YSRCP: నిరాశలో జగన్.. ప్రజల దృష్టి మరల్చేందుకు కొత్త డ్రామాలు..
ABN , Publish Date - Oct 11 , 2024 | 01:38 PM
జగన్ చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అసలు జగన్ బాధ ఏమిటో అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ దిగజారిపోయాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే దొంగే.. దొంగ.. దొంగ అన్నట్లుందనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలు..
వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల ఫలితాల నుంచి ఇంకా తేరుకున్నట్లు కనిపించడం లేదు. ప్రజలు ఎందుకు ఇలాంటి తీర్పు ఇచ్చారో సమీక్షించుకోకుండా ప్రజలను తప్పపడుతూ.. ప్రజాతీర్పును అపహస్యం చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అసలు జగన్ బాధ ఏమిటో అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ దిగజారిపోయాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే దొంగే.. దొంగ.. దొంగ అన్నట్లుందనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలు నాలుగు నెలల్లోనే నాశనమయ్యాయంటూ జగన్ వ్యాఖ్యానించారు. ఐదేళ్ల పాలనలో సాగించిన అరాచక పాలన కారణంగానే ప్రజలు ప్రతిపక్ష హోదాకు అవసరమైన సీట్లను ఇవ్వలేదనే విషయాన్ని మర్చిపోయిన జగన్.. తన పాలన ఎంతో గొప్పగా సాగిందని చెప్పుకుంటున్నారు. నిజంగానే పాలన గొప్పగా ఉంటే తప్పకుండా ప్రజలు రెండోసారి ఆదరించారు. ఉదాహరణకు హర్యానాలో వరుసగా రెండుసార్లు అధికారం దక్కించుకున్న బీజేపీపై ప్రజలు ఎంతో వ్యతిరేకతతో ఉన్నారనే ప్రచారం జరిగినా అక్కడి ప్రజలు మాత్రం మూడోసారి సంపూర్ణ మెజార్టీతో బీజేపీని ఆదరించారు. 2019లో 151 సీట్లతో ఘన విజయం సాధించిన జగన్ గొప్పగా పాలిస్తే రెండోసారి తప్పకుండా ప్రజలు ఆదరించి ఉండేవారు. కానీ వైసీపీపై ప్రజలు ఎంత వ్యతిరేకతతో ఉన్నారో ఎన్నికల ఫలితాలు స్పష్టంచేశాయి. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా జగన్ తన వైఖరి మార్చుకోకపోవడమే ఆ పార్టీకి పెద్ద మైనస్ అనే చర్చ జరుగుతోంది.
బాధ ఏమిటో..
తాను సీఎంగా ఉన్నప్పుడు వైస్ జగన్ ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు వచ్చినా జగన్ పట్టించుకోలేదు. పార్టీ నాయకులు చేసిన ప్రతి తప్పును సమర్థించుకువచ్చారు. ఐదేళ్లలో పార్టీ నాయకుల అరాచకాలపై చర్యలు తీసుకున్న దాఖలాలులేవు. పైగా వ్యవస్థలను తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారనే ఆరోపణలు జగన్ ఎదుర్కొన్నారు. ప్రధానంగా పోలీసు వ్యవస్థను రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి వాడుకున్నారనేది వైసీపీ ప్రభుత్వంపై ప్రధానమైన విమర్శ. జగన్ తీరు చూస్తుంటే.. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ అరాచకాలపై నోరు మెదపకుండా.. అధికారం పోయిన తర్వాత కూడా ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ తరహా పాలన కొనసాగుతుందనే ఊహలో ఏమైనా ఉన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయట. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేసిన జగన్ కూటమి ప్రభుత్వంలో నాలుగు నెలల్లోనే వ్యవస్థలను నాశనం చేశారంటూ మాట్లాడటంపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీనే ఉదాహరణ..
వ్యవస్థలను స్వార్థ ప్రయోజనం కోసం దుర్వినియెగం చేసి.. ప్రజలను పట్టించుకోకుండా.. అభివృద్ధిని మర్చిపోతే ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారనేదానికి వైసీపీ పెద్ద ఉదాహరణగా నిలుస్తుంది. ఈక్రమంలో వైసీపీ వ్యవహారించినట్లు ఏ పార్టీ లేదా ప్రభుత్వం వ్యవహారించాలని అనుకోదు. జగన్‌లా ఏకపక్షంగా ముందుకెళ్తూ.. ప్రజలను నిర్లక్ష్యం చేసి, అరాచక పాలనకు శ్రీకారం చుడితే ప్రజల స్పందన ఎలా ఉంటుందో ఇటీవల ఎన్నికల్లో చూశాం. ఈ పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాలని భావించదు. ప్రజాపాలనతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కూటమి ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని ఆ పార్టీ నాయకులు చెబుతుంటే వైసీపీ అధ్యక్షులు జగన్ మాత్రం ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో ఎవరి మాటల్లో నిజమెంత తెలుసుకోవాలంటే వచ్చే ఏడాది జరిగే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here