Minister Dola: ఆ హత్యను టీడీపీ మీదకు నెట్టడం సిగ్గుచేటు: మంత్రి డోలా
ABN , Publish Date - Jul 19 , 2024 | 04:28 PM
గుంటూరు జిల్లా వినుకొండ (Vinukonda)లో జరిగిన హత్యను వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) తెలుగుదేశం పార్టీకి ఆపాదించడం సిగ్గుచేటని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి(Minister Veeranjaneya Swamy) అన్నారు. వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యను రాజకీయం చేయడం ఆయనకే చెల్లుతుందని మంత్రి డోలా ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: గుంటూరు జిల్లా వినుకొండ(Vinukonda)లో జరిగిన హత్యను వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) తెలుగుదేశం పార్టీకి ఆపాదించడం సిగ్గుచేటని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి(Minister Veeranjaneya Swamy) అన్నారు. వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యను రాజకీయం చేయడం ఆయనకే చెల్లుతుందని మంత్రి డోలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ ప్రచారాలకు జగన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఆయన ఎద్దేవా చేశారు.
అయితే వినుకొండలో బుధవారం జరిగిన దారుణ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ రోజు రాత్రి వైసీపీ నేత రషీద్‌ను జిలానీ అనే వ్యక్తి నడిరోడ్డుపై కత్తితో దాడి చేసి చంపేశాడు. దీనిపై ఇప్పటికే టీడీపీ, వైకాపా నేతల మధ్య వార్ నడుస్తోంది. దీనికి తోడు ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ స్పందించడం అగ్నికి ఆద్యం పోసినట్లయింది. ఆయన బెంగళూరు పర్యటనను సైతం మధ్యలో ఆపేసి బాధిత కుటుంబాన్ని పరామర్శించేందకు వినుకొండకు వచ్చారు. అయితే ఘటనపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన తప్పుపట్టడంపై మంత్రి డోలా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి డోలా మాట్లాడుతూ.." ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించినా జగన్ మాత్రం తన బుద్ధి మార్చుకోలేదు. సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డిని సైతం చంపి నారాసుర రక్త చరిత్ర అంటూ పుస్తకం రాసి టీడీపీపై తప్పుడు ప్రచారాలు చేశారు. వినుకొండలో జరిగిన హత్యకు ముఖ్యకారకుడు జగనే. వైసీపీ హయాంలో హతుడు రషీద్, నిందితుడు జిలానీ మధ్య జరిగిన గొడవలపై అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే నేడు ఈ హత్య జరిగేదా?. ఆనాడు జగన్ చేసిన పాపానికి ఇవాళ ఓ వ్యక్తి తన నిండు ప్రాణాన్ని మూల్యంగా చెల్లించాల్సి వచ్చింది. జగన్ ఇకనైనా శవ రాజకీయాలు మానుకోవాలి. లేదంటే ప్రజలే ఆయణ్ని శాశ్వతంగా రాజకీయాల నుంచి పంపించేస్తారు" అని అన్నారు.
ఘటనపై మాజీ ముఖ్యమంత్రి ఏమన్నారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని, రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని మాజీ ముఖ్యమంత్రి జగన్ తన ఎక్స్‌లో ఖాతాలో గురువారం రోజున పోస్టు పెట్టారు. వైసీపీ పార్టీని అణగదొక్కాలనే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్ష సాధింపు, విధ్వంసాలకు అడ్డాగా మారిపోయిందని దుయ్యబట్టారు. అందుకు వినుకొండ ఘటనే ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి, ఇతర హోదాల్లో ఉన్న అధికార పార్టీ నేతలు.. రాజకీయ దురుద్దేశాలతోనే ఇలాంటి ఘటనలు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో పరిస్థితులపై ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకి విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.
దీనిపై రాష్ట్రవ్యాప్తంగా కూటమి నేతలు మండిపడుతున్నారు. వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులుముతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ హయాంలో జరిగిన దాడులు, దారుణాలపై జగన్ రెడ్డి సమాధానం చెప్పాలంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.