Share News

AP Politics: విపక్షంలోనూ ప్రజల మెప్పు పొందని జగన్..

ABN , Publish Date - Sep 10 , 2024 | 07:43 AM

జగన్ ఐదేళ్ల పనితీరుకు ప్రజలు ఇచ్చిన తీర్పుగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలను రాజకీయ పండితులు పేర్కొన్నారు. ఇప్పటికైనా జగన్ తన పద్ధతిని మార్చుకుని.. పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఎంతోమంది సూచించారు. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.

AP Politics: విపక్షంలోనూ ప్రజల మెప్పు పొందని జగన్..
YS Jagan

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనితీరుపై ప్రజలు సంతృప్తిగా లేకపోవడంతో 2024 ఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కకుండా ఓటర్లు తీర్పు చెప్పారు. జగన్ తన వైఖరి మార్చుకోవాలని ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. ఎన్నికల తర్వాత సొంత పార్టీ నాయకులు సైతం జగన్ వ్యవహారశైలిపై విమర్శలు గుప్పించారు. కొందరు సీనియర్ నేతలు ఏకంగా పార్టీకి గుడ్‌‌బై చెప్పేశారు. ప్రతిపక్ష హోదాకు కావాల్సిన సీట్లు రాకపోవడంతో జగన్‌కు శాసనసభలో ప్రతిపక్ష నేత హోదా లభించలేదు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ స్పీకర్‌కు లేఖ రాశారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటే కొన్నేళ్లుగా వస్తున్న సభా సంప్రదాయాల ప్రకారం మొత్తం అసెంబ్లీ సీట్లలో పది శాతం లేదా అంతకంటే ఎక్కువ సీట్లు సాధించాలి. వైసీపీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఓ విధంగా జగన్ ఐదేళ్ల పనితీరుకు ప్రజలు ఇచ్చిన తీర్పుగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలను రాజకీయ పండితులు పేర్కొన్నారు. ఇప్పటికైనా జగన్ తన పద్ధతిని మార్చుకుని.. పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఎంతోమంది సూచించారు. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.

Rain Alert: వరద సహాయక చర్యల్లో మంత్రి నారాయణ


వరదల్లోనూ రాజకీయం..

గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడను వరదలు ముంచెత్తాయి. ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కష్టకాలంలో రాజకీయాలను పక్కనపెట్టి ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల క్షేమాన్ని ఆశిస్తుంది. అవసరమైతే సహాయక చర్యల్లో భాగస్వామ్యం కావడం ద్వారా ప్రభుత్వానికి సహకరిస్తుంది. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు తమ పార్టీ తరపున తక్షణ సాయం అందించాలి. కానీ వైసీపీ అధ్యక్షులు జగన్ మాత్రం వరదల్లోనూ రాజకీయాలు చేయడానికే ప్రాధాన్యమిచ్చినట్లు ఆయన వైఖరి చూస్తే అర్థమవుతుంది. ఎంతోమంది సామాన్య ప్రజలు సైతం జగన్‌ తీరును తప్పుపట్టడం కనిపించింది. కేవలం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టి మూడు నెలలు పూర్తైంది. ఈలోపు అతిపెద్ద విపత్తు వచ్చింది. ఈ విపత్తును సమర్థంగా ఎదుర్కొనేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం శాయశక్తులు ఒడ్డింది. ఈ క్రమంలో బాధ్యతాయుతమైన విపక్ష పార్టీగా ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన జగన్.. వరదలపై రాజకీయం చేయడం ద్వారా ఎన్నికల తర్వాత ఆయనలో ఎలాంటి మార్పు రాలేదనే విషయం స్పష్టమవుతుంది.

ఉత్తరాంధ్రలో కుంభవృష్ఠి


జగన్ ఫెయిల్..!

వరదల తర్వాత వైసీపీ వ్యవహరిస్తున్న తీరు.. చేస్తున్న రాద్దాంతం చూస్తుంటే ప్రభుత్వంపై ప్రజల్లో ఏదోవిధంగా వ్యతిరేకతను పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రప్రజలు మొత్తం విజయవాడలో వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సాయం అందిస్తుండగా వైసీపీ మాత్రం వరదల సమయంలో చేస్తున్న రాజకీయాలను సామాన్య ప్రజలు సైతం తిప్పికొడుతున్నారు. జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సమయంలో ఆయన వ్యవహారించిన తీరు దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇప్పటికైనా జగన్ తన తీరు మార్చుకుంటారా లేదా అనేది రానున్న కాలంలో తేలనుంది.


కష్టం.. నష్టం..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Sep 10 , 2024 | 07:43 AM