Shivraj Singh Chouhan: ఏపీలో పర్యటించిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్..వరద నష్టంపై ఏమన్నారంటే..?
ABN , Publish Date - Sep 06 , 2024 | 08:04 PM
వరద నష్టంపై సచివాలయంలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అధికారులు సమావేశం అయ్యారు. ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఏపీలో జరిగిన వరద ప్రభావిత ప్రాంతాల దృశ్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా సీఎం, అధికారులు వివరించారు.
విజయవాడ: వరద నష్టంపై సచివాలయంలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అధికారులు సమావేశం అయ్యారు. ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఏపీలో జరిగిన వరద ప్రభావిత ప్రాంతాల దృశ్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా సీఎం, అధికారులు వివరించారు. పలు జిల్లాల్లో ఒకే రోజు అత్యధికంగా 40 సెంటిమీటర్ల వర్షం కురిసిందని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. వరద ప్రభావిత జిల్లాలోని గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉందని సీఎం వివరించారు.
రోడ్లు, ఇళ్లు, బ్రిడ్జిలు పూర్తిగా దెబ్బతిన్నాయని, రాకపోకలు స్తంభించాయని సీఎం చంద్రబాబు తెలిపారు. . తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు రూ.10వేలు పంపిణీ చేస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రభావిత ప్రాంతాల్లో తీవ్ర పంట నష్టం జరిగిందని, పొలాలన్నీ రాళ్లు, ఇసుక మేటలతో నిండిపోయాయని అధికారులు వివరించారు. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పరిస్థితిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. ఏపీలో వరద నష్టం దాదాపు రూ.5,438 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు కేంద్ర మంత్రికి అధికారులు తెలిపారు.
ఎన్డీఆర్ఎఫ్ నిధులను రాష్ట్రాలకు విడుదల చేసే విషయంలో ఇప్పుడున్న మార్గదర్శకాలను సడలించాలని సీఎం కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. తాత్కాలిక మరమ్మత్తులకు కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని సీఎం చంద్రబాబు కోరారు. శాశ్వత పునరుద్ధరణ పనులకూ తగినన్ని నిధులు కేటాయించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎలా సాయం అందిస్తారో అదే తీరుగా తెలంగాణకూ సాయం అందించాలని సీఎం చంద్రబాబు కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వరద నష్టాన్ని ఒకే తీరుగా చూడాలని సీఎం విన్నవించారు. విపత్తుల సమయంలో ప్రజలకు సాయమందించే విషయంలో పార్టీలు, రాజకీయాలు ఉండవని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ స్పష్టం చేశారు.