CM Chandrababu: ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. బిజిబిజీ..
ABN , Publish Date - Aug 16 , 2024 | 07:09 PM
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ(శుక్రవారం) సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిలీ విమానాశ్రయంలో చంద్రబాబుకు టీడీపీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు.
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ (శుక్రవారం) సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిలీ విమానాశ్రయంలో చంద్రబాబుకు టీడీపీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు. పూసపాటి విజయరామ గజపతిరాజు(పీవీజీ రాజు) జీవిత చరిత్ర ఇంగ్లీష్ వెర్షన్ పుస్తకాన్ని చంద్రబాబుకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బహూకరించి స్వాగతం పలికారు. అనంతరం సీఎం కారులో కేంద్ర పెద్దలను కలిసేందుకు బయలుదేరారు.
రెండ్రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్రమంత్రులు, పెద్దలను సీఎం చంద్రబాబు కలవనున్నారు. ఇవాళ రాత్రి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో బాబు సమావేశం కానున్నారు. పోలవరం సహా పలు ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం ఇచ్చే నిధుల గురించి చర్చించనున్నారు. అనంతరం ఎంపీలతో డిన్నర్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈనెల 17న సాయంత్రం 4:30గంటలకు ప్రధాని మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. అనంతరం 6గంటలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అవుతారు. అలాగే రాత్రి 7గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడతారు.
అయితే ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.. డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ సెక్రటరీ దేబశ్రీ ముఖర్జీని కలిశారు. ఆయనతోపాటు రాష్ట్ర జలవనరుల శాఖ స్పెషల్ సెక్రటరీ జి.సాయిప్రసాద్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం ప్రాజెక్టు సీఈ కె.నరసింహమూర్తి ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, పెండింగ్ అంశాలపై కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో మంత్రి నిమ్మల చర్చించారు.