CM Chandrababu : చక్కదిద్దుతున్నాం
ABN , Publish Date - Dec 08 , 2024 | 03:42 AM
‘మెగా పేరెంట్-టీచర్స్ మీట్ (పీటీఎం) చరిత్రాత్మక కార్యక్రమం. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమం ఇచ్చే ఊతంతో రాబోయే రోజుల్లో విద్యావ్యవస్థలో పెనుమార్పులు రాబోతున్నాయని తెలిపారు.
చిక్కీల డబ్బులూ గత ప్రభుత్వం ఎగ్గొట్టింది
వారసత్వంగా అప్పులు, సమస్యలు వచ్చాయి
అన్నింటినీ సరిచేసే పనిలోనే ఉన్నా
పీటీఎం వంటి కార్యక్రమాలు చరిత్రాత్మకం
విద్యావ్యవస్థలో పెనుమార్పులకు అవకాశం
పాపులేషన్ మేనేజ్‌మెంట్ జరగాలి
వ్యసనాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దు
బాపట్లలో మెగా ‘పేరెంట్, టీచర్స్ మీట్’లో సీఎం చంద్రబాబు
ఒకే రోజు 44,303 స్కూళ్లలో 1.20 కోట్ల మందితో నిర్వహణ
‘‘గతంలోకి వెళ్లాలని లేదు. కానీ వారసత్వంగా గుంతల రోడ్లు, చెత్తతో నిండిన పట్టణాలు, 10 లక్షల కోట్ల అప్పు కూటమి ప్రభుత్వానికి వచ్చాయి. అన్నింటినీ సరిచేసే పనిలోనే ఉన్నా. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, విద్యార్థులకు యూనిఫాం కుట్టిన డబ్బులు, చివరికీ చిక్కీల డబ్బులు కూడా గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టి వెళ్లింది. స్కూళ్ల విలీనం పేరుతో తీసుకున్న అడ్డగోలు నిర్ణయాల వల్ల దాదాపు నాలుగు లక్షల మంది పిల్లలు డ్రాపౌట్లుగా మిగిలారు.’’
- సీఎం చంద్రబాబు
బాపట్ల, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ‘మెగా పేరెంట్-టీచర్స్ మీట్ (పీటీఎం) చరిత్రాత్మక కార్యక్రమం. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమం ఇచ్చే ఊతంతో రాబోయే రోజుల్లో విద్యావ్యవస్థలో పెనుమార్పులు రాబోతున్నాయని తెలిపారు. ‘పిల్లల బంగారు భవిష్యత్తు వైపు.. బడి వైపు ఒక అడుగు’ పేరిట శనివారం బాపట్ల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ హైస్కూల్‌లో జరిగిన పీటీఎం కార్యక్రమంలో మంత్రి లోకేశ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఒకేసారి 44,303 స్కూళ్లలో 1.20కోట్ల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం అపురూపమనీ, ఓ రకంగా ఇది గిన్నిస్ రికార్డుగా కూడా మిగిలిపోతుందని సీఎం వ్యాఖ్యానించారు. ఇందుకు లోకేశ్, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ను అభినందిస్తున్నానని తెలిపారు. ఎస్‌పీటీపీ (స్టూడెంట్-పేరెంట్-టీచర్-ప్రభుత్వం) ఒప్పందంతో విద్యార్థి భవిష్యత్‌కు హామీ లభిస్తుందని చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘‘భారతీయ కుటుంబ వ్యవస్థ ఎంతో గొప్పది. బిడ్డలను అంటిపెట్టుకుని ఉండేది తల్లే. నేను లోకేశ్‌కు సమయం కేటాయించలేక పోయినా తల్లి స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ వరకు తీసుకెళ్లింది. పిల్లల భవిష్యత్తు బంగారుమయం కావాలంటే తల్లిదండ్రుల పాత్ర కీలకం. ఇందులో తల్లి పాత్ర మరింత ఎక్కువ. చిన్నప్పుడు నాకు చదువు చెప్పిన టీచర్‌ను ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. ఇదే మన సంస్కృతి గొప్పదనం’’
వాట్సా్‌ప్‌కే పిల్లల మార్కులు..
‘‘ఈ మీటింగ్ వేర్వేరు తేదీల్లో జరిగి ఉంటే ఇంత స్పందన వచ్చేది కాదేమో. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి పెద్దఎత్తున చదువుల పండుగలాగా జరగడంతో విద్యావ్యవస్థలో ఉన్న లోటుపాట్లతో పాటు చేయాల్సిన సంస్కరణలు చర్చకు వచ్చాయి. ఇక నుంచి పిల్లల హాజరు వివరాల నుంచి సబ్జెక్టుల వారీగా మార్కుల వరకు తల్లిదండ్రుల వాట్సా్‌పకే పంపిస్తాం. స్కూల్‌కు రాకపోయినా ఆ విద్యార్థి తల్లిదండ్రులను టీచర్ సంప్రదించడం, మెసేజ్ పెట్టడం చేస్తారు. సంవత్సరానికి మూడుసార్లు విద్యార్థి చదువు మీద మూల్యాంకనం చేసేలా చూడాలని ఆదేశాలిచ్చాను. విద్యార్థులు చదువుతోపాటు ప్రవర్తన, క్రమశిక్షణ కలిగి ఉండాలి. డీఎస్సీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తాం. వచ్చే జూన్ కల్లా కొత్త టీచర్లు విధుల్లో ఉంటారు. వ్యసనాలకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకోవద్దు. పాఠశాలల్లో క్రీడా మైదానాలు ఉండేలా చూస్తాం. రాబోయే రోజుల్లో స్కూళ్లకు రేటింగ్ ఇస్తాం. దీనికి సంబంధించి 18 అంశాల్లో ప్రోగ్రెస్ రిపోర్టును తయారుచేసి విద్యార్థుల పురోగతితో పాటు స్కూళ్లకు గ్రేడింగ్ ఇచ్చి వెనకబడి ఉన్నవాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. బాపట్ల మున్సిపల్ హైస్కూల్‌కు 43 శాతం మాత్రమే గ్రేడింగ్ వచ్చింది. దానిని వచ్చే ఏడాదికి 90 శాతానికి తీసుకెళతాం. ప్రతి ఏడాది ఇదే రోజు(డిసెంబరు 7) మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ జరుగుతుంది’’
జనాభా పెరుగుదలపై దృష్టి పెట్టాలి..
‘‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ జరగాలి. జనాభా పెరగాల్సి ఉంది. ప్రతి ఆడబిడ్డ ఇద్దరు పిల్లలను కనాలి. రాష్ట్రంలో పిల్లల శాతం 1.75 ఉంటే, ఇది బాపట్లలో మరీ తీసికట్టుగా 1.45గా ఉంది’’ అని చంద్రబాబు అన్నారు. అనంతరం పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ముద్రించిన ‘మనబడి’ మాస పత్రికను చంద్రబాబు ఆవిష్కరించారు.
అనునిత్యం నేను విద్యార్థినే..
‘‘ఇప్పటికీ నేను అనునిత్యం నేర్చుకుంటూనే ఉంటాను. కొత్తగా నేర్చుకున్న విషయాలను ప్రజల మేలు కోసం అమలు చేయడం సంతృప్తిని ఇస్తోంది. స్వర్ణాంధ్ర-2047ను సాకారం చేసి చూపిస్తాను. నాది ఒక్కటే లక్ష్యం. .ప్రతి పేద విద్యార్థీ చదువులో ముందుండాలి. బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలి. ఇందులో భాగస్వాములుగా ప్రభుత్వంతో పాటు టీచర్స్, తల్లిదండ్రులు తమ బాధ్యత నిర్వహించాలి. ఇదే నాకల. దీనిని సాకారం చేసి తీరుతాను. ప్రతి ఒక్క విద్యార్థికీ మంచి భవిష్యత్‌ను అందిస్తాను’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.