Share News

Kakinada : కళ్ల ముందే కాలుష్యం..అయినా బుకాయింపు

ABN , Publish Date - Jul 19 , 2024 | 05:14 AM

కాకినాడ జిల్లాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి రొయ్యల ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న వ్యర్థజలాల కాలుష్యంపై చర్యలకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు (పీసీబీ) చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది.

Kakinada : కళ్ల ముందే కాలుష్యం..అయినా బుకాయింపు

  • ద్వారంపూడి రొయ్యల ఫ్యాక్టరీల బరితెగింపు

  • వెదజల్లుతున్న కాలుష్యంపై పీసీబీ సీరియస్‌

  • గురజనాపల్లి, లంపకలోవ ఫ్యాక్టరీలు

  • గతంలో పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలతో

  • వాటిలో తనిఖీలు చేపట్టిన అధికారులు

  • లంపకలోవ ఫ్యాక్టరీ నుంచి భారీగా

  • కాలుష్య వ్యర్థ జలాలు వెదజల్లుతున్నట్లు గుర్తింపు

  • శుద్ధిచేయకుండానే నేరుగా పంటపొలాల్లోకి

  • రెట్టింపు సామర్థ్యంతో గురజనాపల్లి ఫ్యాక్టరీ

  • షోకాజ్‌ నోటీసులకు నిర్లక్ష్యంగా జవాబులు

కాకినాడ, జూలై 18 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి రొయ్యల ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న వ్యర్థజలాల కాలుష్యంపై చర్యలకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు (పీసీబీ) చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. కళ్ల ముందే కాలుష్యం కనిపిస్తున్నా.. ఆయా ఫ్యాక్టరీలు అదేమీ లేదని బుకాయించాయి. దీంతో నిబంధనలను ఉల్లంఘించి నడుపుతున్న ఫ్యాక్టరీలను సీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ఈ రొయ్యల ఫ్యాక్టరీల అరాచకాలపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు స్థానికుల నుంచి అనేక ఫిర్యాదులు అందడంతో ఈ నెల 2న కాకినాడ కలెక్టరేట్‌లో ఆయన జిల్లా అధికారులతో సమీక్ష జరిపారు. ఆ ఫ్యాక్టరీల్లో కాలుష్యం భారీగా ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదని వారిపై మండిపడ్డారు.

ద్వారంపూడికి చెందిన వీరభద్రా ఆక్వా ఎక్స్‌పోర్ట్‌ కంపెనీపై తనకు ఇప్పటికే చాలా ఫిర్యాదులు వచ్చాయని, కంపెనీ ఆక్వా వ్యర్థ జలాలను పక్కనే పంట డ్రెయిన్లలో కలిపేస్తున్నా ఎందుకు తనిఖీలు చేయలేదని నిలదీశారు. 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని పీసీబీ ఈఈ సందీ్‌పరెడ్డిని ఆదేశించారు.

ఈ నేపథ్యంలో హుటాహుటిన జిల్లా పీసీబీ అధికారులు కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోని గురజనాపల్లి, ప్రత్తిపాడు నియోజకవర్గం లంపకలోవలోని వీరభద్ర ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ పేరుతో ఉన్న రెండు రొయ్యల ఫ్యాక్టరీల్లో తనిఖీలు చేపట్టి నిబంధనల ఉల్లంఘనలను గుర్తించారు.


లంపకలోవ ఫ్యాక్టరీ నుంచి కాలుష్య వ్యర్థ జలాలను భారీగా వెదజల్లుతున్నారని, శుద్ధిచేయకుండా నేరుగా పంటపొలాల్లోకి వదిలేస్తున్నారని తేల్చారు. గురజనాపల్లి ఫ్యాక్టరీ నిర్దేశించిన దానికంటే రెట్టింపు సామర్థ్యంతో నడుస్తోందని గుర్తించారు. అత్యంత ఇరుకు ప్రాంతంలో అత్యధిక కాలుష్యం మధ్య ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నట్లు తేల్చారు. ఈ నేపథ్యంలో ఈ ఫ్యాక్టరీలపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో సంజాయిషీ ఇవ్వాలని ఈనెల 3న పీసీబీ నోటీసులు జారీ చేసింది.

అదే సమయంలో విశాఖ నుంచి కాలుష్య నియంత్రణ బోర్డు జోనల్‌ మేనేజర్‌ కార్యాలయం నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు కూడా ఆ రొయ్యల ఫ్యాక్టరీల్లో తనిఖీలు చేసి వ్యర్థజలాల కాలుష్యం అధికంగా ఉందని, కంపెనీ పూర్తి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని నిగ్గుతేల్చాయి. తీవ్రంగా పరిగణించిన పీసీబీ.. ఈనెల 3న షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. అయితే వీటికి ద్వారంపూడి రొయ్యల కంపెనీల నుంచి నిర్లక్ష్యపు సమాధానం వచ్చింది.

తమ కంపెనీ తక్కువ సామర్థ్యంతో పనిచేస్తోందని బుకాయించింది. వ్యర్థజలాలను శుద్ధి చేస్తున్నామని, అందులో కాలుష్యం లేదని, పంటపొలాల్లోకి విషవాయు వ్యర్థజలాలను వదలడం లేదని అబద్ధాలాడింది. తమ రొయ్యల ఫ్యాక్టరీలు నిబంధనల ప్రకారమే నడుస్తున్నాయని, ఎక్కడా ఫిర్యాదులు లేవని తెలిపింది. వాటి తీరుపై ఆగ్రహించిన పీసీబీ రెండు, మూడ్రోజుల్లో చర్యలకు ఉపక్రమించనుంది. సంబంధిత ఉత్తర్వులు విశాఖ జోనల్‌ కార్యాలయం నుంచి జారీ కానున్నట్లు తెలిసింది.

Updated Date - Jul 19 , 2024 | 05:14 AM