Share News

Chandrababu: ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం!

ABN , Publish Date - Jul 02 , 2024 | 03:37 AM

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ఈ సమావేశం జరగనుంది..

Chandrababu: ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం!

  • విభజన అంశాలపై చర్చించుకుందాం

  • ఆమోదయోగ్య పరిష్కారాలు గుర్తిద్దాం

  • 6వ తేదీన మీరున్న చోటికే వస్తా..

  • రేవంత్‌ రెడ్డికి బాబు లేఖ

  • తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూల స్పందన

  • హైదరాబాద్‌లో ఇరువురు సీఎంల భేటీ

అమరావతి, జూలై 1 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) దీనిపై స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి (Revanth Reddy) లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంలో సంబంధిత అంశాలపై ముఖాముఖి చర్చించుకుందామని ప్రతిపాదించారు. ఇందుకు రేవంత్‌ కూడా అంగీకరించారు. దీనిపై మంగళవారం లిఖితపూర్వకంగా తన స్పందన తెలియచేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం అధికారికంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రులతోపాటు రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున సీనియర్‌ మంత్రులు, సంబంధిత అంశాలకు సంబంధించిన సీనియర్‌ అధికారులు కూడా హాజరవుతారు. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విభజన చట్టంలో పేర్కొన్న కొన్ని అంశాలు రెండు రాష్ట్రాల మధ్య ఇంకా అపరిష్కృతంగా ఉండిపోయాయి. ఉమ్మడి సంస్థల మధ్య ఆస్తుల విభజన కూడా పూర్తికాలేదు.

ఏమేం చర్చించొచ్చు..?

ఈ నేపథ్యంలోనే రేవంత్‌తో భేటీకి చంద్రబాబు సిద్ధమయ్యారు. ‘నేనే మీ వద్దకు వస్తాను’ అంటూ భేషజాలను పక్కన పెట్టి మరీ లేఖ రాశారు. ఈ భేటీకి ముందు చంద్రబాబు రెండు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఆ సమయంలో ఈ అపరిష్కృత సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురానున్నారు. దాని కొనసాగింపుగా రేవంత్‌తో ఆయా అంశాలపై చర్చిస్తారు. జగన్‌, కేసీఆర్‌ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఒకసారి సమావేశమైనా... అది వారిద్దరి వ్యక్తిగత భేటీగానే జరిగింది. ఏ అంశమూ పరిష్కారం కాలేదు. ఈసారి ఇటు చంద్రబాబు, అటు రేవంత్‌ ఇద్దరూ సానుకూల దృక్పథంతో ఉండటంతో... విభజన అంశాల పరిష్కారంలో ముందడుగు పడే అవకాశముందని అంటున్నారు.

ఇదే తొలిసారి...

చంద్రబాబు, రేవంత్‌ ముఖ్యమంత్రుల హోదాలో సమావేశం కావడం ఇదే మొదటిసారి. రేవంత్‌ గతంలో చంద్రబాబు నాయకత్వంలో టీడీపీలో పనిచేశారు. ఆ తర్వాత ఆ పార్టీని వీడి కాంగ్రె్‌సలో చేరారు. ఆ పార్టీ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. వేర్వేరు రాష్ట్రాలు, వేర్వేరు రాజకీయ శిబిరాల్లో ఉండటంతో వీరిద్దరూ కలుసుకోవడం ఇటీవలి కాలంలో సాధ్యపడలేదు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రేవంత్‌కు ఆహ్వానం అందినా... ఆ కార్యక్రమాన్ని ఎన్డీయే కూటమి కార్యక్రమంగా నిర్వహించడంతో ఆయన రాలేదు. అధికారికంగా రెండు రాష్ట్రాల మధ్య ఒక సమావేశాన్ని నిర్వహించాలన్న ఆలోచన ఇటీవల ఇరువైపులా వచ్చింది. దాని ఫలితమే ఈ సమావేశమని చెబుతున్నారు. దీనికి ప్రాతిపదికగా చంద్ర బాబు అధికారికంగా తెలంగాణ ముఖ్యమంత్రికి ఒక లేఖ రాసి దానిని సోమవారం రాత్రి తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్టు చేశారు.

Chandrababu-Letter.jpg


ఇదీ రేవంత్‌కు చంద్రబాబు లేఖ

‘‘తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు చేపట్టిన ప్రగతిశీల కార్యక్రమాలకు నా హృదయపూర్వక అభినందనలు. మీ అంకిత భావం, నాయకత్వ పటిమ తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉన్న మనం ఒక చక్కటి అనుబంధంతో పనిచేయగలిగితే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రెండింటి అభివృద్ధికి, పురోగతికి ఉపయోగపడుతుంది. మన ఉమ్మడి ఆలోచనలు, సహకార కృషి మన ఉమ్మడి లక్ష్యాల సాధనకు దోహదం చేసి ప్రజల జీవితాలు మెరుగు పడటానికి ఒక మార్గం ఏర్పరుస్తుంది. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికి పదేళ్లయింది. విభజన చట్టానికి సంబంధించిన అనేక అంశాలపై ఇంకా పలు రకాలైన చర్చలు జరుగుతున్నాయి. అత్యంత జాగురూకతతో ఉభయులకూ ఆమోదయోగ్యంగా వీటిని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. దీని కోసం ఈ నెల ఆరో తేదీ శనివారం మధ్యాహ్నం, మీ ప్రదేశంలో మనం కలుద్దాం. మనం ముఖాముఖీ కూర్చుని మాట్లాడుకోవడం వల్ల సున్నితమైన అంశాలకు పరిష్కారం కనుగొనడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ సమావేశంలో జరిగే చర్చల వల్ల ఉపయుక్తమైన పరిష్కారాలు వస్తాయని నేను విశ్వసిస్తున్నాను.’’

Updated Date - Jul 02 , 2024 | 07:32 AM