Share News

YSRCP: మారని పోలీసుల తీరు.. ఇంకా వైసీపీ

ABN , Publish Date - Nov 06 , 2024 | 04:50 PM

వైఎస్‌ఆర్సీపీ తీరు మారలేదు. ఆ పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను లక్ష్యంగా అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు... ఆ పార్టీ నేతకుగానీ, ప్రభుత్వంపైగానీ ఆ విమర్శలు చేసినా, పోస్టులను ఫార్వర్డ్‌ చేసినా ప్రతిపక్షాలు, సామాజిక కార్యకర్తలను పోలీసు, సీఐడీ అధికారులు... అర్థరాత్రి ఇళ్లల్లోకి వచ్చిమరీ అరెస్టులు చేసేవారు.

YSRCP: మారని పోలీసుల తీరు.. ఇంకా వైసీపీ
Andhra Pradesh Police

వైసీపీ సోషల్‌ మీడియా రెచ్చిపోతున్నా... పోలీసులు నో యాక్షన్‌. ఆడపిల్లలపై అరాచకం జరుగుతున్నా ... చర్యల్లేవ్‌. ఏపీలో ప్రభుత్వం మారినా... పోలీసులు మొద్దు నిద్రలోనే ఉన్నారా? ఇంకా జగన్‌ సీఎం అనుకుంటున్నారా? డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, హోం మంత్రి అనిత ... పోలీసులపై ఎందుకు మాట్లాడాల్సివస్తోంది? యాక్షన్‌లోకి దిగాలని పదే పదే చెప్తున్నా... ఎందుకు పట్టించుకోవడం లేదు?


ap police.jpg


మారని వైసీపీ..

అధికారానికి దూరమైనా ఏపీలో వైఎస్‌ఆర్సీపీ తీరు మారలేదు. ఆపార్టీ శ్రేణులు, అభిమానులు సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు... ఆ పార్టీ నేతకుగానీ, ప్రభుత్వంపైగానీ ఆ విమర్శలు చేసినా, పోస్టులను ఫార్వర్డ్‌ చేసినా ప్రతిపక్షాలు, సామాజిక కార్యకర్తలను పోలీసు, సీఐడీ అధికారులు... అర్థరాత్రి ఇళ్లల్లోకి వచ్చిమరీ అరెస్టులు చేసేవారు. అప్పట్లో చంద్రబాబు కుటుంబాన్ని వైసీపీ అసభ్యంగా టార్గెట్‌ చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది... అయితే వైసీపీ దాడి తీరు మాత్రం మారలేదు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ , హోం మంత్రి అనితలతో పాటు వారి కుటుంబ సభ్యులను కించపరుస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పోస్టులు పెడుతోంది వైసీపీ... అయినా చర్యలు తీసుకోవడం లేదు... ఆధారాలు చూపినా కేసు నమోదు చేయడంలో తాత్సాహం చేస్తున్నారు. దీంతో స్వయంగా డిప్యూటీ సీఎం పవన్‌ స్పందించాల్సివచ్చింది. పోలీసులు అలసత్వం వీడటం లేదు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ బలంగా ఉండాలని హితవు పలికారు. వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తడానికి అలవాటు పడ్డవారు ఇప్పుడు... మీనమేషాలు లెక్కిస్తున్నారు. ధర్మబద్ధంగా వ్యవహరించమంటే ఎందుకు క్రిమినల్స్‌ను వెనుకేసుకొస్తున్నారని, దమ్ము, ధైర్యం లేనివారు పోలీసులుగా పనిచేయడం సరికాదన్నారు పవన్‌.


ycp.jpg


లైంగికదాడులు

మూడేళ్లు, అయిదేళ్లు వయసున్న పసి కందులపై అత్యాచారాలు చేస్తున్నారని... ఈ సంఘటనలన్నీ గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చినవేనన్నారు పవన్‌. 30వేల మంది మహిళలు అదృశ్యమైతే గత సీఎం ఒక్క మాట మాట్లాడలేదని ఆరోపించారు. పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడినదానిలో నిజం ఉందని... సోషల్‌ మీడియాలో వైసీపీ మూకలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పుకొచ్చారు హోం మంత్రి అనిత. లా అండ్‌ ఆర్డర్‌ను పగడ్బంధీగా అమలు చేసేందుకు కృషిచేస్తామన్నారు.


pawan dy cm.jpg


పోలీసుల తాత్సారం..

లా అండ్‌ ఆర్డర్‌ విషయంలో బలంగా వెళ్లాలని ప్రభుత్వం చెప్తున్నా... పోలీసులు ఇంకా తాత్సారం చేస్తున్నారు. చట్టబద్ధంగా... రాజ్యాంగబద్ధంగా ముందుకెళ్లాలనుకుంటున్నామని డీజీపీ చెప్తున్నా... కింది స్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవలే నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజక వర్గం పగిడాల మండలం ముచ్చుమరిలో 9 ఏళ్ల బాలిక ఇంటి సమీపంలో ఉన్న పార్కు దగ్గరికి ఆడుకోవడానికి వెళ్లి అదృశ్యమైంది. పాప కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన మూడు రోజులైనా పట్టించుకోలేదు. చిన్నారిని ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారం చేసి హత్య చేశారు. కంప్లైంట్‌ ఇచ్చిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదికాదు.


