AP Highcourt: ఎస్‌జీటీ పోస్టుల భర్తీపై ఏపీ సర్కార్ నిర్ణయాన్ని తప్పుబట్టిన హైకోర్టు
ABN , Publish Date - Feb 20 , 2024 | 03:38 PM
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎస్‌జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను అనుమతించడాన్ని హైకోర్టు సీజే ధర్మాసనం తప్పుబట్టింది.
అమరావతి, ఫిబ్రవరి 20: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP Government) విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌పై (DSC Notification) మంగళవారం హైకోర్టులో (AP HighCourt) విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎస్‌జీటీ పోస్టుల (SGT Post) భర్తీకి బీఈడీ అభ్యర్థులను అనుమతించడాన్ని హైకోర్టు సీజే ధర్మాసనం తప్పుబట్టింది. ప్రభుత్వ నిర్ణయం సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పునకు విరుద్ధంగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒకానొక దశలో నోటిఫికేషన్ ఆధారంగా ముందుకెళ్లొద్దని, అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేయవద్దని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. 2018లో సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఎలా నోటిఫికేషన్ ఇస్తారని హైకోర్టు ప్రశ్నించింది. వివరాలు సమర్పించేందుకు ఏజీ సమయం కోరడంతో విచారణను ధర్మాసనం రేపటికి (బుధవారం) వాయిదా వేసింది. ఈలోపు నోటిఫికేషన్‌పై ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. పిటీషన్‌ల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు, హైకోర్ట్ న్యాయవాది జువ్వాధి శరత్ చంద్ర వాదనలు వినిపించారు.
నిన్నటి వాదన ఇదీ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌పై నిన్న(సోమవారం) హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఆకుల వెంకట శేషశాయి, జస్టిస్ సుమతి ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. ఎస్‌జీటీ టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదించారు. బీఈడీ అభ్యర్థులను అనుమతించడం వలన పది లక్షల మంది డీఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. దేశ అత్యున్నత న్యాయస్థానం, ఎన్సీటీఈ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల ప్రక్రియ చేపట్టిందని పిటిషనర్ వాదనలు వినిపించారు. తప్పులతడకగా నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాదిమంది జీవితాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సుప్రీం కోర్టు తీర్పు స్పష్టంగా ఉన్నా బీఎడ్ అభ్యర్థులను ఎలా అనుమతించారని ధర్మాసనం ప్రశ్నించింది. సుప్రీం కోర్టు తీర్పు మీకు వర్తించదా అని వ్యాఖ్యానించింది. ఒక్కసారి సుప్రీం కోర్టు ఆదేశాలు ఇస్తే అవి దేశ వ్యాప్తంగా అమలు కావలసిందే కదా అని ప్రభుత్వ న్యాయవాదిని న్యాయస్థానం ప్రశ్నించింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..