AP Politics: చంద్రబాబు నివాసానికి క్యూ కడుతున్న మంత్రివర్గ ఆశావహులు
ABN , Publish Date - Jun 10 , 2024 | 07:48 PM
ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు(TDP chief Chandrababu) నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. మంత్రివర్గ ఆశావహులు పెద్దఎత్తున ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు. మంత్రివర్గ కూర్పుపై సుదీర్ఘ కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో అధినేత దృష్టిలో పడేందుకు ఎమ్మెల్యేలు ఆరాటపడుతున్నారు.
అమరావతి: ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు(TDP chief Chandrababu) నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. మంత్రివర్గ ఆశావహులు పెద్దఎత్తున ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు. మంత్రివర్గ కూర్పుపై సుదీర్ఘ కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో అధినేత దృష్టిలో పడేందుకు ఎమ్మెల్యేలు ఆరాటపడుతున్నారు. చంద్రబాబుని ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూటమి ఎమ్మెల్యేలు జూన్ 11న ఎన్నుకోనున్నారు. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌లో జూన్ 11న ఉదయం 9:30గంటలకు తెలుగుదేశం-జనసేన-భాజపాకూటమి శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఆయన్ను శాసనసభా పక్ష నేతగా ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు.
జూన్ 11న కూటమి శాసనసభా పక్ష సమావేశంలో చంద్రబాబు పేరును ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ప్రతిపాదించనున్నారు. దీన్ని భాజపా ఎమ్మెల్యేలు బలపరచనున్నారు. అనంతరం ఈ తీర్మానాన్ని గవర్నర్‌కు పంపుతారు. తీర్మానం అందాక ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటు చేయాలంటూ తెలుగుదేశం కూటమికి గవర్నర్ ఆహ్వానం పంపనున్నారు. ఈనెల 12న ఉదయం 11:27గంటలకు నవ్యాంధ్రప్రదేశ్ మూడో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో మంత్రివర్గంలో చోటు కోసం చంద్రబాబు ఇంటి చుట్టూ ఎమ్మెల్యేలు ప్రదక్షిణలు చేస్తున్నారు.