Tirumala: కాక రేపుతున్న జగన్ తిరుమల పర్యటన
ABN , Publish Date - Sep 27 , 2024 | 12:09 PM
Andhrapradesh: జగన్ రేపు (శనివారం) శ్రీవారిని దర్శించుకోనున్నారు. అయితే తిరుమలకు జగన్ రానున్న నేపథ్యంలో డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది. అన్యమతస్తుడైన జగన్.. శ్రీవారి దర్శనానికి వెళ్లాలంటే డిక్లరేషన్‌పై సంతకం పెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
అమరావతి, సెప్టెంబర్ 27: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (Former CM YS Jaganmohan Reddy) తిరుమల పర్యటన తీవ్ర దుమారాన్ని రేపుతోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఘటనలో ఆరోపణల నేపథ్యంలో తిరుమలకు వెళ్లాలని జగన్ నిర్ణయించారు. ఈరోజు (శుక్రవారం) రాత్రి తిరుమలకు చేరుకోనున్న జగన్ రేపు (శనివారం) శ్రీవారిని దర్శించుకోనున్నారు. అయితే తిరుమలకు జగన్ రానున్న నేపథ్యంలో డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది. అన్యమతస్తుడైన జగన్.. శ్రీవారి దర్శనానికి వెళ్లాలంటే డిక్లరేషన్‌పై సంతకం పెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Tirumala: జగన్ పర్యటనపై వివాదం.. నోరుమెదపని వైసీపీ
ఈ అంశంపై ఇప్పటికే హిందూ సంఘాలు, శ్రీవారి భక్తులు, రాజకీయ పార్టీ నుంచి డిమాండ్‌లు పెరిగాయి. సంతకం పెట్టకపోతే జగన్‌ను దర్శనానికి అనుమతించకూడదని పలు వర్గాల డిమాండ్ చేస్తున్నాయి. దీంతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇతరమతస్తుల డిక్లరేషన్ వ్యవహారం తెరపైకి వచ్చింది. గతంలో తిరుమల దర్శనం సందర్భంగా పలువురు ప్రముఖులు, ఇతరమతస్తులు డిక్లరేషన్‌పై సంతకం పెట్టారు. డిక్లరేషన్ అంశంపై 1990 ఏప్రిల్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాటి ప్రభుత్వం చట్టం తెచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జగన్ తిరుమలకు వెళ్లనున్న నేపథ్యంలో ఆయన డిక్లరేషన్ ఇస్తారా.. లేదా అనేది సర్వత్రా ఉత్కంఠంగా మారింది.
గో బ్యాక్ క్రిస్టియన్ జగన్..
క్రిస్టియన్ అయిన జగన్ గోబ్యాక్.. తిరుమలకు రావొద్దంటూ నిన్న అలిపిరి వద్ద పలువురు స్వాములు ఆందోళనకు దిగారు. గో బ్యాక్ జగన్ అంటూ శ్రీనివాసానంద స్వామీజీతో పాటు పలువురు స్వాములు నిరసన చేపట్టారు. గో బ్యాక్ క్రిస్టియన్ జగన్ అంటూ ప్లే కార్డ్స్‌తో నినాదాలు చేశారు. ‘‘జగన్.. మీరు మా తిరుమలకు రావొద్దు. వస్తే అడ్డుకుని తీరుతాం. మీ వాహనాలు మా సాధుసంతులు, హిందువుల శరీరాల పైనుంచి వెళ్లాల్సిందేతప్ప మిమ్మల్నైతే ఒక్క అడుగుకూడా ముందుకు వెళ్లనివ్వం’’ అని శ్రీనివాసానంద స్వామి స్పష్టం చేశారు. ‘‘క్రైస్తవుడైన జగన్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ తిరుమలకు అనుమతించం. ఐనప్పటికీ జగన్ తిరుమలకు వెళ్లాలని ప్రయత్నిస్తే మేముకూడా ఏ పరిస్థితులకైనా సిద్ధంగా ఉన్నాం. అడ్డుకుని తీరుతాం. శాంతి భద్రతల సమస్య తలెత్తితే జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏం జరిగినా మేము సిద్ధమే. మా హిందూ ధర్మానికి, వేంకటేశ్వర స్వామికి కళంకం తెచ్చిన, ప్రసాదాన్ని పాడుచేసిన, మా తిరుమల క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా చేసిన జగన్మోహన్‌రెడ్డిని ఒక్క అడుగుకూడా వెయ్యనివ్వం. మీ నిర్వాకంతో హిందువులందరం తీవ్రంగా గాయపడ్డాం. తిరుమలకు వస్తానంటూ మీరు మళ్లీ మమ్మల్ని రెచ్చగొట్టొద్దు. మా గాయాలపై కారం చల్లొద్దు’’ అంటూ హితవుపలికారు.
ED Raids: పొంగులేటి నివాసాల్లో ఈడీ అధికారుల సోదాలు
‘‘రాష్ట్రంలో 250కిపైగా ఆలయాలపై దాడులు జరిగినపుడు నాడు సీఎంగా జగన్ ఒక్క ప్రెస్‌మీట్ పెట్టి ప్రశ్నించలేదు. హిందువులకు ఊరట కలిగించేలా ఒక్కమాటన్నా మాట్లాడారా అని ప్రశ్నించారు. మీరు కాకపోయినా కనీసం అప్పటి మీ మంత్రులు, ఇతర నేతలైనా మాట్లాడారా. హిందువులను మోసం చేయడానికి మొన్న ప్రెస్‌మీట్ పెట్టారు. నెయ్యి కల్తీ తమకు తెలియకుండా జరిగిపోయిందన్నారు. ఇదంతా రాద్దాంతం అన్నారు. హిందువుల గుండెలు మండుతున్నాయి. ఇంకా రెచ్చగొట్టొద్దు... బాధపెట్టొద్దు... మా తిరుమలకు రావొద్దు... ఐనా వస్తే ఖబడ్దార్’’ అని శ్రీనివాసానంద స్వామి హెచ్చరించారు. అలాగే తిరుమల పవిత్రతను దెబ్బతీసిన జగన్ కొండకు రాకూడదంటూ బీజేపీ, హిందూ సంఘాలు హెచ్చరికలు జారీ చేశాయి. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమలలో స్వామిని దర్శించుకోవాలని కూటమి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
ACB: ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డి అరెస్ట్‌పై ఏసీబీ ఎఫ్‌ఐఆర్
Devara movie: ‘దేవర’ చిత్రం విడుదలలో అపశృతి
Read Latest AP News And Telugu News