Share News

Pawan Kalyan: వన్యప్రాణుల సంరక్షణకు పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

ABN , Publish Date - Nov 25 , 2024 | 10:22 PM

వన్యప్రాణుల సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు.పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సహకారంతో ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసి ఆ పథకం ద్వారా ఈ పనులను చేపట్టాలని సూచించారు.

Pawan Kalyan: వన్యప్రాణుల సంరక్షణకు పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

అమరావతి: ఏనుగులు పొలాల వైపు రాకుండా కందకాలు తవ్వే పనులు వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఇవాళ(సోమవారం) వెలగపూడి సచివాలయంలో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సహకారంతో ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసి ఆ పథకం ద్వారా ఈ పనులను చేపట్టాలని సూచించారు.


ఎలక్ట్రికల్ లైన్లను ఇన్సులేట్ చేసి తద్వారా వన్యప్రాణులకు ఏనుగులు ఎక్కువగా ఉండే మండలాల్లో విద్యుదాఘాతానికి గురయ్యే ప్రమాదాన్ని నివారించేలా తక్షణం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అటవీ అధికారులు రూపొందించిన సోలార్ కంచెలను వేలాడదీసే వినూత్న పరిష్కార మార్గాలను అమలు చేయాలని సూచించారు. ప్రజలను రక్షించడంతోపాటు వన్యప్రాణుల భద్రతను చూడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.


వన్యప్రాణులను వేటాడటం, అటవీ సంపదను నాశనం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వన్యప్రాణుల సంరక్షణకు ట్రోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వన్యప్రాణులను వేటాడటం... చంపడం... అక్రమ రవాణా చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠినమైన శిక్షలు ఉంటాయని పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. అడవులను సంరక్షించడం, వన్యప్రాణులను కాపాడటం మనందరి బాధ్యత అని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు.


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లు మనది వసుధైక కుటుంబమని ఉద్ఘాటించారు. భూమ్మీద మనతో పాటు మనుగడ సాధిస్తున్న జంతువులు, చెట్లు చేమలు, పశు పక్షాదుల పట్ల కరుణ చూపాలని పవన్ కళ్యాణ్ అన్నారు. వాటికి మనలాగే బతికే హక్కు ఉందని తెలిపారు. వన్య ప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం వన్య ప్రాణులను వేటాడటం, చంపడం, అక్రమ రవాణా చేయడం నిషేధమని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యతగా పనిచేస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Updated Date - Nov 25 , 2024 | 10:24 PM