Share News

CM Chandrababu: చంద్రబాబు చేతిలో కెమెరా.. క్లిక్‌మన్న ఫొటోలు

ABN , Publish Date - Aug 19 , 2024 | 12:18 PM

వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. కెమెరా చేతపట్టి స్వయంగా ఫొటో జర్నలిస్టులను ఫొటోలు తీశారు. ఉండవల్లిలోని తన నివాసంలో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న ఫొటో జర్నలిస్టులు ముఖ్యమంత్రి చంద్రబాబును సోమవారం (ఈరోజు) కలిశారు. సీఎం వారిని ఆప్యాయంగా పలకరించారు.

CM Chandrababu:  చంద్రబాబు చేతిలో కెమెరా.. క్లిక్‌మన్న ఫొటోలు

అమరావతి: వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫొటోగ్రాఫర్లు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కెమెరా చేతపట్టి స్వయంగా ఫొటో జర్నలిస్టులను ఫొటోలు తీశారు. ఆసక్తికరమైన ఈ దృశ్యం ఉండవల్లిలోని ఆయన నివాసంలో చోటుచేసుకుంది. చంద్రబాబు తన నివాసంలో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న ఫొటో జర్నలిస్టులను సోమవారం (ఈరోజు) కలిశారు. ఈ సందర్భంగా వారిని సీఎం చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు.


వారి చేతిలో కెమెరాను తీసుకుని స్వయంగా సీఎం ఫొటోలు క్లిక్ మనిపించారు. మీడియాలో ఫొటోగ్రఫీ విభాగంలో విధులు చాలా కష్టతరమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఈ రంగంలో ప్రతిభ చూపుతున్న వారిని చంద్రబాబు అభినందించారు. నాణ్యమైన సేవలతో ఫొటోగ్రఫీ రంగం బాగుండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. చంద్రబాబును కలిసిన వారిలో తెలుగు, ఇంగ్లీష్ పత్రికల్లో పనిచేస్తున్న సీనియర్ ఫొటో జర్నలిస్టులు ఉన్నారు.


అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లి నివాసం నుంచి రోడ్డు మార్గం ద్వారా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి బయయలుదేరి వెళ్లనున్నారు. ఆపై తిరుపతి ఎయిర్‌పోర్టు నుంచి శ్రీ సిటీకి హెలికాప్టర్లో బయలుదేరుతారు. ఈ సందర్భంగా శ్రీ సిటీలో పలు కంపెనీలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను సీఎం చంద్రబాబు చేయనున్నారు. అనంతరం నెల్లూరు జిల్లాలో సోమశిల ప్రాజెక్టు ఏరియాను సీఎం సందర్శించనున్నారు. అక్కడ స్థానిక రైతులతో సమావేశమవుతారు. తిరిగి సాయంత్రం 6 గంటలకు ఉండవల్లిలోని నివాసానికి హెలికాప్టర్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకోనున్నారు. అయితే , జగన్ ప్రభుత్వ హయాంలో సోమశిల డ్యాం పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే.


వరదల సమయంలో డ్యాం పూర్తి సామర్ధ్యం కంటే అధికంగా నీటి నిల్వ వచ్చి చేరింది. దీంతో అధికారులు ఒక్కసారిగా 4 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నీటి ఉధృతికి డయాఫా, అప్రాన్, శివాలయం, అధికారుల భవనాలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే కేంద్ర బృందాలు రెండు సార్లు డ్యాంను పరిశీలించి, ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. అయినా జగన్ ప్రభుత్వం లెక్కచేయని పరిస్థితి.

Updated Date - Aug 19 , 2024 | 12:40 PM