Share News

TDP: వారిని సామాజిక కార్యకర్తలనటం సిగ్గుచేటు: కనపర్తి శ్రీనివాసరావు

ABN , Publish Date - Nov 13 , 2024 | 10:11 AM

తల్లికి.. చెల్లికి తేడా లేకుండా నీచాతి నీచంగా పోస్టులు పెట్టిన సోషల్ మీడియా సైకోలు సజ్జల భార్గవరెడ్డి, వర్రా రవీందర్ రెడ్డిలను వైఎస్సార్సీపీ " సామాజిక కార్యకర్తలనటం" సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో విమర్శించారు.

TDP: వారిని  సామాజిక కార్యకర్తలనటం సిగ్గుచేటు: కనపర్తి శ్రీనివాసరావు

గుంటూరు జిల్లా: తెలుగుదేశం పార్టీ (TDP) రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు (Kanaparthi Srinivasa Rao) వైఎస్సార్సీపీ సోషల్ మీడియా (YSRCP Social Media) సైకోలపై (Psychos) తీవ్రస్థాయిలో మండిపడ్డారు (Fire). తల్లికి.. చెల్లికి తేడా లేకుండా నీచాతి నీచంగా పోస్టులు పెట్టిన సోషల్ మీడియా సైకోలు సజ్జల భార్గవరెడ్డి, వర్రా రవీందర్ రెడ్డిలను వైఎస్సార్సీపీ " సామాజిక కార్యకర్తలనటం" సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రశ్నించి మరణించిన డాక్టర్ సుధాకర్, కుండబద్ధలు సుబ్బారావు, పాలకుల అవినీతి, అరాచకాలను ఎండగట్టిన సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు, డాక్టర్ పీవీ రమేష్ లను సామాజిక కార్యకర్తలంటారని అన్నారు. గత అసెంబ్లీలో సైకోలుగా వ్యవహరించిన కొడాలి నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, ద్వారంపూడి తదితరుల ప్రసంగాలను పరిశీలించి స్పీకర్ చర్యలు చేపట్టాలని కనపర్తి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.


కాగా కూటమి నేతలు, వారి కుటుంబ సభ్యులపై సోషల్‌ మీడియాలో కాలకూట విషం చిమ్మే ఎంపీ అవినాశ్‌ రెడ్డి అనుచరుడు వర్రా రవీంద్రా రెడ్డి రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు అనేక సంచలన విషయాలు వెల్లడించారు. ఈ కేసులో వర్రాను ఏ1గా పేర్కొనగా... వైసీపీ సోషల్‌ మీడియా విభాగానికి ఇన్‌చార్జిగా వ్యవహరించిన సజ్జల భార్గవ్‌ రెడ్డిని రెండో నిందితుడిగా (ఏ2) చేర్చారు. వర్రాతోపాటు... అతడికి సహకరించిన గుర్రంపాటి వెంకట సుబ్బారెడ్డి, గురజాల ఉదయ్‌ కుమార్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వర్రా వాంగ్మూలం ఆధారంగా అనేక కీలక అంశాలను గుర్తించామని, ఈ వ్యవస్థీకృత నేరంలో భాగస్వాములైన మొత్తం 45 మందిపై కేసు నమోదు చేశామని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. పులివెందుల కోర్టుకు దీనిని సమర్పించారు. వర్రా రవీంద్రా రెడ్డి తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్టు చేసిన 40 నీచమైన వ్యాఖ్యల స్ర్కీన్‌షాట్లను కూడా సేకరించామని... అవి తాను పోస్టు చేసినవే అని అతడు అంగీకరించాడని చెప్పారు. వైసీపీ సోషల్‌ మీడియా పేరుతో జరిగే ‘ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌’లో వర్రా రవీంద్రా రెడ్డి భాగస్వామిగా ఉంటూ నీచమైన పనులు చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్‌లో తప్పుడు వార్తలు సృష్టించడం, నీచమైన వ్యాఖ్యలు చేయడం వ్యవస్థీకృతంగా జరుగుతోందన్నారు. ఇందులో... సజ్జల భార్గవ్‌ రెడ్డితోపాటు సిరిగిరి అర్జున్‌ రెడ్డి (ఏ3)ది కీలక పాత్ర అని తెలిపారు. ‘‘వైసీపీ సోషల్‌ మీడియా నుంచి వచ్చే కంటెంట్‌ తీసుకుని చిన్నపిల్లలు, మహిళలపై అసభ్య, అసహ్యకరమైన వ్యాఖ్యలు చేయడం.. తమకు నచ్చని పార్టీలనేతలపై జుగుప్సాకరమైన మార్ఫింగ్‌ ఫొటోలు పెట్టడం.. హోంమంత్రి అనిత వ్యక్తిత్వాన్ని హననం చేయడం.. వ్యవస్థలంటే లెక్కలేకుండా రెచ్చిపోవడం వర్రా రవీందర్‌ రెడ్డి నేర స్వభావం’’ అని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.


