Purandeswari: రామరాజ్యం బీజేపీ ద్వారానే సాధ్యం
ABN , Publish Date - Jan 21 , 2024 | 04:18 PM
రామరాజ్యం బీజేపీ ద్వారానే సాధ్యమని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ( Daggubati Purandeswari ) అన్నారు. నంద్యాలలో శక్తి కేంద్రాలు, పోలింగ్ బూత్ కమిటీల సభ్యుల సమావేశం నిర్వహించారు.
నంద్యాల: రామరాజ్యం బీజేపీ ద్వారానే సాధ్యమని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ( Daggubati Purandeswari ) అన్నారు. నంద్యాలలో శక్తి కేంద్రాలు, పోలింగ్ బూత్ కమిటీల సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.... దేశమంతా రామమయంగా మారిందని.. బాలరాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠను వీక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం 22వ తేదీన సెలవు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. తిరుపతిలో నకిలీ ఎపిక్ కార్డులతో 30 వేల ఓట్లను వైసీపీ తస్కరించిన విషయంపై బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం ద్వారా అధికారులపై చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు. ఏపీలో వైసీపీ ఫేక్ ఎపిక్ కార్డులు తయారు చేసిన ఆరోపణలపై రాష్ట్ర వ్యాప్తంగా దర్యాప్తు చేయాలని పురంధేశ్వరి కోరారు.
రాయలసీమకు జగన్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం
రాయలసీమకు జగన్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని.. ఒక్క పరిశ్రమ కూడా తీసుకు రాలేదని మండిపడ్డారు. వైసీపీ మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అంకితమై కేంద్రప్రభుత్వం పని చేస్తుందని.. రాయలసీమలో బీజేపీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిందన్నారు. ఓట్లు సీట్లతో సంబంధం లేకుండా కేంద్రం నంద్యాలలో పలు అభివృద్ధి పనులు చేసిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం నంద్యాల జిల్లాలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని పురంధేశ్వరి ధ్వజమెత్తారు.