Share News

Purandeswari: ఏపీలో పథకాల మార్పుపై ఎంపీ పురందేశ్వరి ఏమన్నారంటే?

ABN , Publish Date - Jul 29 , 2024 | 02:14 PM

ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖలోని ప్రభుత్వ పథకాల పేరు మార్పుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. భావితరాలకు ఆదర్శనీయులైన శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో పథకాలు అమలు చేయడం అభినందనీయమని కొనియాడారు.

Purandeswari: ఏపీలో పథకాల మార్పుపై ఎంపీ పురందేశ్వరి ఏమన్నారంటే?

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖలోని ప్రభుత్వ పథకాల పేరు మార్పుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. భావితరాలకు ఆదర్శనీయులైన శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో పథకాలు అమలు చేయడం అభినందనీయమని కొనియాడారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లతో ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నట్లు పురందేశ్వరి తెలిపారు.


గత వైసీపీ ప్రభుత్వం పాఠశాలల విద్యార్థులకు జగనన్న విద్యాకానుక పథకం కింద యూనిఫాం, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్స్ ఇస్తుంటారు. అయితే ఈ పథకాన్ని డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో అమలు చేయడం మంచి సంప్రదాయానికి పునాదిగా పురందేశ్వరి చెప్పారు. సర్వేపల్లి ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన మహానీయుడని ఆమె కొనియాడారు. ఆంధ్రా విశ్వవిద్యాలయానికి ఉప కులపతిగా పని చేశారని, భారత తొలి ఉపరాష్ట్రపతిగా, 2వ రాష్ట్రపతిగా సమర్థవంతంగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారని గుర్తు చేశారు. ఆయన జీవితం రేపటి పౌరులకు మార్గనిర్దేశం చేస్తుందని కొనియాడారు. అలాంటి గొప్ప వ్యక్తి పేరు విద్యావ్యవస్థలోని పథకానికి పెట్టడం మంచి పరిణామం అని అన్నారు.


జగనన్న గోరుముద్ద పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా పేరు మార్చడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నట్లు ఎంపీ పురందేశ్వరి చెప్పారు. ఏ సమయంలో ఆమె ఇంటికి వెళ్లినా కడుపు నిండా అన్నంపెట్టి ఆకలి తీర్చిన దానశీలి డొక్కా సీతమ్మ అని ఎంపీ కొనియాడారు. డొక్కా సీతమ్మ దయాగుణం, సేవాభావం విద్యార్థులకు తెలిసేలా చేయడం అభినందనీయం అని అన్నారు. పేదల ఆకలి తీర్చే పథకానికి ఆ మహానీయురాలి పేరు పెట్టడం హర్షించదగ్గ విషయం అని చెప్పారు.


జగనన్న ఆణిముత్యాలు పథకాన్ని భారతదేశపు మిస్సైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి దివంగత డా.అబ్దుల్ కలాం పేరుతో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు హర్షించారు. పేద కుటుంబంలో పుట్టిన కలాం జీవన ప్రస్థానం నేటి తరానికి స్ఫూర్తిని కలిగిస్తుందని ఆమె చెప్పారు. మరోవైపు జగనన్న అమ్మఒడిని తల్లికి వందనంగా, మన బడి నాడ-నేడుని మన బడి- మన భవిష్యత్తుగా మార్చారు. అలాగే స్వేచ్ఛ పథకాన్ని బాలిక రక్షగా మార్చడంపైనా ఆమె హర్షం వ్యక్తం చేశారు. మహనీయుల పేర్లతో పథకాలు అమలు చేయడం ద్వారా వారి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకుంటారని ఎంపీ పురందేశ్వరి అన్నారు.

Updated Date - Jul 29 , 2024 | 02:14 PM