CM Chandrababu: వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ
ABN , Publish Date - Nov 04 , 2024 | 09:36 AM
రాజధాని అమరావతి నిర్మాణ పనులు జోరందుకున్నాయి. కూటమి ప్రభుత్వంలో పనులు అనతికాలంలోనే వేగం పుంజుకున్నాయి. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ప్రభుత్వ భవనాల నిర్మాణం సాగుతుండగా, వివిధ శాఖలు, కేంద్ర సంస్థలు కూడా తమ పనులు ప్రారంభించేందుకు ముందుకొస్తున్నాయి. కోర్ క్యాపిటల్‌లోని ప్రభుత్వ కార్యాలయ, సిబ్బంది నివాస భవనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ఇవాళ (సోమవారం) వరుస సమీక్షలతో బిజీ బిజీగా ఉండనున్నారు. ఉదయం 11.30 గంటలకు ఏపీ సచివాలయానికి ముఖ్యమంత్రి వెళ్తారు.సీఆర్డీఏ అథారిటీకి చైర్మన్ హోదాలో సీఎం చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. 29వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో పలు కీలక విషయాలపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు చర్చిస్తారు.
ఈ సమీక్షకు మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. గతంలో అమరావతి నిర్మాణానికి టెండర్లు పొందిన సంస్థల ఒప్పందాల రద్దుపై నిర్ణయం తీసుకోనున్నారు. తాజాగా మరోసారి టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. గతంలో ఇచ్చిన రేటుకు నిర్మాణాలు చేపట్టలేమని గుత్తేదారులు చెబుతున్నారు. దీంతో కొత్తగా టెండర్లు పిలిచేందుకు మార్గం సుగమం చేయడంలో భాగంగా ఈరోజు సీఆర్డీఏ అథారిటీ కీలక సమావేశం జరగనుంది. అనంతరం నూతన స్పోర్ట్స్ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు.
ఏపీలో క్రీడలను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడతారు. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమీక్షలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొననున్నారు. అలాగే సాయంత్రం వ్యవసాయ, పశుసంవర్ధక శాఖపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సమీక్షకు మంత్రి అచ్చెన్నాయుడు, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
కాగా.. రాజధాని అమరావతి పనులపై స్పష్టత కోసం సీఆర్డీయే ప్రయత్నాలు ప్రారంభించింది. తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించిన భవనాలను ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పునాదుల నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భవనాల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు చెన్నై ఐఐటీతోపాటు వరంగల్ ఎన్ఐటీ, మరో రెండు సంస్థలకు బాధ్యతలు అప్పగించాలని సీఆర్డీయే నిర్ణయించింది. దీంతో పాటు రైతులకు ఇచ్చిన ప్లాట్‌లలో మౌలిక సదుపాయాలకల్పనపై కూడా ఒక నిర్ణయానికి రావాలని, ఇందుకోసం క్షేత్రస్థాయిలో అధ్యాయనం చేయాలని సీఆర్డీయే నిర్ణయించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
వారి కోసమే రెడ్‌బుక్.. హోం మంత్రి
84 వేల కోట్ల పెట్టుబడులు 5 లక్షల ఉద్యోగాలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News