Share News

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్లు.. గేట్‌కు డ్యామేజీ.. ఎన్నో అనుమానాలు!

ABN , Publish Date - Sep 02 , 2024 | 09:26 AM

ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షానికి ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరుతోంది. దీంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చిన పరిస్థితి. ఈ వరద ఉధృతిలో పెద్ద ఎత్తున బోట్లు కొట్టుకొస్తున్నాయి. తొలుత ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీ వైపు ఒక బోటు కొట్టుకొచ్చింది...

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్లు.. గేట్‌కు డ్యామేజీ.. ఎన్నో అనుమానాలు!
Prakasam Barrage

అమరావతి/విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షానికి ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరుతోంది. దీంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చిన పరిస్థితి. ఈ వరద ఉధృతిలో పెద్ద ఎత్తున బోట్లు కొట్టుకొస్తున్నాయి. తొలుత ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీ వైపు ఒక బోటు కొట్టుకొచ్చింది. వేగంగా వచ్చిన బోటు ప్రకాశం బ్యారేజీ గేటు 69ను ఢీ కొన్నది. ఈ ఘటనలో గేటు లిఫ్ట్ చేసే ప్రాంతంలో డ్యామేజీ అయ్యింది. అసలేం జరిగింది..? బోట్లు ఎక్కడ్నుంచి వచ్చాయి..? అని తెలుసుకునే లోపే.. మరోసారి నాలుగు బోట్లు కొట్టుకొని వచ్చాయి. దీంతో అధికారులు అనుమానాలు మొదలయ్యాయి. ఇదంతా పనిగట్టుకుని ఎవరైనా చేస్తున్నారా..? లేకుంటే వేరే ప్రాంతం నుంచి వస్తున్నాయా..? దీని వెనుక ఏమైన కుట్ర ఉందా..? ఒకవేళ కుట్రే అయితే ఎవరి పని..? అనేది తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.


Prakasam-Barrage-Boats.jpg

నాడు.. నేడు..!

ఈ క్రమంలో గతంలో జరిగిన పరిణామాన్ని అధికారులు, జనాలు గుర్తు తెచ్చుకుంటున్నారు. అప్పట్లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసాన్ని ముంచేందుకు బోటు అడ్డు తగిలిందంటూ నీటి ప్రవాహాన్ని పెంచే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేసిన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు కూడా బ్యారేజీని డ్యామేజీ చేయడానికి అలాంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా..? ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ఇలాంటి పనులు చేస్తున్నారా..? ఈ మొత్తం వ్యవహారం ఒకవేళ ఇదే నిజమైతే దీని వెనుకున్న సూత్రదారులు ఎవరు..? పాత్రదారులు ఎవరు..? అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ ప్రమాదంపై ఇరిగేషన్, రివర్ కన్జర్వేటివ్ అధికారులు సమగ్ర దర్యాప్తు చేపడుతున్నారు.


Prakasabam-Barrage-Damage.jpg

ఉదయం నుంచే సమీక్ష..

ఇదిలా ఉంటే.. వరద సహాయక చర్యలపై సోమవారం ఉదయం నుంచే సీఎం చంద్రబాబు రివ్యూలు మొదలుపెట్టారు. ఆహారం, బోట్స్ ఎంతవరకు చేరుకున్నాయి..? అని సమీక్షిస్తున్నారు. మరోవైపు.. ఇతర రాష్ట్రాల నుంచి విజయవాడకు పవర్ బోట్స్ చేరుకుంటున్నాయి. సింగ్ నగర్ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం రివ్యూ చేస్తున్నారు. తెల్లవారు జామున 4 గంటల వరకూ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని వివిధ వరద ప్రాంతాల్లో సీఎం పర్యటించిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి మళ్లీ ఫీల్డ్ విజిట్‌కు చంద్రబాబు వెళ్లనున్నారు.


chandrababu.jpg

చరిత్రలో తొలిసారిగా..

ప్రకాశం బ్యారేజీకి 11 లక్షల 20 వేల క్యూసెక్కులకు వరద చేరుకుంది. బ్యారేజి మొత్తం గేట్లు ఎత్తి కిందకు వరద నీటిని విడుదల చేశారు. బ్యారేజి చరిత్రలో తొలిసారిగా రికార్డ్ స్థాయిలో వరద వచ్చి చేరింది. 2009 అక్టోబర్‌లో 10 లక్షల 94 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. 1903 వ సంవత్సరంలో 10 లక్షల 60 వేలు క్యూసెక్కుల వరద వచ్చి చేరుకుంది. బ్యారేజి దిగువ భాగాన అనేక గ్రామాలు నీట మునిగి పోయాయి. బ్యారేజిపై రాకపోకలు నిలిపివేసే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజ్ గేట్లను పూర్తిగా పైకి ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఎప్పుడు లేని విధంగా 23.6 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజీ ఇన్ ఫ్లో అవుట్ ఫ్లో 11,25,876 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుకుంది. రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు.


Prakasam-Barrage-Full-Of-Wa.jpg

పడవ బోల్తా.. నలుగురు సేఫ్

కృష్ణా జిల్లా నాగాయలంక వద్ద నదిలో పడవ బోల్తా పడింది. ఈ పడవలో నలుగురు మత్స్యకారులు ఉన్నారు. వారి అరుపులు, కేకలు విన్న మత్స్యకార యువత.. నదిలో కొట్టుకుపోతున్న వారిని పడవల్లో వెళ్లి కాపాడారు. నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం తప్పటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. నదిలో కట్టివేసి ఉన్న పడవ కోసం పోలీసుల కన్నుగప్పి నదిలోకి మత్స్యకారులు వెళ్లడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పడవ మునిగి పోవడాన్ని స్థానిక మత్యకారులు గమనించి వెంటనే కాపాడటంతో పెను ముప్పు తప్పినట్లయ్యింది.

Updated Date - Sep 02 , 2024 | 09:43 AM