chandrababu-vijayawada.jpg


మిన్నంటిన ఆందోళనలు

కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు గత వైసిపి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. స్థానిక వైసీపీ నాయకులు ప్రజలను రెచ్చగొడుతూ ఆందోళనలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైంది. ప్రజలను రెచ్చగొట్టే వైసీపీ నాయకులకు పోలీసులు బుద్ధి చెప్పడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న మండలాల్లో వైసీపీకి ఫేవర్ గా ఉండే పోలీసు అధికారులు ఉన్నా రు. దీనివల్ల ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న టిడిపి శ్రేణులు ఇంకా భయం భయంగానే బతుకుతున్నారు.‌ కొన్నిచోట్ల ఏదో ఒక సాకును అడ్డం పెట్టుకొని వైసీపీ పోలీస్ అధికారులు టిడిపి శ్రేణులను చితకబాదుతున్నారు. న్యాయం చేయాలంటూ టీడీపీ నేతలు రోడ్లెక్కాల్సిన దుస్థితి.


నోటీసులు ఇచ్చి

ఇటీవలే విదేశాలకు పారిపోతున్న వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డిని బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి తీసుకొచ్చిన పోలీసులు... జస్ట్‌ నోటీసులిచ్చి పంపించారు. స్టేషన్ ఎదుట చేవిరెడ్డి వందలాది మంది అనుచరులతో బైఠాయించి హాడావుడి చేసినా... పోలీసులు గమ్మునున్నారు తప్ప ఏమీ చేయలేదు. మదనపల్లి పైల్స్ దగ్ధం కేసులో ఇదే విధంగా జరిగింది.


pawan.jpg


ఆగని రేప్‌లు

2024 జూన్ 10న అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం నేదునూరు గ్రామంలో 13ఏళ్ళ మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అత్యాచారయత్నం చేశారు. జూన్‌11న పాడేరు మోదకొండమ్మ జాతరలో ఆరేళ్ల పాపపై దుండగులు అత్యాచారం చేశారు. జూన్ 21న బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో బహిర్భూమికి వెళ్లిన యువతిపై అత్యాచారం ఆపై హత్య చేశారు. జూన్ 26న పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఓప్పిచర్ల గ్రామంలో ఓంటరి మహిళ గండికోట విజయలక్ష్మీ పై అత్యాచారం ఆపై హత్య ... ఇలాంటి ఘటనలు రోజూ జరుగుతున్నా... పోలీసులు పెద్దగా పట్టించుకున్నది లేదు. జులై 6న అనకాపల్లి రాంబిల్లి లో మైనర్ బాలికని ప్రేమపేరుతో వేధించి హత్యచేశాడో ఉన్మాది. 2024 జులై 17న నెల్లూరు జిల్లా కావలి పట్టణం తుఫాన్ నగర్ ప్రాంతంలో నివసిస్తున్న 53 ఏళ్ల మహబూబ్ బాషా అదే ప్రాంతంలో నాలుగో తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆగస్టు 1న విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో గుర్ల మండలానికి చెందిన ఓ యువతి తన ప్రియుడితో కలిసి మాట్లాడుతుండగా బొండపల్లి పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా పని చేస్తున్న చంద్రంపేటకు చెందిన సురేష్ అటుగా వెళ్తూ వీరిని చూశాడు. తాను ఎస్ఐను అని చెప్పి యువతిని బెదిరించి బలవంతంగా తీసుకుని వెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు . ఆగస్టు మూడో తేదీన మార్కాపురంలో తన కూతురి వెంట పడొద్దని మందలించినందుకు నలుగురు యువకులతో వచ్చి ఇంటర్ చదువుతున్న బాలిక తండ్రి నాలి సత్యనారాయణను కత్తులతో పొడిచి యువకులు పరరయ్యారు.


అత్తాకోడళ్లపై లైంగికదాడి

అక్టోబర్‌ 12న శ్రీసత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది. అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం చేశారు ఐదుగురు దుండగులు. ఉపాధికోసం బళ్లారి నుంచి వచ్చిందా వాచ్‌మ్యాన్ కుటుంబం. అర్థరాత్రి రెండు బైకులపై వచ్చి అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో.. ఇక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు వాచ్‌మన్‌. ఈ సమయంలో వాచ్‌మెన్‌తో పాటు.. అడ్డుకోబోయిన అతని కొడుకును సైతం తీవ్రంగా కొట్టారు. కత్తులతో బెదిరించి ఇంట్లోని ఇద్దరు మహిళలపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. నిందితుల్లో మైనర్లూ ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో 16 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడాడు. బాలికను ఆటోలో ఎక్కించుకుని ఊరు శివారుకు తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంత జరుగుతున్నా... చాలా కేసులను పోలీసు అధికారులే నీరుగారుస్తున్నారు. స్థానికంగా వైసీపీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని సమాచారం. మేమింతే... మారేదిలేదంటున్నారు. పోలీసు డిపార్ట్‌మెంట్‌లో కొందరి ప్రవర్తన వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తోంది. వారి స్వామి భక్తితో ... సామాన్యులు ఇబ్బందిపడుతున్నారు.

ఇది కూడా చదవండి:

AP Cabinet: ఈ అంశాలే ప్రధాన ఎజెండాగా ఏపీ కేబినెట్ భేటీ

Tirumala: తిరుమలకు వస్తే పాజిటివ్‌ ఫీలింగ్‌ వస్తుంది..

Updated Date - Nov 06 , 2024 | 04:50 PM