Kolusu Partha Sarathy: నూజివీడు ఘటనపై ముఖ్యమంత్రిని కలిసిన మంత్రి పార్థసారథి..
ABN , Publish Date - Dec 17 , 2024 | 07:20 PM
నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వైసీపీ నేత, మాజీ మంత్రి హాజరుకావడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కార్యక్రమానికి కూటమి నేతలు ఆహ్వానించకుండానే జోగి వచ్చారని మంత్రి కొలుసు పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఇప్పటికే వివరణ ఇచ్చారు.
అమరావతి: నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వైసీపీ నేత, మాజీ మంత్రి హాజరుకావడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కార్యక్రమానికి కూటమి నేతలు ఆహ్వానించకుండానే జోగి వచ్చారని మంత్రి కొలుసు పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఇప్పటికే వివరణ ఇచ్చారు. అయితే ఘటనపై తెలుగు తమ్ముళ్లు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఇవాళ (మంగళవారం) మంత్రి పార్థసారథి కలిశారు. ఏపీ సచివాలయానికి వచ్చిన మంత్రి.. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఘటనపై పూర్తి సమాచారాన్ని చంద్రబాబుకు వివరించారు. జోగి రమేశ్ కార్యక్రమానికి రావడంతో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ.. "నూజివీడు ఘటనపై ఏపీ సచివాలయానికి వెళ్లి సీఎం చంద్రబాబుని కలిశాను. వైసీపీ నేత జోగి రమేశ్ ఎపిసోడ్‌లో టీడీపీ కార్యకర్తలు బాధపడిన మాట నిజమే. గౌడ సామాజికవర్గం వాళ్లు కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. నాకు పంపిన ఇన్విటేషన్‌లో జోగి రమేశ్ పేరు లేదు. ఎన్జీ రంగా శిష్యుడిగా ఆయన అడుగుజాడల్లో నడిచిన ఓ మహానాయకుడి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళ్లాను. అక్కడికి జోగి రమేశ్ వచ్చారు. కూటమి నేతలు ఎవ్వరూ అతన్ని పిలవలేదు. అప్పటికీ అందరికంటే ముందే మాట్లాడి నేను వచ్చేశాను. ఇకపై ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటానని సీఎంకు చెప్పాను. కొన్ని నెలల ముందే పార్టీలోకి వచ్చినా టీడీపీ కార్యకర్తలు నన్ను ఆదరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై జోగి రమేశ్ దాడికి వెళ్లినప్పుడు అందరితోపాటు నేను బాధపడ్డా. అలాంటి వ్యక్తితో నేను వేదికను పంచుకోవాల్సి వచ్చింది. అది నా ప్రమేయం లేకుండా జరిగిన విషయం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటానని సీఎంకు వివరించా.
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల లోపు 20 లక్షలు మందికి ఉద్యోగాలు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గూగుల్, ఆర్సిలర్ మిట్టల్, హెచ్‌పీ వంటి మెగా సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అవుతున్నాయి. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం మూలంగా పారిశ్రామిక రంగం కుదేలైపోయింది. పరిశ్రమల స్థాపన కోసం స్కిల్ డెవలప్మెంట్ చేసి ముందుకు వెళ్తాం. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నూజివీడులో ఈనెల 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. ఐటీ, ఫార్మా, స్పిన్నింగ్ మిల్స్ నుంచి ఉద్యోగాలు కల్పన కోసం దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. జాబ్ మేళాను నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిర్వహిస్తున్నాం. నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని" చెప్పారు.
ఇవి కూడా చదవండి...
Read Latest AP News And Telugu News