Share News

Minister Narayana: వైద్యారోగ్యశాఖ అధికారులకు మంత్రి నారాయణ కీలక ఆదేశాలు

ABN , Publish Date - Jul 11 , 2024 | 04:53 PM

పిడుగురాళ్లలో కేసులు పెరుగుతుండటంపై ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ అధికారులకు మంత్రి నారాయణ (Minister Narayana) కీలక ఆదేశాలు జారీ చేశారు.

Minister Narayana: వైద్యారోగ్యశాఖ అధికారులకు మంత్రి నారాయణ కీలక ఆదేశాలు
Minister Narayana

పల్నాడు జిల్లా: పిడుగురాళ్లలో కేసులు పెరుగుతుండటంపై ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ అధికారులకు మంత్రి నారాయణ (Minister Narayana) కీలక ఆదేశాలు జారీ చేశారు. పిడుగురాళ్ల లెనిన్ నగర్ , మారుతి నగర్‌లో మంత్రి నారాయణ ఈరోజు(గురువారం) పర్యటించారు. డయేరియా ప్రభావిత ప్రాంతంలో అధికారులతో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించారు. పారిశుధ్య నిర్వహణ, తాగు నీటి బోర్లను పరిశీలించారు.


స్వయంగా కొంతమంది ఇళ్లకు వెళ్లి నీటి సరఫరా వాడకంపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లెనిన్ నగర్ పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను మంత్రి నారాయణ పరామర్శించారు. బాధితులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. డయేరియా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో అధికారులతో మంత్రి నారాయణ సమీక్షించారు.


పిడుగురాళ్లలోని లెనిన్‌నగర్, మారుతి నగర్‌లో ఇప్పటి వరకూ 60 డయేరియా కేసులు నమోదయ్యాయని మంత్రి నారాయణ తెలిపారు. ప్రస్తుతం 39 మంది వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. కృష్ణా నది నుంచి తాగునీరు అందించేందుకు 16 కి.మీ పైప్ లైన్ ఉందని దీంతో పాటు పట్టణంలో 7 పవర్ బోర్స్, 36 హాండ్ బోర్స్ ఉన్నాయని చెప్పారు. ఒక పవర్ బోర్‌లో నైట్రేట్ ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించినట్లు వివరించారు. కృష్ణా వాటర్ పైప్ లైన్ లీకేజి ఉండటంతో ఐదు రోజుల పాటు నీటి సరఫరా నిలిపి వేశారని మండిపడ్డారు.


ఈ ఐదు రోజుల్లో బోరు నీటిని వాడారని చెప్పారు. కృష్ణా పైప్ లైన్ ద్వారా ప్రస్తుతం తాగు నీరు ఇస్తున్నప్పటికీ ఇంకా కేసులు వస్తున్నాయని చెప్పారు. నీటిని పరీక్ష కోసం విజయవాడ ల్యాబ్‌కు ఈరోజు శాంపిల్స్ పంపిస్తున్నామని వివరించారు. లెనిన్ నగర్, మారుతి నగర్ ప్రజలు నీళ్లు కాచి తాగాలని అన్నారు. పట్టణంలో ఉన్న ఆర్వో ప్లాంట్స్ అన్నీ కూడా టెస్ట్ చేయాల్సి ఉందని చెప్పారు. రాబోయే 5, 6 రోజుల్లో నీరు ఎక్కడ కలుషితం ఆయిందనేది క్లారిటీ వస్తుందని చెప్పారు. కారణం తెలిసే వరకూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. లెనిన్ నగర్,మారుతి నగర్‌లో డ్రెయిన్‌లలో నీరు పోవడం లేదన్నారు. మొత్తం సిల్ట్, కంపలు తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు.


రేపు అత్యవసరంగా డ్రైన్లలో సిల్ట్ , ముళ్ల కంపలు తొలగించాలని ఆదేశాలిచామని అన్నారు. 2014 - 19 లో టీడీపీ హయాంలో వర్షా కాలంలో స్పెషల్ డ్రైవ్ చేసే వాళ్లమని అన్నారు. గత ప్రభుత్వం ఆసియన్ ఇన్‌ఫ్రా బ్యాంక్ ఇచ్చిన రూ. 5300 కోట్లలో రూ.200 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని అన్నారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ ఫండ్ ఇవ్వకపోవడంతో నిధులు విడుదల కాలేదని అన్నారు. కేంద్రంతో ఉన్న సంబంధాలతో రాష్ట్రానికి నిధులు వచ్చేలా సీఎం చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఆసియన్ ఐన్‌ఫ్రా బ్యాంక్, అమృత్ నిధులపై దృష్టి పెట్టామని మంత్రి నారాయణ తెలిపారు.

Updated Date - Jul 11 , 2024 | 06:43 PM