Palla Srinivasa Rao: ఏపీ మాజీ సీఎం జగన్ మరోసారి హత్యా రాజకీయాలకు తెరలేపారు..
ABN , Publish Date - Jul 19 , 2024 | 09:35 PM
గుంటూరు జిల్లా వినుకొండలో జరిగిన హత్యను టీడీపీకి ఆపాదిస్తూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి శవ రాజకీయాలకు తెరలేపారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. వ్యక్తిగత హత్యలను టీడీపీపై రుద్దడం ఆయనకే చెల్లుబాటు అవుతోందని పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: గుంటూరు జిల్లా వినుకొండలో జరిగిన హత్యను టీడీపీకి ఆపాదిస్తూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) మరోసారి శవ రాజకీయాలకు తెరలేపారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. వ్యక్తిగత హత్యలను టీడీపీపై రుద్దడం ఆయనకే చెల్లుబాటు అవుతోందని పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే బుధవారం రాత్రి వైసీపీ నేత రషీద్‌ను జిలానీ అనే వ్యక్తి నడిరోడ్డుపై కత్తితో నరికి చంపడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఘటనపై వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే మెుదట దీనిపై ఎక్స్ ద్వారా స్పందించిన జగన్ అనంతరం తన బెంగళూరు పర్యటనను మధ్యలో ఆపేసి ఇవాళ(శుక్రవారం) వినుకొండకు వచ్చారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై టీడీపీ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తున్నారు.
పరామర్శకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి ఏపీలో రాష్ట్రపతి పాలన కోరడం, అసెంబ్లీలో గౌవర్నర్ ప్రసంగం అడ్డుకుంటామనడం చెప్పడం సిగ్గుచేటని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గిరిజన మహిళతో వైసీపీ నేత, ఎంపీ విజయసారెడ్డి విషయాన్ని డైవర్ట్ చేసేందుకు మళ్లీ శవరాజకీయాలకు ఆయన తెరలేపారంటూ ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి రాజకీయ రాక్షసత్వానికి కేరాఫ్ అడ్రస్ అని, రషీద్ హత్యకు జిలానీ అనే వ్యక్తి కారణం అని చెప్పుకొచ్చారు. వారి మధ్య సంవత్సర కాలంగా ఉన్న వ్యక్తిగత గొడవలే హత్యకు దారి తీశాయని పేర్కొన్నారు.
గొడవలు వచ్చినప్పుడు అప్పటి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వద్ద వాళ్లు పంచాయతీ పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ పంచాయతీ తెగకపోవడంతోనే హత్య జరిగినట్లు శ్రీనివాసరావు ఆరోపించారు. దీన్ని నేడు జగన్ రెడ్డి హత్యా రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలోనే ముస్లిం సోదరులపై ఎక్కువగా హత్యలు జరిగాయని, నంద్యాలలో అబ్దుల్ సలాం అనే వ్యక్తి కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. టీడీపీ ఎప్పుడూ ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉందని, మాజీ ముఖ్యమంత్రి జగన్ తన ఉనికి కాపాడుకోవడానికే శవరాజకీయాలు చేస్తున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు.