Manmohan: మన్మోహన్‌కు ఏపీ మంత్రులు, ఎంపీల నివాళులు
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:51 PM
Manmohan singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపట్ల ఏపీ మంత్రులు, ఎంపీ సంతాపం తెలియజేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన ఘనత మన్మోహన్ సింగ్ దే అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
అమరావతి, డిసెంబర్ 27: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Former Prime Minister Manmohan Singh) మృతిపట్ల ఏపీ మంత్రులు, ఎంపీలు సంతాపం తెలిపారు. మన్మోహన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా మన్మోహన్ దేశానికి ఎన్నో సేవలు అందించారని తెలిపారు. దేశ ప్రగతికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలను మరువలేమన్నారు. ఆర్థిక మేధావి కన్నుమూత దేశానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన ఘనత మన్మోహన్ సింగ్ దే అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavual Keshav) అన్నారు. మాజీ ప్రధాని మృతికి సంతాపం తెలిపిన పయ్యావుల.. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆర్బీఐ గవర్నరుగా, ఆర్థిక శాఖ మంత్రిగా.. ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు.
ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలు మరువలేమని అన్నారు. 1991లో మన్మోహన్ సింగ్ తెచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశ గతిని మార్చాయన్నారు. నరేగా చట్టం ద్వారా పేదలకు ఉపాధి చూపించారని.. ఆర్టీఐ చట్టం ద్వారా సమాచార విప్లవానికి బీజం వేశారని వెల్లడించారు. ఆర్థిక రంగంలో మన్మోహన్ సింగ్ స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ప్రగతికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలను మరువలేమని అన్నారు. ఓ రాజనీతిజ్ఞుడిని, ఓ ఆర్థిక సంస్కరణకర్తను దేశం కోల్పోయిందని మంత్రి పయ్యావుల కేశవ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్థిక శిల్పి మన్మోహన్: సవిత
అమరావతి: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్థిక మేధావి కన్నుమూత దేశానికి తీరనిలోటన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి వైపు పరుగులు పెట్టించిన ఆర్థిక శిల్పి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించి పేదలకు అండగా నిలిచారు. మన్మోహన్‍సింగ్ కుటుంబ సభ్యులకు మంత్రి సవిత తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మన్మోహన్ దేశం రుణపడి ఉంటుంది: స్పీకర్ అయ్యన్న
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆకాంక్షించారు. దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతిపట్ల అయ్యన్న తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “భారత ఆర్థిక వ్యవస్థకు నూతన దిశానిర్దేశం చేసిన దూరదృష్టి నాయకత్వం, విశాల దృష్టితో వ్యవహరించిన ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎప్పటికీ దేశ చరిత్రలో అజరామరంగా నిలిచిపోతారు. ఆయన నిశ్శబ్దం శక్తిగా మారిన గొప్ప నాయకుడు. ఆయన సద్విద్వానికి, నిబద్ధతకు ఈ జన్మంతా భారతదేశం రుణపడి ఉంటుంది” అని వ్యాఖ్యానించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని స్పీకర్ అయ్యన్న పేర్కొన్నారు.
హృదయపూర్వక నివాళులు: మంత్రి పార్ధసారథి
దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ట పరచడంలో తనదైన ముద్ర వేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని హౌసింగ్, ఐఅండ్ పీఆర్ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా, ప్రణాళిక సంఘం డెప్యూటీ చైర్మన్‌గా, ఆర్థిక మంత్రిగా, అనంతరం సుధీర్ఘ కాలం ప్రధాన మంత్రిగా ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంతో పాటు ఉపాధి హామీ పథకం, ఆర్టీఐ వంటి చట్టాలను చేసి ప్రభుత్వ పాలనలో కూడా ప్రత్యేకతను చాటుకున్నారన్నారు. ఆర్థిక వేత్తగా, సుదీర్ఘ కాలం ప్రధాన మంత్రిగా కొత్త ఒరవడికి నాంది పలికిన వారి మృతికి ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నామని.. హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నామని మంత్రి పార్ధసారధి తెలిపారు.
ఆర్ధిక వ్యవస్థ దిశను మార్చిన వ్యక్తి మన్మోహన్: మంత్రి అనగాని
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల రాష్ర్ట రెవెన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మన్మోహన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సంస్కరణలను ప్రవేశపెట్టి దేశ ఆర్ధిక వ్యవస్థ దిశను మార్చిన వ్యక్తి మన్మోహన్ అని కొనియాడారు. పదేళ్లు ప్రధానిగా పనిచేసినప్పటికీ అతి సాధారణ జీవితాన్ని గడిపిన వ్యక్తి మన్మోహన్ అన్నారు. ఆయన లేని లోటు దేశానికి పూడ్చలేనిది అని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
దేశాభివృద్దిలో కీలకపాత్ర: ఎంపీ వేమిరెడ్డి
నెల్లూరు: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. దేశం ఒక గొప్ప ఆర్ధికవేత్తని కోల్పోయిందన్నారు. ప్రధానిగానే కాక పలు కీలక పదవులు చేపట్టి దేశాభివృద్దిలో కీలకపాత్ర పోషించారు అని మన్మోహన్ సింగ్‌ను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొనియాడారు.
ఇవి కూడా చదవండి...
Fake Currency: ఏపీలో రెండు జిల్లాల్లో దొంగ నోట్ల కలకలం
గుర్తుపెట్టుకోండి.. జనవరి 1 నుంచి మారేవి ఇవే..
Read Latest AP News And Telugu news