Fake Currency Note: కృష్ణా జిల్లాలో నకిలీ నోట్ల కలకలం.. ఆ ముఠా గుట్టురట్టు
ABN , Publish Date - Dec 17 , 2024 | 11:43 AM
కృష్ణా జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం రేపాయి. నకిలీ నోట్లు ముద్రించి చెలామణి చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సాధారణ కరెన్సీ నోట్లను పోలిన విధంగానే ఉండటంతో సామాన్యులు మోసపోతున్నారు.
కృష్ణా: ఆర్థికంగా చితికిపోయిన వారు, భారీమొత్తంలో నగదు అవసరమున్నవారే వారి లక్ష్యం. డబ్బు అవసరం ఉన్న వారిని ఎంచుకుని వల విసురుతారు. పెద్దమొత్తంలో నగదు వస్తుందంటూ ఆశ చూపుతారు. తొలుత కొంతమొత్తంలో పెట్టుబడి పెట్టాలంటూ వారిని ఉచ్చులోకి లాగుతారు. ఆ తర్వాత కొంతమొత్తంలో నగదుతోపాటు, చెక్కులు, ప్రామిసరీ నోట్లు ఇలా ఒకేటేంటి రకరకాలుగా అవతలి వ్యక్తుల వద్ద ఉన్నవి ఊడ్చేస్తారు. ఇదీ ప్రస్తుతం జరుగుతున్న నకిలీ నోట్ల చలామణి. కొన్నేళ్లుగా సద్దుమణిగిన ఈ వ్యాపారం మళ్లీ కృష్ణా జిల్లాలో జోరుగా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొందరు వ్యక్తులు చీకటిసామ్రాజ్యంలో సాగుతున్న ఈ దందా కృష్ణాజిల్లాలో చాపకిందనీరులా విస్తరిస్తోందని తెలుస్తోంది. ఇటీవల కాలంలో పలువురు వద్ద నకిలీ కరెన్సీ నోట్లు బయటపడుతున్నాయి. సాధారణ కరెన్సీ నోట్లను పోలిన విధంగానే ఉండటంతో సామాన్యులతో పాటు వ్యాపారులు కూడా గుర్తించ లేకపోతున్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలను టార్గెట్‌గా నకిలీ కరెన్సీ నోట్ల లావాదేవీలు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బ్యాంక్ వరకు వెళ్లే దాకా గుర్తించలేక పోతుండటంతో ప్రజలు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. కొంతకాలంగా చలామణి అవుతున్న దొంగనోట్ల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
నకిలీ కరెన్సీ స్మగ్లర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. బాపులపాడు మండలం వీరవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ఎస్ఎం కంపెనీ క్వార్టర్స్‌లో దొంగ నోట్లు చలామణి చేస్తున్న ముఠాను వీరవల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భాషా, మస్తాన్ అనే వ్యక్తులను పోలీసులు నిందితులుగా గుర్తించారు. రాజోలు కేంద్రంగా చేసుకుని, జిల్లాలోని గన్నవరంలో ఇల్లు అద్దెకు నివసిస్తూ దొంగ నోట్ల చలామణికి పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. వీరవల్లి పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు వీరవల్లి ఎన్ఎస్ఎం కంపెనీ వద్ద నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గరి నుంచి ఒక ప్రింటర్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సులువుగా డబ్బులు సంపాదించడమే వీరి లక్ష్యమని పోలీసులు తెలిపారు.
నకిలీ కరెన్సీపై అప్రమత్తం
నకిలీ కరెన్సీపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రజలు అప్రమత్తంగా లేకపోతే, నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో కొంతమంది ఈ విధంగా చేస్తుంటారని, అలాంటి వారి దారిలో ఎవరూ వెళ్లకూడదని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
YSRCP : సజ్జల భార్గవ్ కేసుల వివరాలన్నీ ఇవ్వండి
Political Conflict : వైసీపీ నేతల ఆగడాలు అడ్డుకోండి
AP Skill Development : ఏపీలో 532 స్కిల్ హబ్‌లు
Read Latest AP News and Telugu News