Share News

High Court: అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా..

ABN , Publish Date - Sep 24 , 2024 | 01:45 PM

వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని శివశంకర్ రెడ్డి కుమారుడు బెదిరించాడని, దానిపైనా విచారణ జరపాలని మంగళవారం సునీత తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అవినాష్, శివశంకర్ రెడ్డి, అతని కుమారుని కేసు...ఈ మూడింటిని ఒకేసారి వినాలని ధర్మాసనానికి విజ్ణప్తి చేశారు.

High Court: అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా..

అమరావతి: వైఎస్ వివేకా హత్య కేసు (Viveka Murder Case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు, వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy) ముందస్తు బెయిల్‌ (Anticipatory Bail)పై మంగళవారం హైకోర్టు (High Court)లో విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం తదుపరి విచారణ నవంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌తో పాటు మరో నిందితుడు శివశంకర్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్‌పై కూడా విచారణ జరపాలంటూ వివేకా కుమార్తె డాక్టర్ సునీత పిటీషన్ వేశారు. దీనినిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేసింది.


మరోవైపు వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని శివశంకర్ రెడ్డి కుమారుడు బెదిరించాడని, దానిపైనా విచారణ జరపాలని ఈరోజు సునీత తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అవినాష్, శివశంకర్ రెడ్డి, అతని కుమారుని కేసు...ఈ మూడింటిని ఒకేసారి వినాలని ధర్మాసనానికి విజ్ణప్తి చేశారు. మూడు కేసులను ఒకేసారి వినడానికి ధర్మాసనం అంగీకరిస్తూ.. తదుపరి విచారణను నవంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది.


కాగా దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీతారెడ్డి దంపతులు మంగళవారం (ఈనెల17వ తేదీ) సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అప్పటి సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌తోపాటు తమపై పోలీసులు పెట్టిన అక్రమ కేసు గురించి ఆయన దృష్టికి తెచ్చారు. కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజానిజాలు, రాంసింగ్‌పై కేసు తదితర అంశాలపై సీఐడీ విచారణ జరిపించాలని కోరారు. వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. తనకు అన్ని విషయాలూ తెలుసని, తప్పనిసరిగా విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 లక్షల విరాళం అందించారు. ఇదే సందర్భంలో అక్టోబరు 3-5 తేదీల్లో అంటువ్యాధుల నివారణ-నియంత్రణపై హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో జరిగే జి-స్పార్క్‌-2024 (గ్లోబల్‌ సౌత్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ఇన్ఫెక్షన్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ అండ్‌ యాంటీమైక్రోబియల్‌ స్టివార్డ్‌షిప్‌) సదస్సుకు రావలసిందిగా సునీత ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.


అలాగే గత నెల (ఆగస్టు) సచివాలయంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్ వివేకా హత్య తదనంతర పరిణామాలను హోంమంత్రి దృష్టికి సునీత తీసుకెళ్లారు. జగన్ ప్రభుత్వంలో తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయం గురించి అనితకు ఆమె వివరించారు. కేసును పక్కదారి పట్టించేందుకు విశ్వప్రయత్నం చేశారని చెప్పారు. వైసీపీ హయాంలో హంతకులకు స్థానిక పోలీసులు అండగా నిలిచారని ఆమె హోంమంత్రి ఎదుట ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేస్తున్న న్యాయపోరాటానికి సహకరించాలని కోరారు.

గత ప్రభుత్వంలో హంతకులకు అండగా నిలిచిన వారిపై చర్యలు తీసుకోవాలని సునీత కోరారు. విచారణ సమయంలో కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారని హోంమంత్రికి చెప్పారు. తన తండ్రిని హత్య చేసిన వారిని, వైసీపీ ప్రభుత్వంలో నిందితులను కాపాడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సీబీఐ అధికారులపైనే తప్పుడు కేసులు పెట్టారని చెప్పుకొచ్చారు. కేసు విచారిస్తున్న అధికారులతోపాటు సాక్షులను కూడా బెదిరించారని వివరించారు. సీబీఐ విచారణలో ఉన్నందున ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని వైఎస్ సునీతకు అనిత హామీ ఇచ్చారు. దోషులకు శిక్షపడేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని వెల్లడించారు. తప్పు చేసిన పోలీసులను సహా ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.

Updated Date - Sep 24 , 2024 | 01:45 PM