AP Politics: జగన్‌కు కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయంటే..
ABN , Publish Date - Oct 27 , 2024 | 06:31 PM
జగన్ సంపదంతా తండ్రి, తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజా సంపదను దోచుకున్నదే కాని సక్రమ సంపాదన కాదన్నారు. విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, సజ్జలరామకృష్ణారెడ్డి జగన్ ముఠాలో తోడుదొంగలు కాదా ..
జగన్ ఆస్తులపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2003లో 9 లక్షలు ఆదాయపన్ను కట్టిన జగన్ అతితతక్కువ కాలంలో లక్షల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. జగన్ సంపదంతా తండ్రి, తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజా సంపదను దోచుకున్నదే కాని సక్రమ సంపాదన కాదన్నారు. విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, సజ్జలరామకృష్ణారెడ్డి జగన్ ముఠాలో తోడుదొంగలు కాదా అని పట్టాభిరామ్ ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు తన సోదరీమణులకు తండ్రి ఆస్తిలో భాగమే కాదు తన కష్టార్జితాన్ని కూడా ఇచ్చారనే విషయం చిత్తూరు జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు. చంద్రబాబు నాయుడు సోదరీమణులు జగన్ రెడ్డి సోదరిలాగా తన అన్న అన్యాయం చేశాడని బోరున విలపించలేదన్నారు. తిరుపతి దొడ్డాపురం వీధి సందులో అద్దె ఇంట్లో ఉండి, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉండే జిరాక్స్ షాప్‌లో జూనియర్ పాట్నర్‌గా ఉన్న కరుణాకర్ రెడ్డికి నేడు వేల కోట్లు ఎలా వచ్చాయని, దేవుడి సొమ్ము, టీడీఆర్ బాండ్ల దోపిడీతో కాదా అన్నారు. వైవీసుబ్బారెడ్డి కుటుంబం బమిడకలొద్ది ల్యాట్ రైట్ పేరుతో బాక్సైట్ దోపిడీ చేసింది నిజం కాదా అంటూ వైసీపీపై ప్రశ్నల వర్షం కురిపించారు.
సూట్‌కేసు కంపెనీల ద్వారా..
ఎంపీ విజయసాయిరెడ్డి సూట్‌కేసు కంపెనీలు పెట్టించి విశాఖలో భూములు కబ్జాచేయించి గిరిజన మహిళ కుటుంబంలో చిచ్చుపెట్టారని ఆరోపించారు. నిత్యం అబద్ధాలాడే విజయసాయిరెడ్డి వంటి వ్యక్తి మాటలకు విశ్వసనీయత ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబుపై నిందలు వేసి మీ దోపిడీ సొమ్ము పంపకంలో కుట్రలను కప్పెట్టుకునే యత్నాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. అసత్య ప్రచారంతో ప్రజలను రోజూ మోసం చేయలేరని పట్టాభిరామ్ తెలిపారు.
జగన్, షర్మిల మధ్య ఆస్తుల వివాదం
గతకొన్ని రోజులుగా జగన్, షర్మిల మధ్య ఆస్తుల పంపకానికి సంబంధించి వివాదం కొనసాగుతోంది. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌లో షర్మిలకు ఇచ్చిన షేర్లను వెనక్కి తీసుకోవాలనుకుంటున్నానంటూ పిటిషన్ వేయడంతో జగన్, షర్మిల మధ్య ఆస్తుల పంపకాల వివాదం మొదలైంది. దీంతో జగన్ తన తండ్రికి ఇచ్చిన మాట తప్పారంటూ షర్మిల వ్యాఖ్యానించడంతో వైసీపీ, షర్మిల మధ్య వర్డ్స్ వార్ కొనసాగుతోంది. మరోవైపు తన సోదరుడు జగన్‌పై షర్మిల విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తల్లిని కోర్టుకు ఈడ్చిన విషపు నాగు జగన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వైసీపీ అధ్యక్షులు జగన్, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మధ్య ఆస్తుల వివాదం మరెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here