Share News

Mining Case : ఓఎంసీ కేసులో బెజవాడ కోర్టుకు టీడీపీ నేతలు

ABN , Publish Date - Dec 25 , 2024 | 04:34 AM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం పార్టీ నేతలపై నమోదైన ఓబులాపురం అక్రమ మైనింగ్‌ పరిశీలన కేసు విచారణ మంగళవారం విజయవాడలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో జరిగింది.

Mining Case : ఓఎంసీ కేసులో బెజవాడ కోర్టుకు టీడీపీ నేతలు

  • 18 మందికి 17 మంది హాజరు.. జనవరి 8కి కేసు వాయిదా

విజయవాడ, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం పార్టీ నేతలపై నమోదైన ఓబులాపురం అక్రమ మైనింగ్‌ పరిశీలన కేసు విచారణ మంగళవారం విజయవాడలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో జరిగింది. విచారణ అనంతరం జనవరి 8కి న్యాయాధికారి శ్రీదేవి కేసును వాయిదా వేశారు. 2007లో వైఎస్‌ రాజశేఖరెడ్డి సీఎంగా ఉన్నపుడు ఓబులాపురం అక్రమ మైనింగ్‌ను పరిశీలిచేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు 21 మంది నేతలతో నిజనిర్ధారణ కమిటీ వేశారు. ఈ కమిటీలో నాగం జనార్దనరెడ్డి, దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, ఎర్రబల్లి దయాకరరావు, అమరనాథ్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, మెట్టు గోవర్థన్‌ రెడ్డి, పడాల అరుణ, కోళ్ల లలితకుమారి, బొమ్మిడి నారాయణరావు, ఎం పద్మజ, యలమంచిలి రాజేంద్ర ప్రసాద్‌, చిన్నంబాబు రమేశ్‌, పూల నాగరాజు, ములగాని రామకృష్ణారెడ్డి, వీరంకి గురుమూర్తి, పన్నిశెట్టి రంగనాయకులు, కొప్పుల హరీశ్వరరెడ్డి, కే రమణ ఉన్నారు. వీరిలో పన్నిశెట్టి రంగనాయకులు, కొప్పుల హరీశ్వరరెడ్డి, కే రమణ చనిపోయారు. మిగిలిన 17 మందిపై కేసు విచారణ కొనసాగుతోంది. కిందటి నెలలో జరిగిన విచారణకు కొందరు నేతలు గైర్హాజరు కావడంతో న్యాయాధికారి శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబరు 24న అందరూ హాజరు కావాలని ఆదేశించారు.

మంగళవారం నాటి విచారణకు గోవిందప్ప ఒక్కరు మాత్రమే హాజరు కాలేదు. టీడీపీ నేతల తరఫున న్యాయవాదులు గూడపాటి లక్ష్మీనారాయణ, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్‌, ఎంవీవీ సత్యనారాయణ తమ వాదనలను వినిపించారు. అనంతరం న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, గోవిందప్ప ఒక్కరు హాజరు కాకపోవటం వల్ల కేసు జనవరి 8కి వాయిదా పడింది’ అని చెప్పారు. కాగా, మంగళవారం కోర్టుకు వచ్చిన వారంతా సుమారు నాలుగు గంటలపాటు కోర్టు ప్రాంగణంలో కలిసి గడిపారు. ఆత్మీయ ఆలింగనాల మధ్య ఉమ్మడి జ్ఞాపకాలను కలబోసుకున్నారు.

Updated Date - Dec 25 , 2024 | 04:34 AM