Share News

Minister Narayana: అన్న క్యాంటీన్లపై మంత్రి నారాయణ కీలక ప్రకటన

ABN , Publish Date - Aug 06 , 2024 | 09:27 PM

అన్న క్యాంటీన్లను ఆగస్టు15వ తేదీన ఒకేసారి ప్రారంభిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) కీలక ప్రకటన చేశారు. 100 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని వెల్లడించారు.

Minister Narayana: అన్న క్యాంటీన్లపై మంత్రి నారాయణ కీలక ప్రకటన
Minister Narayana

అమరావతి: అన్న క్యాంటీన్లను ఆగస్టు15వ తేదీన ఒకేసారి ప్రారంభిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) కీలక ప్రకటన చేశారు. 100 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఏపీ సచివాలయంలో మంగళవారం నాడు మంత్రి నారాయణ అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. క్రెడాయ్, నెరెడ్కో వంటి సంస్థ ల బిల్డర్లతో సమావేశం అయ్యామని చెప్పారు.


వారు కొన్ని సమస్యలు తమ దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. నాలా ట్యాక్స్, వేకెంట్ ట్యాక్స్, ఫైర్, ఎయిర్ పోర్ట్, టీడీఆర్ బాండ్స్, వంటి పలు అంశాలు తమకు చెప్పారని తెలిపారు. టౌన్ ప్లానింగ్‌లో ఇబ్బందులు పరిష్కారానికి నెల్లూరులో ఇటీవల ఇక డ్రైవ్ పెట్టానని వివరించారు. కొన్ని సమస్యలు అప్పటికప్పుడు పరిష్కారం చేసినట్లు చెప్పారు. ప్రజలకు, బిల్డర్లకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలనేది తమ ఆకాంక్ష అని వెల్లడించారు. ప్రతి మున్సిపాలిటీలో తానే స్వయంగా డ్రైవ్‌లో పాల్గొంటానని తెలిపారు.


‘‘విజయవాడలో ఈరోజు సమావేశంలో కూడా కొన్ని అంశాలు తెలుసుకున్నాం. ఇతర రాష్ట్రాల్లో టౌన్ ప్లానింగ్ ఎలా పని చేస్తుందో పరిశీలిస్తున్నాం. పది రాష్ట్రాల్లో ఈ పరిశీలన చేసి విధి విధానాలు రూపొందిస్తాం. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటాం. ఈసీలు తెచ్చే విషయంలో ఆన్ లైన్‌లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రెవెన్యూ శాఖ మంత్రితో కూడా ఈ విషయం చర్చించాం. మూడు నెలల్లో అన్ని సేవలను సరళీకృతం చేస్తాం. నిబంధనల ప్రకారం కట్టడాలు ఉండాలని చెబుతున్నాం. అనధికారికంగా వేసిన లే అవుట్‌పై ప్రచారం చేస్తాం. పలానా సర్వే నెంబర్ అనధికారం... రిజిస్ట్రేషన్ వద్దని ప్రకటిస్తాం. ఫ్లాట్‌లు కొనే ముందు ఒకసారి పరిశీలన చేసుకోండి.


‘‘ఈ అంశాలను ఆన్‌లైన్‌లో ఉంచి అందరూ తెలుసుకునేలా చేస్తాం. మూడు నెలల్లో ఈ విధానం అమల్లోకి వస్తుంది. రేపు ఉదయం ఏడు గంటలకు జంగిల్ క్లియరెన్స్‌ను ప్రారంభిస్తాం. 99 డివిజన్ ల్లో ఒకేసారి రేపు పనులు మొదలు పెట్టి 30 రోజుల్లో పూర్తి చేస్తాం. ఆర్ 5 జోన్ విషయంలో అవసరమైతే టిడ్కో ఇళ్లు కేటాయిస్తాం. సీఆర్డీఏ పరిధిలో ఉన్న అందరికీ అక్కడే టిడ్కో ఇళ్లు ఇస్తాం.ఆన్‌లైన్‌లో అనుమతులు ఒకేసారి ఇచ్చేలా చేస్తాం’’ అని మంత్రి నారాయణ పేర్కొన్నారు.


మంత్రి నారాయణను కలిసిన బిల్డర్లు

మంత్రి నారాయణను బిల్డర్లు మంగళవారం నాడు‌ కలిసి సమస్యలు విన్నవించారు. తాము అనుమతుల విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం. సింగిల్ విండో విధానంలో అనుమతులు కావాలని‌ కోరాం. 15 రోజుల్లో ప్లాన్ ఇచ్చే అవకాశం ఇవ్వాలని చెప్పాం. నిర్మాణం పూర్తి అయ్యాక కూడా లేబర్ సెస్ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారు. ఖాళీ స్థలాలు, లే అవుట్ల గురించి కూడా వివరించాం. రెండు, మూడు నెలల్లో అన్నీ సెట్ చేసి అమలు చేస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారని బిల్డర్లు తెలిపారు.

Updated Date - Aug 06 , 2024 | 09:27 PM