Share News

Eluru: వివాదాస్పదంగా మారిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం..

ABN , Publish Date - Dec 16 , 2024 | 09:17 PM

నూజివీడులో ఆదివారం జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ పాల్గొనడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంత్రి కొలుసు పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ముఖ్య అతిథులుగా నిన్న పెద్దఎత్తున కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ పాల్గొనడంపై తెలుగు తమ్ముళ్లు పెద్దఎత్తున అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Eluru: వివాదాస్పదంగా మారిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం..
Gauthu Lachanna statue unveiling ceremony

ఏలూరు: నూజివీడులో ఆదివారం జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ పాల్గొనడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంత్రి కొలుసు పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ముఖ్య అతిథులుగా నిన్న పెద్దఎత్తున కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ పాల్గొనడంపై తెలుగు తమ్ముళ్లు పెద్దఎత్తున అసహనం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన వ్యక్తిని కార్యక్రమానికి ఎలా రానిచ్చారంటూ పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. కూటమి నేతలు పక్కనే జోగి ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. అయితే దీనిపై మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీష స్పందించారు. అది ఓ కుల సంఘానికి సంబంధించిన కార్యక్రమం అని, ప్రతి దాన్నీ నెగటివ్‌గా చూడొద్దంటూ చెప్తున్నారు.


ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. "గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం పార్టీలకు అతీతంగా గౌడ కులస్థుల ఆధ్వర్యంలో నిర్వహించారు. మాజీ మంత్రి జోగి రమేశ్ రావటం అనేది యాదృచ్ఛికంగా జరిగింది. కూటమి నేతలు ఎవ్వరూ అతన్ని ఆహ్వానించలేదు. ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన గౌడ సోదరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జోగి రమేశ్ అక్కడికి వస్తారని ఎవ్వరూ ఊహించలేదు. బలహీన వర్గాలకు చెందిన నన్ను చంద్రబాబు మంత్రిని చేశారు. చంద్రబాబు, లోకేశ్ ఆశయాలకు అనుగుణంగా నేను పనిచేస్తున్నా. పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిని ఉంటే వారికి క్షమాపణ చెప్తున్నా. సీఎం చంద్రబాబు సైతం జరిగిన ఘటనపై మన్నించాలని విజ్ఞప్తి చేస్తున్నా. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటామని" చెప్పారు.


మరోవైపు జోగి రమేశ్ వ్యవహారంపై ఎమ్మెల్యే గౌతు శిరీష స్పందించారు. జోగి రమేశ్ ప్రక్కన శిరీష కూర్చోవడంపై కూటమి కార్యకర్త ఒకరు సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశారు. అతని పక్కన ఎలా కూర్చుంటారంటూ ఆమెను ప్రశ్నించాడు. దీంతో కార్యకర్త ప్రశ్నకు ఎమ్మెల్యే సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. తాను నూజివీడులో జరిగిన కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యానని, అక్కడికి అన్ని పార్టీలకు సంబంధించిన మా కులపెద్దల్ని నిర్వహకులు పిలిచారని ఆమె చెప్పారు. జోగి వస్తున్నట్లు తమకు సమాచారం లేదని, ఇలాంటి కార్యక్రమాల్లో కొన్నిసార్లు ఎవరెవరి పక్కనో కూర్చోవాల్సి వస్తుందని శిరీష చెప్పుకొచ్చారు. పక్కన కూర్చున్నంత మాత్రాన వారితో కలిసిపోయినట్లు కాదని, అక్కడ ఏం జరిగిందో తెలుసుకుని కామెంట్ చేస్తే బాగుంటుందని ఎమ్మెల్యే శిరీష అభిప్రాయం వ్యక్తం చేశారు.


అయితే అదో కుల సంఘానికి సంబంధించిన కార్యక్రమం అని, దాన్ని రాజకీయాలకు ముడిపెట్టవద్దంటూ మరికొంతమంది సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అయినప్పటికీ కొంతమంది తెలుగు తమ్ముళ్లు ఈ వ్యవహారంపై గుర్రుగానే ఉన్నట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Nellore: ఎప్పటిలాగానే పనికి వెళ్లారు.. అక్కడ యజమాని పెట్టింది తిని.. బాబోయ్..

AP News: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ.. చర్చించిన అంశాలు ఇవే..

Home Minister Anitha: వాటిని ఎదుర్కొనేందుకు పూర్తిగా సన్నద్ధం అవుతున్నాం: హోంమంత్రి అనిత..

Updated Date - Dec 16 , 2024 | 09:20 PM