Nimmala Ramanaidu: కన్నతల్లిని, తోడబుట్టిన చెల్లిని మోసం చేశావ్..జగన్‌పై మంత్రి నిమ్మల విసుర్లు
ABN , Publish Date - Oct 31 , 2024 | 06:41 PM
ఇసుక మాఫియాతో అన్నమయ్య డ్యాంను కూలగొట్టి 38 మంది ప్రాణాలు పోవడానికి మాజీ సీఎం జగన్ కారణమయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పులిచింతల, గుళ్ళకమ్మ గేట్లు కొట్టుకుపోవడం జగన్ పాపం కాదా అని ప్రశ్నించారు. పోలవరానికి కేంద్రం ఇచ్చిన రూ. 3800కోట్లు దారి మళ్లించి నదుల అనుసంధానానికి గండి కొట్టారని మండిపడ్డారు.
అమరావతి: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికు మంత్రి నిమ్మల రామానాయుడు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈమేరకు ట్విట్టర్(ఎక్స్)లో జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అబద్ధాల్లో జగన్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. పోలవరం ఎత్తుపై ఇప్పటికైనా జగన్ తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. కన్నతల్లిని, తోడబుట్టిన చెల్లిని మోసం చేసి జగన్ చీత్కారానికి గురయ్యారని విమర్శించారు. ప్రపంచ చరిత్ర తిరగేస్తే తల్లిని, చెల్లిని మోసం చేసినటువంటి దౌర్భాగ్య రాజకీయవేత్త ఎక్కడా కనిపించరని.. కేవలం జగన్ తప్ప అని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.
ప్రజాజీవితంలో ఉండటానికి అర్హత లేదన్న విషయం జగన్‌కు ఇప్పటికే అర్థం అయిపోయిందని ఎద్దేవా చేశారు. అందుచేతనే డైవర్షన్ పాలిటిక్స్‌కు జగన్ తెర లేపారని ఆక్షేపించారు. పోలవరం ఎత్తుపై ఆయన చెత్త మీడియాలో అబద్ధాలు అచ్చు వేసి గడిచిన రెండు రోజులుగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు . దానికి తాను పూర్తి వివరాలతో వివరించానని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌కు జగన్ చేసిన ద్రోహం గురించి వివరించానని గుర్తుచేశారు. అయినా జగన్ బుద్ధి మారలేదని మండిపడ్డారు. రాష్ట్రానికి జల ద్రోహం చేసింది జగన్ కుటుంబమేనని ఆరోపించారు. నాడు జలయజ్ఞం పేరిట ధనయజ్ఞం చేశారని మండిపడ్డారు. కృష్ణా మిగులు జలాల్లో హక్కు కోరబోమని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు లేఖ ఇచ్చి ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. పోలవరం రివర్స్ టెండరింగ్ పేరుతో 15 నెలలు ప్రాజెక్ట్‌ను ఆలస్యం చేసి డయాఫ్రమ్ వాల్ విధ్వంసానికి కారుకులయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు.
ఇసుక మాఫియాతో అన్నమయ్య డ్యాంను కూలగొట్టి 38 మంది ప్రాణాలు పోవడానికి జగన్ కారకుడయ్యాడని ఆరోపించారు. పులిచింతల, గుళ్ళకమ్మ గేట్లు కొట్టుకుపోవడం ఆయన పాపం కాదా అని ప్రశ్నించారు. పోలవరానికి కేంద్రం ఇచ్చిన రూ. 3800కోట్లు దారి మళ్లించి నదుల అనుసంధానానికి గండి కొట్టారని మండిపడ్డారు. పోలవరం ఎత్తు తగ్గించడానికి రెండు ఫేజ్‌లుగా విభజించింది జగన్ కాదా అని నిలదీశారు. పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించి కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరింది జగన్ కాదా అని ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వం పోలవరం ఎత్తు 45.72 మీటర్లు పెంచి నదుల అనుసంధానం చేసి సస్యశ్యామల ఆంధ్రప్రదేశ్‌గా ఆవిర్భవింప చేస్తామని ఉద్ఘాటించారు. ఇప్పటికైనా జగన్ అబద్ధాలు మాని ఆయన కుటుంబ కలహాలను చక్కబెట్టుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు హితవు పలికారు.
ఇవి కూడా చదవండి..
Vidadala Rajini: యూట్యూబ్ ఛానల్స్‌పై మాజీ మంత్రి ఫిర్యాదు
AP Govt: టీటీడీ పాలకమండలి నియామకం.. పునరాలోచనలో సర్కార్
Read Latest AP News And Telugu News