Crime News: దారుణం.. రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. ఏకంగా..
ABN , Publish Date - Dec 07 , 2024 | 10:00 PM
కడప జిల్లా వేముల మండలం కొత్తపల్లిలో కుళ్లాయప్ప అనే యువకుడు స్థానికంగా ఉంటున్న ఓ యువతిని ప్రేమ పేరుతో గత కొన్ని నెలలుగా వేధిస్తున్నాడు. తనకు ఇష్టం లేదని యువతి పలుమార్లు హెచ్చరించింది.
కడప: ఆడవారిపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మహిళలు, యువతులు, చిన్నారులే లక్ష్యంగా కామాంధులు, ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అనేక ఘటనలు వెలుగు చూడగా.. దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో అత్యాచార, హత్యాచార ఘటనలు నమోదు అయ్యాయి. తాము చెప్పిన మాట వినలేదని దుర్మార్గులు పేట్రేగిపోతున్నారు. ప్రేమను ఒప్పుకోలేదని, పెళ్లికి నిరాకరిస్తున్నారని నిర్దాక్షిణ్యంగా దాడులకు తెగబడుతున్నారు. ప్రాణాలు తీయడం లేదా ప్రాణాలు పోయేంత పనులు చేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ అలాంటి వారిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. నిందితులను కఠినంగా శిక్షిస్తున్నప్పటికీ మార్పు మాత్రం కనిపించడం లేదు. పాఠశాలలు, ఆఫీసులు, రోడ్లు సహా ఇంట్లో ఉన్న ఆడవారికి సైతం రక్షణ లేకుండా పోతోంది.
తాజాగా కడప జిల్లాలో అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. తన ప్రేమను ఒప్పులేదని బాలికపై కత్తితో దాడికి పాల్పడ్డాడో ప్రేమోన్మాది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి విచక్షణరహితంగా రెచ్చిపోయాడు. తీవ్రంగా గాయపరిచి అక్కడ్నుంచి పారిపోయాడు. తీవ్రగాయాలతో ఆ బాలిక ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతోంది.
వేముల మండలం కొత్తపల్లిలో కుళ్లాయప్ప అనే యువకుడు స్థానికంగా ఉంటున్న ఓ యువతిని ప్రేమ పేరుతో గత కొన్ని నెలలుగా వేధిస్తున్నాడు. తనకు ఇష్టం లేదని యువతి పలుమార్లు హెచ్చరించింది. దీన్ని మనసులో పెట్టుకున్న ప్రేమోన్మాది.. ఆమెను అంతమెుందించాలని నిర్ణయించుకున్నాడు. అయితే బాలిక తల్లి కూలిపనులు చేస్తుండగా, తండ్రి వీఆర్ఏగా పని చేస్తున్నారు. ఇవాళ (శనివారం) వారిద్దరూ పని నిమిత్తం బయటకు వెళ్లిపోయారు. బాలిక ఒక్కత్తే ఇంట్లో ఉంది. ఇది గమనించిన కుళ్లాయప్ప అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం వెంట తెచ్చుకున్న కత్తితో యువతిపై దాడికి తెగబడ్డాడు. దీంతో ఆమె కేకలు వేయడం మెుదలు పెట్టింది. చుట్టుపక్కల వారు రావడాన్ని గమనించిన నిందితుడు అక్కడ్నుంచి పారిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న యువతిని స్థానికులు పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు.
బాధితురాలిని పరీక్షించిన వైద్యులు ఆమె శరీరంపై 11 కత్తిపోట్లు ఉండడాన్ని గుర్తించారు. యువతి అప్పటికే అపస్మారక స్థితికి చేరుకోగా గ్రామస్థులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అధిక రక్తస్రావం అవ్వడంతో అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం బాలికను కడప రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కుళ్లాయప్ప కోసం గాలింపు చర్యలు మెుదలుపెట్టారు. అయితే మద్యం మత్తులో కుళ్లాయప్ప దాడికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.