AP Floods: అదంతా అబద్ధం.. ఎవరూ నమ్మొద్దు..
ABN , Publish Date - Sep 04 , 2024 | 09:23 PM
విజయవాడ, పరిసర గ్రామాల ప్రజల వెణ్ణులో వణుకు పుట్టించిన బుడమేరుపై ఓ దుష్ప్రచారం బాగా వైరల్ అవుతోంది. బుడమేరుకు మళ్లీ వరద అంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. సృజన స్పందించారు. బుడమేరుకు మళ్లీ వరద అంటూ ..
అమరావతి, సెప్టెంబర్ 04: విజయవాడ, పరిసర గ్రామాల ప్రజల వెణ్ణులో వణుకు పుట్టించిన బుడమేరుపై ఓ దుష్ప్రచారం బాగా వైరల్ అవుతోంది. బుడమేరుకు మళ్లీ వరద అంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. సృజన స్పందించారు. బుడమేరుకు మళ్లీ వరద అంటూ వస్తున్న వదంతులను నమ్మొద్దని స్పష్టం చేశారు. బుడమేరులో ప్రమాదకర స్థాయిలో నీళ్లు లేవన్నారు. బుడమేరుకు మళ్లీ వరద వస్తే ముందుగానే సమాచారం అందిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకుని సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. బుడమేరు ప్రాంత ప్రజలకు ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని కలెక్టర్ క్లారిటీ ఇచ్చారు. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని.. ధైర్యంగా ఉండాలని కలెక్టర్ చెప్పారు.
భారీ వర్షాల కారణంగా బుడమేరు ఉప్పొంగింది. దీంతో విజయవాడ సహా పరిసర ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రెండంతస్తుల బిల్డింగ్స్ కూడా నీటిలో మునిగిపోయాయంటే పరిస్థితి ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. విజయవాడను ఇంత పెద్ద ఎత్తున వరదలు ముంచెత్తడానికి ఓవైపు బుడమేరు, మరోవైపు మున్నేరు కారణం అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా.. ఈ వరదలు మాత్రం పెను నష్టాన్ని, తీవ్ర విషాదాన్ని మిగిల్చారు.
అధికారిక సమాచారం ప్రకారం నష్ట తీవ్రత ఇదీ..
భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 24 మంది చనిపోయారు. గుంటూరు జిల్లాలో ఏడుగురు మృతి చెందగా.. పల్నాడు జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 1,69,370 ఎకరాల్లో పంట, 18424 ఎకరాల్లో ఉద్యాన వన పంటలకు నష్టం వాటిల్లింది. 2.34 లక్షల మంది రైతులు నష్టపోయారు. 60 వేల కోళ్లు మృతి చెందగా.. 222 పశువులు మృతి చెందాయి. వరదల వలన 22 సబ్ స్టేషన్‌లు దెబ్బతిన్నాయి. 3,973 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయి. 78 చెరువులకు, కాలువలకు గండ్లు పడ్డాయి. వర్షం, వరదల వలన 6,44,536 మంది నష్టపోయారు. 193 రిలీఫ్ క్యాంపుల్లో 42,707 మంది ఆశ్రయం పొందుతున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు 50 ఎన్‌డిఆర్ఎఫ్, ఎస్‌డిఆర్ఎఫ్ టీమ్‌లు రంగంలో దిగాయి. ఆరు హెలికాఫ్టర్లు పనిచేస్తున్నాయి. 228 బోట్లను సిద్ధం చేశారు. 317 గజ ఈతగాళ్లను రంగంలో దింపారు. కాగా, ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదికి 3లక్షల 16 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది.