Payyavula Keshav: అందుకే జగన్ ఢిల్లీకి వెళ్లారా...?
ABN , Publish Date - Jul 26 , 2024 | 05:44 PM
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికు ప్రతిపక్ష హోదా రావాలంటే ఇంకో పదేళ్లయినా సమయం పడుతుందని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) విమర్శించారు.
అమరావతి: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికు ప్రతిపక్ష హోదా రావాలంటే ఇంకో పదేళ్లు అయినా సమయం పడుతుందని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) విమర్శించారు. ప్రజలు జగన్‌కు ఓట్లేసి 11సీట్లయినా ఇచ్చింది అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించమని కానీ సింగిల్ కెమెరాతో ప్రెస్మీట్‌లు పెట్టడానికి కాదని తేల్చిచెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో శుక్రవారం పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ... అభిమానించినా, అవమానించినా నిలదొక్కుకున్న వాళ్లే రాజకీయంగా ఉండగలరని జగన్ గ్రహించాలని అన్నారు.
జగన్ ఇలాగే పోతే ఉన్న 11మంది కూడా ఒక్కరయ్యే ప్రమాదముందని అన్నారు. శ్వేతపత్రంలో చూపిన రూ.9.30 లక్షల కోట్ల అప్పు ఖచ్చితంగా పెరుగుతుందని తెలిపారు. ఇండియా కూటమి ప్రతినిధులతో రహస్య చర్చల కోసం ఢిల్లీ వెళ్లానని ధైర్యంగా జగన్ చెప్పొచ్చు కదా? అని అడిగారు. ప్రతిపక్ష పాత్ర నిర్వర్తించలేనని సభలో చేతులెత్తేసి కోర్టులో ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతారని విమర్శించారు. అసెంబ్లీలో అడగాల్సినవి ఢిల్లీ వెళ్లి అడుగాతానంటున్నారని ఎద్దేవా చేశారు. కనీసం 30మంది ఎమ్మెల్సీలను మండలికైనా పంపితే వాస్తవాలు తెలుసుకునేవారని చెప్పారు. రాష్ట్రంలో ఈ నిమిషం వరకూ జగన్ ప్రభుత్వంలో పోస్టింగ్‌లో వచ్చినా ఎస్ఐలు, సీఐలు, డీఎస్పీలుగా ఉన్న విషయం గ్రహించాలన్నారు. రాజకీయ హత్యలపై దమ్ముంటే జగన్ వివరాలు బయటపెట్టాలని పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.
జగన్ ప్రవర్తన అలా ఉంది: జీవీ ఆంజనేయులు
శవం కనిపిస్తే రాబందు కంటే హీనంగా మాజీ సీఎం జగన్ ప్రవర్తన ఉందని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ... జగన్‌కు దమ్ముంటే రాజకీయ హత్యలకు సంబంధించిన వివరాలను బయటపెట్టాలన్నారు. జగన్ ప్రతి విషయంలో అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఇద్దరు రౌడీలు గొడవ పడితే ఢిల్లీ వెళ్లి గొడవ చేస్తావా ? అని ప్రశ్నించారు. జగన్ బాబాయ్ హత్య నిందితులు తన భార్యతో ఫొటోలు దిగలేదా? అని నిలదీశారు. జగన్‌తో ఫొటోలు దిగిన వారంతా వివిధ కేసుల్లో నిందితులేనని స్పష్టం చేశారు. ఈ లెక్కన జగన్ పై ఎన్ని కేసులు పెట్టాలని జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు.
చెత్త నుంచి విద్యుత్ పుట్టించాం: మంత్రి గొట్టిపాటి
మరోవైపు శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానం ఇచ్చారు. వారు చెత్తపై పన్ను వేస్తే... తాము చెత్త నుంచి విద్యుత్ పుట్టించామని మంత్రి అన్నారు. చంద్రబాబు దూరదృష్టితోనే నాడు మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీ ఉందని తెలిపారు. జగన్ రెడ్డి హయాంలో విద్యుత్ రంగం అస్తవ్యస్థంగా మారిందని మండిపడ్డారు. అనాలోచిత నిర్ణయాలు, పీపీఏల రద్దుతోనే విద్యుత్ లోటు అని చెప్పారు. 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని భారమంతా పేద, మధ్యతరగతి వారిపైనే వేశారని గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు.