Share News

Deputy CM Pawan Kalyan : తోలుతీసి కూర్చోబెడతాం

ABN , Publish Date - Dec 29 , 2024 | 03:52 AM

‘‘గతంలో ఎంపీడీవో ప్రతా్‌పరెడ్డి, శేఖర్‌నాయక్‌, శ్రీనివాసులరెడ్డిపై దాడి చేశారు. ఇప్పుడు జవహర్‌బాబుపై దాడి చేశారు. వైసీపీ నేతలకు అహంకారం తలకెక్కింది.

Deputy CM Pawan Kalyan : తోలుతీసి కూర్చోబెడతాం

  • వైసీపీ నేతలకు అహంకారం తలకెక్కింది.. 11 సీట్లొచ్చినా తగ్గలేదు

  • అధికారులపై దాడులు చేస్తే ఎవ్వరినీ సహించేది లేదు

  • వచ్చి సీమలోనే కూర్చుంటా.. పిచ్చివేషాలు వేస్తే దుస్తులిప్పి కొడతాం

  • సీమ వాసులూ.. ధైర్యంగా బయటికొచ్చి దాడులు ఎదుర్కోండి

  • ప్రభుత్వం అండగా ఉంటుంది.. సింహాద్రిపురం రైతు ఆత్మహత్యపై సమగ్ర విచారణకు ఆదేశించాం: ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌

  • వైసీపీ దాడిలో గాయపడ్డ ఎంపీడీవో జవహర్‌బాబుకు పరామర్శ

కడప/రాయచోటి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): ‘‘గతంలో ఎంపీడీవో ప్రతా్‌పరెడ్డి, శేఖర్‌నాయక్‌, శ్రీనివాసులరెడ్డిపై దాడి చేశారు. ఇప్పుడు జవహర్‌బాబుపై దాడి చేశారు. వైసీపీ నేతలకు అహంకారం తలకెక్కింది. తోలుతీసి కూర్చోబెడతాం. ఆధిపత్యపు అహకారంతో దాడిచేస్తే మీ అహంకారాన్ని అణిచేస్తాం’’ అని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కూటమి ప్రభుత్వం త్రికరణశుద్ధితో పనిచేస్తోందని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎలా నియంత్రించాలో తెలుసనని వ్యాఖ్యానించారు. ‘‘వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా గాలిలో విహరిస్తున్నారు. 11 సీట్లే వచ్చినా అహంకారం తగ్గలేదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి కడప జిల్లా గాలివీడు మండలం ఎంపీడీవోపై శుక్రవారం దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో గాయపడి ప్రస్తుతం కడప రిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీడీవో జవహర్‌బాబును శనివారం డిప్యూటీ సీఎం పరామర్శించారు. 15 నిమిషాల పాటు ఆసుపత్రిలో ఉండి ఎంపీడీవో ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జవహర్‌బాబు, ఆయన భార్య అర్చన, కుమార్తె హాన్సి, కుమారుడు వినీత్‌లను పరామర్శించి ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘గాలివీడు ఎంపీడీవోపై దాడి చేసిన వ్యక్తి జల్లా సుదర్శన్‌రెడ్డి. ఈయన లాయర్‌. స్టేట్‌ లా ప్రాసిక్యూషన్‌ ఆఫీసర్‌గా పనిచేసిన వ్యక్తి. ఆయన తల్లి మండల అధ్యక్షురాలు. తాళాలు అడిగితే ఇవ్వలేదని.. దాదాపు 11 మంది వ్యక్తులు దాడి చేశారు.

Untitled-2 copy.jpg


కుటుంబ సభ్యులకు తాళాలు ఇవ్వడం కుదరదన్నందుకు ఇష్టానుసారం దాడికి తెగబడ్డారు. ఎంపీడీవో అంటే మండలానికి కలెక్టర్‌లాంటి వారు. ఆయనపై జరిగిన దాడిని రాష్ట్ర యంత్రాంగంపై జరిగిన దాడిగా భావించా’’ అని అన్నారు. జవహర్‌బాబును సుదర్శన్‌ రెడ్డి కులం పేరుతో దూషించినట్టు తెలిపారు. ‘‘ఎలా తిరుగుతావో చూస్తామని బెదిరించారు. గదిలో తలుపు వేసి అమానుషంగా కొట్టారు. గత ప్రభుత్వంలో మాదిరిగా రెచ్చిపోయారు. ఇష్టారాజ్యంగా అధికారులపై దాడి చేస్తే కూటమి ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదు. ఆధిపత్యంతో దాడి చేస్తే తోలుతీస్తాం. 11 సీట్లు వస్తేనే గాల్లో తేలుతున్నారు. అవి కూడా లేకుండా చేస్తాం. మిమ్మల్ని ఎలా కిందికి దించాలో నాకు తెలుసు. చేసి చూపిస్తాం. ఏ అధికారిపై అయినా దాడులకు దిగినా, విధులకు అడ్డుపడినా కఠిన చర్యలు ఉంటాయి. దాడి చేసిన వారు లాయర్లు అయినా సరే ఏ చట్టాలు గానీ అధికారాలు గానీ మిమ్మల్ని రక్షించలేవు’’ అని హెచ్చరించారు. ‘‘ఆధిపత్య దాడులు చేస్తే ఎదుర్కోండి. మీకు అండగా మేముంటాం’’ అని రాయలసీమ యువతకు, ప్రజలకు పిలుపునిచ్చారు. దాడి చేసిన వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడేలా వ్యవహరించాలని సూచించారు. కడప జిల్లా సింహాద్రిపురం మండలంలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న విషయం తనకు తెలిసిందని చెప్పారు. కారణాలు తెలియాల్సి ఉందన్నారు. పూర్తి విచారణ చేస్తున్నారన్నారు. అభివృద్ధిలో ముందుకు వెళ్తున్న సమయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సరైన రీతిలో అధికార యంత్రాగానికి స్పందించకపోతే.. తగిన రీతిలో చర్యలు ఉంటాయని హెచ్చరించారు.


సీఎం సహనాన్ని పరీక్షించొద్దు

‘‘సుదర్శన్‌రెడ్డి గత ఐదేళ్లలో గాలివీడు మండలంలో ప్రభుత్వ ఉద్యోగులైన ప్రతాప్‌ అనే ఓ దివ్యాంగుడిపైన, శ్రీనివాసులరెడ్డి, శేఖర్‌నాయక్‌ మీద దాడిచేశారు. ఇప్పుడు జవహర్‌బాబు మీద దాడిచేసిన ఏ ఒక్కరినీ వదిలేది లేదు. ఎక్కడ దాక్కున్కా బయటకు తెచ్చి జైలుకు పంపుతాం. సీఎం చంద్రబాబు చాలా సంయమనంతో ఉన్నారు. ఆయనను పరీక్షించకండి’’ అని పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు.

సీమలో క్యాంపు కార్యాలయం పెడతా

గాలివీడులో ఎంపీడీవోపై దాడి జరిగిన కార్యాలయాన్ని ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అధికారంలో ఉన్నామని మర్యాద కోసమే మంచిగా మాట్లాడుతున్నా.. పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే దుస్తులిప్పి కొడతాం. అవసరమైతే రాయలసీమలో నా క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తా. వైసీపీ నాయకులను సరిదిద్ది వెళ్తా’’ అని అన్నారు. మన్యం జిల్లాలో జరిగిన తన పర్యటనలో ఓ నకిలీ ఐపీఎస్‌ అధికారి పాల్గొన్న విషయమై పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ఈ విషయం కడప పర్యటనకు వస్తున్న సమయంలో తెలిసిందన్నారు. ‘‘నా భద్రత చూసే బాధ్యత పోలీసులు, హోం శాఖదే’’ అని స్పష్టం చేశారు.

ఏంటయ్యా మీరు.. ఫ్యాన్స్‌పై అసహనం

మీడియాతో పవన్‌కల్యాణ్‌ మాట్లాడేటపుడు అభిమానులు ‘ఓజీ ఓజీ, సీఎం సీఎం’ అని బిగ్గరగా నినాదాలు చేశారు. దీంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. ‘‘ఏంటయ్యా మీరు? ఎక్కడ ఏం చేయాలో తెలియదా’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ విషయం మీడియా ప్రస్తావించగా సినిమా కంటే పెద్ద విషయాలు ఉన్నాయని, అరాచకాలు జరుగుతున్నాయని, మనుషులు చచ్చిపోతున్నారని, ఇప్పుడు సినిమాల గురించి మాట్లాడతారా అని ప్రశ్నించారు. అరాచకాల గురించి మాట్లాడాలని సూచించారు.

నిందితులకు 14 రోజుల రిమాండ్‌

జవహర్‌బాబుపై దాడి చేసిన ముగ్గురు నిందితులకు లక్కిరెడ్డిపల్లె కోర్టు జడ్జి ఫైజున్నీసా 14 రోజులు రిమాండ్‌ విధించినట్లు పోలీసులు తెలిపారు. వారిని కడప సెంట్రల్‌జైలుకు తరలించినట్లు చెప్పారు.

Updated Date - Dec 29 , 2024 | 03:52 AM