Nara Lokesh: మాచర్ల ఘటన యావత్ పోలీస్ శాఖకే మాయని మచ్చ..
ABN , Publish Date - Jan 29 , 2024 | 10:54 AM
Andhrapradesh: మాచర్ల నియోజకవర్గంలో ఎస్‌ఐ వేధింపులు తాళలేక దుర్గారావు అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఈ సందర్భంగా పోలీసులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అమరావతి, జనవరి 29: మాచర్ల నియోజకవర్గంలో ఎస్‌ఐ వేధింపులు తాళలేక దుర్గారావు అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఈ సందర్భంగా పోలీసులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఖాకీ దుస్తులు ధరించి రాజకీయాలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోందన్నారు. మాచర్ల నియోజకవర్గంలో కొందరు పోలీసులు.. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రైవేటుసైన్యంలా మారిపోయి బలహీనవర్గాలపై మారణహోమం సాగిస్తున్నారని విరుచుకుపడ్డారు.
మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తిలో టీడీపీ సానుభూతిపరులైన మత్స్యకారులను వైసీపీలో చేరాలని లేదా రూ.2 లక్షలు కప్పం కట్టాలని ఎస్ఐ శ్రీహరి వేధించడంతో బెస్తసోదరుడు దుర్గారావు బలవన్మరణానికి పాల్పడ్డాడన్నారు. వైసీపీ నేతలకు తొత్తుగా మారి దుర్గారావుపై తప్పుడు కేసు బనాయించడమే గాక పార్టీ మారాలని ఒత్తిడిచేయడం, ఆత్మహత్యకు పురిగొల్పడం యావత్ పోలీసు శాఖకే మాయనిమచ్చ అని వ్యాఖ్యలు చేశారు. ఖాకీబట్టలు వేసుకొని వైసీపీ నేతలకు ఊడిగం చేయడం దారుణమన్నారు. దేశంలో మరెక్కడైనా ఇలాంటి విపరీతపోకడలు ఉన్నాయా అని ప్రశ్నించారు. బీసీ సోదరుడి మరణానికి కారకుడైన ఎస్ఐ శ్రీహరి వంటి పోలీసులు మరికొద్దిరోజుల్లో రాబోయే ప్రజాప్రభుత్వంలో కఠిన చర్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఎస్ఐ వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన దుర్గారావు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని నారా లోకేష్ హామీ ఇచ్చారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...