భయానక వాతావరణం...

‘‘అనుచిత పోస్టులు వ్యాప్తిచేసే వైసీపీ సోషల్‌ మీడియా విభాగంలో వర్రా రవీందర్‌ రెడ్డి 2012 నుంచే భాగస్వామిగా ఉన్నాడు. అతడికి సజ్జల భార్గవ్‌రెడ్డి తదితరులతో మంచి సంబంధాలున్నాయి. వైసీపీ సోషల్‌ మీడియా విభాగం కోకన్వీనర్‌గా వర్రా క్రియాశీలక పాత్ర పోషించాడు. అప్పట్లో అధికారంలో ఉండటంతో... ఏమాత్రం భయంలేకుండా తప్పుడు వార్తలు సృష్టించి, ప్రచారం చేశారు. ఏ1 వర్రా రవీంద్రా రెడ్డి, ఏ2 సజ్జల భార్గవ రెడ్డి, వారి బృందంలోని సభ్యులు నైతికత, నీతి లేకుండా... విచ్చలవిడిగా, దారుణమైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. తమకు గిట్టని పార్టీల నాయకులను, వారి కుటుంబ సభ్యులను, పిల్లలను అవమానించేలా పోస్టులు పెట్టారు. సాధారణ జీవితం గడిపేందుకే భయపడేలా చేశారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టి... హింసను రాజేశారు. తాడేపల్లి నుంచి వచ్చే కంటెంట్‌ను వీలైనంత ఎక్కువ మందికి చేరవేసేందుకు ప్రతినెలా 13వేలు వేతనం తీసుకొంటున్నట్లు వర్రా రవీందర్‌ రెడ్డి తన వాంగ్మూలంలో చెప్పాడు’’ అని పోలీసులు తెలిపారు. చట్టంపై గౌరవం, భయం ఏమాత్రంలేని ఇటువంటి వ్యక్తిని బయటికి వదిలితే సమాజానికి నష్టం జరుగుతుందని, జైల్లో పెట్టాలని కోర్టును అభ్యర్థించారు.

సజ్జల భార్గవ్‌ రెడ్డి, అర్జున్‌ రెడ్డిపై ఎల్‌వోసీ..

రాజకీయ ప్రత్యర్థులపై బూతు పురాణానికి బీజం వేసిన వైసీపీ సోషల్‌ మీడియా బాధ్యుడు సజ్జల భార్గవ్‌రెడ్డి కోసం పోలీసుల వేట ముమ్మురం చేశారు. ఆయన సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌ కావడంతో గాలింపు మొదలుపెట్టారు. ఆయన విదేశాలకు పారిపోయే అవకాశం ఉన్నందున లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ (ఎల్‌వోసీ) జారీ చేశారు. కడప జిల్లాలో నమోదైన కేసుల్లో సజ్జల భార్గవ్‌ రెడ్డి, అర్జున్‌ రెడ్డి కోసం ఎల్‌వోసీ జారీ చేశామని, వారి ఆచూకీ తెలిస్తే చెప్పాలని కర్నూలు రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా మరికొందరు సోషల్‌ సైకోలపైనా ఎల్‌వోసీలు జారీ చేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

గూడ్స్ రైలు ప్రమాదం.. పలు రైళ్లు రద్దు..

విద్యార్ధినిపై వైఎస్సార్సీపీ సర్పంచ్ అత్యాచార యత్నం

అసెంబ్లీలో మూడు సవరణ బిల్లులు ప్రవేశపెట్టనున్న సర్కార్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 13 , 2024 | 10:11 AM