Share News

Earthquakes: ప్రకాశం జిల్లాలో ఆగని భూప్రకంనలు.. పరుగులు తీసిన జనం

ABN , Publish Date - Dec 23 , 2024 | 09:08 PM

ప్రకాశం జిల్లాలో గత రెండు రోజులుగా వరుస భూప్రకంపనలు వస్తున్నాయి. భూ ప్రకంపనలు వరుసగా చోటు చేసుకుంటుండంతో ఏం జరుగుతోందోనని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవతున్నారు.

Earthquakes: ప్రకాశం జిల్లాలో ఆగని భూప్రకంనలు.. పరుగులు తీసిన జనం

ప్రకాశం : ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరులో వరుస భూ ప్రకంపనలు వస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి వరుసగా భూప్రకంపనలు వస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.మూడు రోజులుగా ముండ్లమూరులో వరుస భూ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ(సోమవారం) ఉదయం 10:41 గంటల సమయంలో భూ ప్రకంపనలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సాయంత్రం 8:15, 8:16, 8:19 గంటలకు వరుస‌గా భూ ప్రకంపనలు వచ్చాయి. భూప్రకంపనలు రావడంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. ఒక రోజు వ్యవధిలోనే నాలుగు సార్లు ముండ్లమూరులో వచ్చాయి. స్వల్ప భూ ప్రకంపనలు వరుసగా సంభవిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


ప్రజల్లో భయాందోళన...

కాగా.. ముండ్లమూరులో మరోసారి భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. మూడ్రోజులుగా ముండ్లమూరులో వరస భూప్రకంపనలు ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. శని, ఆదివారాల్లో ఉదయం 10:35 గంటలకు భూమి కంపించింది. ఇవాళ మరోసారి అదే సమయానికి ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. శని, ఆదివారాల్లో వచ్చిన ప్రకంపనలకు ఇళ్లల్లోని వస్తువులు సైతం కదిలిపోయాయి. మూడ్రోజులుగా వస్తున్న భూప్రకంపనలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఆ ప్రాంతంలో అసలు ఏం జరుగుతుందో అర్థంకాక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


శని, ఆదివారాల్లో జరిగిందిదే..

ప్రకాశం జిల్లా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో శనివారం నాడు రెండు సెకన్లపాటు భూమి కంపించింది. ముండ్లమూరు, పసుపుగల్లు, వేంపాడు, మారెళ్ల, తాళ్లూరు, శంకరాపురం, పోలవరం, గంగవరం, తూర్పుకంభంపాడు, శంకరాపురం, రామభద్రాపురంలో భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి విద్యార్థులు, ఉద్యోగులు సైతం ప్రాణభయంతో పరుగులు పెట్టారు. రెండు సెకన్లపాటు భూమి కంపించడంతో ఇళ్లల్లోని వస్తువులు సైతం కదిలిపోయాయని స్థానికులు చెప్పారు. ఆదివారం రోజు సైతం ముండ్లమూరు, సింగన్నపాలెం, మారెళ్లలో సెకనుపాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు మళ్లీ ఇళ్ల నుంచి పరుగులు తీశారు. వస్తువులు సైతం కదిలిపోవడంతో ప్రాణ భయంతో కేకలు వేశారు. కాగా, నేడు మరోసారి భూప్రకంపనలు రావడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.


మంత్రులు ఆరా..

భూప్రకంపనలపై జిల్లా కలెక్టర్‌తో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయస్వాములు మాట్లాడారు. నిన్న (ఆదివారం) కలెక్టర్‌కు ఫోన్ చేసిన మంత్రులు వివరాలు ఆరా తీశారు. తరచుగా ఆ ప్రాంతంలో ప్రకంపనలు ఎందుకు వస్తున్నాయో డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలతోనూ చర్చించి పూర్తిగా సమాచారం సేకరించాలని చెప్పారు. భూ ప్రకంపనలపై సమగ్ర నివేదిక తయారు చేసి అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. జిల్లా వాసులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని మంత్రులు చెప్పారు.

Updated Date - Dec 23 , 2024 | 09:54 PM