Share News

Ayyanna Patrudu: జగన్‌ అసెంబ్లీకి రావాలి.. సమయమిస్తా.. అయ్యన్న కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 09 , 2024 | 06:58 PM

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో అయ్యన్నపాత్రుడు పర్యటించారు. ఈ సందర్భంగా అయ్యన్న మీడియాతో మాట్లాడారు.

Ayyanna Patrudu: జగన్‌ అసెంబ్లీకి రావాలి.. సమయమిస్తా.. అయ్యన్న కీలక వ్యాఖ్యలు

కాకినాడ: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో అయ్యన్నపాత్రుడు పర్యటించారు. ఈ సందర్భంగా అయ్యన్న మీడియాతో మాట్లాడారు. ‘‘జగన్ ఇప్పుడు సీఎం కాదు.. ఒక ఎమ్మెల్యే మాత్రమే. అసెంబ్లీకి వచ్చి జగన్‌ను గెలిపించిన నియోజకవర్గ ప్రజల సమస్యలపై చర్చించాలి. అసెంబ్లీకి రాననడం సరికాదు. జగన్‌కు నా సలహా ఒకటే. పదవులు వస్తుంటాయి.. పోతుంటాయి.. ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలి. దానికి నేను అవకాశం ఇస్తా. నేను అవకాశం ఇవ్వనని ఎందుకు అనుకుంటున్నారు. అన్ని పార్టీలకు ఇచ్చిన విధంగానే జగన్‌కు మాట్లాడటానికి అవకాశం ఇస్తా’’ అని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.


మా ప్రభుత్వ లక్ష్యం అదే: ప్రత్తిపాటి పుల్లారావు

PRATTI.jpg

పల్నాడు: అక్రమాల బారి నుంచి ప్రజలను కాపాడాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు (Prattipati Pullarao) తెలిపారు. చిలకలూరిపేటలో మున్సిపల్ అధికారులతో శనివారం నాడు ఎమ్మెల్యే ప్రత్తిపాటి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ... ఏపీవ్యాప్తంగా ఐదేళ్లుగా భూ అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపించారు. అడ్డగోలు రిజిస్ట్రేషన్లతో ప్రజలు నష్టపోకుండా చూడాలన్నదే తమ ప్రభుత్వం ఉద్దేశమని అన్నారు. అక్రమ లే అవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు.

వైసీపీ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు, భూ లావాదేవీలు చేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వాన్ని, అధికార ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ దుష్ప్రచారం చేసినా చర్యలపై వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ, అసైన్డ్‌ భూములు కొట్టేసి వేసిన వెంచర్ల విషయంలో ఎవర్నీ వదిలిపెట్టమని హెచ్చరించారు. వ్యవసాయ భూమి 12 సెంట్లపైనే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని అన్నారు. కానీ చిలకలూరిపేటలో 2, 3 సెంట్లు కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.


ఏపీలో అశాంతిని సృష్టించాలని వైసీపీ కుట్రలు: ఆరేటి మహేష్ బాబు

విశాఖపట్నం: భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహంపై అగంతకుల ముసుగులో వైసీపీ దాడి చేసిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆరేటి మహేష్ బాబు (Areti Mahesh Babu) ఆరోపించారు. మహనీయుల విగ్రహాలపై దాడులు చేసి రాష్ట్రంలో అశాంతిని సృష్టించాలని వైసీపీ కుట్రలు చేస్తుందని విమర్శించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దళిత, గిరిజనులపై దాడులు జరిగినప్పుడు వైసీపీ ప్రజా ప్రతినిధులు ఎందుకు ధర్నాలకు దిగలేదు? అని ప్రశ్నించారు.

విదేశీ విద్యోన్నతి పథకానికి అంబేద్కర్ పేరును తొలగించి జగన్ రెడ్డి పేరుని పెట్టినప్పుడు వైసీపీ దళిత నేతలు ఏం చేశారు..? అని ప్రశ్నించారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి అల్లర్లు రేపడం జగన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య.. హత్యారాజకీయాలకు వైసీపీ పెట్టింది పేరని విమర్శించారు. వైసీపీ నాయకులు అసంబద్ధంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లపై అవాకులు చెవాకులు పేలితే తాటతీస్తామని ఆరేటి మహేష్ బాబు హెచ్చరించారు.

Updated Date - Aug 09 , 2024 | 07:26 PM