ఈ జగన్ తమకొద్దని ప్రజలందరూ ఏకగ్రీవంగా ఓడించారని అన్నారు. శుక్రవారం వర్లరామయ్య టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల్లో అంత ఘోరంగా ఓడిపోయినా.. ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోకుండా పరనింద చేస్తున్నారని చెప్పారు. వైసీపీ ఘోర ఓటమికి జగన్ రెడ్డే కారణమన్నారు. వైసీపీకి ఎస్సీలు బానిసలు కాదని.. నిరంకుశ, నియంతృత్వ, ప్రజా వ్యతిరేక పాలనను ఎస్సీలు ఛీ కొట్టారని అన్నారు. మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్‌ను వైసీపీ ప్రభుత్వం చంపింది.. తమ దళిత బిడ్డలు ఇంకా మరిచిపోలేదన్నారు.
దళిత బిడ్డలను అన్యాయంగా చంపేశారు..
‘‘వరప్రసాద్‌కు శిరోముండనం చేసింది మరిచిపోలేదు. దళిత బిడ్డను వైసీపీ వర్గాలు మానభంగం చేసి పోలీస్టేషన్ ముందు పడేసింది మరిచిపోలేదు. మాస్క్ పెట్టుకోలేదని దళిత బిడ్డను కిరణ్ కుమార్‌ను కొట్టి కొట్టి చంపింది మరిచిపోలేదు.నీ దొంగ సారాపై ప్రతాప్ మాట్లాడితే తెల్లారేసరికి చంపేసి ఉరేసుకున్నట్లు చిత్రీకరించారు దాన్ని మరిచి పోలేదు. వెటర్నరీ డాక్టర్ అచ్చెన్న హత్యను మరిచిపోలేదు. నకరికల్లులో గిరిజన మహిళను ట్రాక్టర్‌తో తొక్కించింది మరిచిపోలేదు. టంగుటూరు దగ్గర దళిత మహిళను చనిపోయే వరకు ట్రాక్టర్‌తో తొక్కించింది దళిత బిడ్డలు మరచిపోలేదు.చంద్రయ్య అనే వ్యక్తి జై చంద్రబాబు అన్నందుకు పీక కోసి చంపింది మరచిపోలేదు.గవర్నర్ దగ్గరకు వెళ్లి కళ్లబొల్లి సాకులు చెబుతున్నారు. మాచర్లలో రావణకాండను మరచిపోయారా అప్పేడే?. నంగనాచిలా ఏ తప్పు చేయనట్లు మాట్లాడుతారా? అమరావతిలో దళిత రైతులకు బేడీలు వేసి వీధుల్లో తిప్పింది మా దళిత బిడ్డలు మరిచిపోలేదు’’ అని వర్లరామయ్య పేర్కొన్నారు
కోర్టులను తప్పుదారి పట్టించిన జగన్..
‘‘టీడీపీ అరాచకం చేయాలనుకుంటే వైసీపీ నేతలు ఎవరూ మిగలరు. అది మా పందా కాదు... మా అధినేత దానికి ఒప్పుకోరు. అరాచకానికి సహకరించిన అధికారులు ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఓట్లు వేయలేదని ఏడుపు ముఖంతో జగన్ మాట్లాడతున్నాడు. జగన్ రెడ్డి ఏం చేశాడని జనం ఓట్లు వేస్తారు. అందుకే దళితులందరూ ఏకతాటిపైకి వచ్చి ఓడించారు. జగన్ ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డుపెట్టుకుని కోర్టులను కూడా తప్పుదారి పట్టించారు. సీబీఐ దాఖలు చేసిన 11 ఛార్జిషీట్ లలో ఒక్క రోజు కూడా కోర్టుకు హాజరు కాలేదు. జగన్ రెడ్డి ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాలి... సీఐబీ ప్రతి రోజు విచారణ జరిపించాలి. రాష్ట్ర ప్రజలకు అనుమానం ఉన్నది జగన్ రెడ్డి ఎందుకు ఇంత వెసులుబాటు కల్పించారో కోర్టు క్లారిటీ ఇవ్వాలి. ఆయన మీద ఉన్న 11 కేసుల్లో వెంటనే విచారణ చేపట్టి నిర్ధోషి అయితే వదిలేయాలి.. దోషి అయితే అరెస్ట్ చేయాలి. రాష్ట్ర ప్రజలు ఉత్కంఠతో ఉన్నారు...జగన్ రెడ్డి లోపల బయట అనేది త్వరితగతిన కోర్టులు న్యాయ విచారణ జరపాలి. జగన్ ఇకనైనా ముసలి కన్నీరు ఆపాలి... జగన్ రెడ్డి భవిష్యత్‌లో చెల్లించాల్సింది చాలా ఉంది’’ అని వర్లరామయ్య పేర్కొన్నారు.