YS Sunitha: ఏపీ హోంమంత్రిని కలిసిన వైఎస్ వివేకా కుమార్తె సునీత..
ABN , Publish Date - Aug 07 , 2024 | 01:06 PM
సచివాలయంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్ వివేకా హత్య తదనంతర పరిణామాలను హోంమంత్రి దృష్టికి సునీత తీసుకెళ్లారు. జగన్ ప్రభుత్వంలో తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయం గురించి అనితకు ఆమె వివరించారు.
అమరావతి: సచివాలయంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్ వివేకా హత్య తదనంతర పరిణామాలను హోంమంత్రి దృష్టికి సునీత తీసుకెళ్లారు. జగన్ ప్రభుత్వంలో తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయం గురించి అనితకు ఆమె వివరించారు. కేసును పక్కదారి పట్టించేందుకు విశ్వప్రయత్నం చేశారని చెప్పారు. వైసీపీ హయాంలో హంతకులకు స్థానిక పోలీసులు అండగా నిలిచారని ఆమె హోంమంత్రి ఎదుట ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేస్తున్న న్యాయపోరాటానికి సహకరించాలని కోరారు.
గత ప్రభుత్వంలో హంతకులకు అండగా నిలిచిన వారిపై చర్యలు తీసుకోవాలని సునీత కోరారు. విచారణ సమయంలో కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారని హోంమంత్రికి చెప్పారు. తన తండ్రిని హత్య చేసిన వారిని, వైసీపీ ప్రభుత్వంలో నిందితులను కాపాడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సీబీఐ అధికారులపైనే తప్పుడు కేసులు పెట్టారని చెప్పుకొచ్చారు. కేసు విచారిస్తున్న అధికారులతోపాటు సాక్షులను కూడా బెదిరించారని వివరించారు. సీబీఐ విచారణలో ఉన్నందున ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని వైఎస్ సునీతకు అనిత హామీ ఇచ్చారు. దోషులకు శిక్షపడేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని వెల్లడించారు. తప్పు చేసిన పోలీసులను సహా ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.