Keshineni Chinni: చంద్రబాబుపై కేశినేని నాని విమర్శలు దిగజారుడు తనానికి నిదర్శనం
ABN , Publish Date - Jan 12 , 2024 | 10:31 PM
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) తనకు ఏ బాధ్యత ఇచ్చిన దానికి కట్టుబడి.. ఆ బాధ్యతను నెరవేర్చుతానని టీడీపీ సీనియర్ నాయకులు కేశినేని చిన్ని ( Keshineni Chinni ) తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా (తిరువూరు): టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) తనకు ఏ బాధ్యత ఇచ్చిన దానికి కట్టుబడి.. ఆ బాధ్యతను నెరవేర్చుతానని టీడీపీ సీనియర్ నాయకులు కేశినేని చిన్ని ( Keshineni Chinni ) తెలిపారు. తిరువూరులో ఈనెల 7న రా.... కదలిరా సభ జరిగింది. ఈ సభ విజయవంతం చేసిన సందర్భంగా తిరువూరులో శుక్రవారం నాడు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా కేశినేని చిన్ని హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్ని మాట్లాడుతూ.. తిరువూరు నియోజకవర్గంలో స్వామిదాస్ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి చంద్రబాబు 5 సార్లు అవకాశం కల్పించారని.. ఆయన సతీమణికి జిల్లా పరిషత్ చైర్మన్‌గా అవకాశం ఇచ్చారని తెలిపారు. వారు వైసీపీలోకి వెళ్లి టీడీపీపై అసత్య ప్రచారాలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. చంద్రబాబు కేశినేని నానికి రెండు పర్యాయాలు ఎంపీగా అవకాశం కల్పించారని చెప్పారు. ఆ వ్యక్తి విజయవాడ పార్లమెంట్ పరిధిలో 60 శాతం టీడీపీని ఖాళీ చేయిస్తానని ప్రగల్భాలు పలకడం విడ్డూరంగా ఉందన్నారు.
కేశినేని కుటుంబానికి చంద్రబాబు 2 సార్లు ఎంపీగా అవకాశం కల్పించారన్నారు. కేశినేని నాని చంద్రబాబుని విమర్శించటం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. వైసీపీలోకి వెళ్లిన నేతలు చంద్రబాబుపై విమర్శలు చేస్తే జగన్ టికెట్ ఇస్తాడని వాళ్లకి ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక నాయకుడిగా కంటే కార్యకర్తగా ఉండటం తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. తెలుగుదేశాన్ని నాయకులు మోసం చేశారని.. కార్యకర్తలు ఎప్పుడూ మోసం చేయలేదని.. అందుకనే తనకు కార్యకర్తగానే ఉండటం అంటేనే ఇష్టమన్నారు. విజయవాడని అభివృద్ధి చేసింది చంద్రబాబు... కానీ ఆయన దయతో ఎంపీగా గెలిచిన నాని విజయవాడకి చంద్రబాబు ద్రోహం చేశాడు అనడం దుర్మార్గమన్నారు. చంద్రబాబుని కేశినేని నాని విమర్శిస్తున్నాడని త్వరలోనే ఆయనకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని కేశినేని చిన్ని హెచ్చరించారు.