Pawan Kalyan: మడ అడవుల విధ్వంసంపై కఠిన చర్యలు
ABN , Publish Date - Jul 26 , 2024 | 10:13 PM
మడ అడవుల విధ్వంసంపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి: మడ అడవుల విధ్వంసంపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆదేశాలు జారీ చేశారు. మాంగ్రూవ్ సెల్ ఏర్పాటు చేసి పటిష్ట రక్షణకు చర్యలు చేపట్టాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ‘మిస్టీ’ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో మడ అడవుల విస్త్రీర్ణం పెంచుతాయని తెలిపారు. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల కోసం 110 ఎకరాల మడ అడవుల్ని తొలగించిందని.. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తానని అన్నారు.
శుక్రవారం నాడు ఏపీ సచివాలయంలో పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. తీర ప్రాంత పరిరక్షణలో మడ అడవుల పాత్ర కీలకమని వివరించారు. మడ అడవుల పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. కార్పొరేట్ సంస్థలు మడ అడవుల పరిరక్షణలో భాగస్వాములు కావాలని అన్నారు. ‘తీర ప్రాంత పరిరక్షణలో మడ అడవుల పాత్ర వెలకట్టలేనిదని అన్నారు.మానవ తప్పిదాలు మడ అడవుల పాలిట శాపంగా పరిణమిస్తున్నాయని వివరించారు. వీటి పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
మడ అడవులను విధ్వంసం చేసేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఏనుగుల వల్ల పంటలు ధ్వంసంపై అటవీశాఖ ఉన్నతాధికారుల సమావేశంలో చర్చించారు. 'కుంకీ’ ఏనుగుల కోసం కర్ణాటక ప్రభుత్వంతో చర్చిస్తానని అన్నారు. చిత్తూరు, పార్వతీపురం జిల్లాల్లో ఏనుగులు పంటలను ధ్వంసం చేశాయని చెప్పారు. జనావాసాల్లోకి రావడం వల్ల ప్రజల్లో ఆందోళన కలుగుతోందని.. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పొలాల్లో, నివాస ప్రాంతాల్లోకి వచ్చే ఏనుగుల గుంపును తిరిగి అడవుల్లోకి పంపించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అటవీ శాఖ దగ్గర కుంకీ ఏనుగుల కొరత ఉందన్నారు. కర్ణాటకలో కుంకీ ఏనుగులు ఉన్నాయని వివరించారు. కనీసం అయిదు ఈ తరహా ఏనుగులను కర్ణాటక నుంచి తెచ్చుకోగలిగితే సమస్యను నివారించవచ్చని తెలిపారు. ‘స్వయంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో కుంకీ ఏనుగుల గురించి చర్చిస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.