Ayodhya: అయోధ్య రాముడికి తిరుపతి వెంకన్న సాయం.. ఆ సమస్య పరిష్కారం కోసమే..
ABN , Publish Date - Jan 31 , 2024 | 01:16 PM
అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా పూర్తయింది. దేశవిదేశాల నుంచి వస్తున్న భక్తులతో సాకేతపురి భక్తజన సంద్రంగా మారింది.
అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా పూర్తయింది. దేశవిదేశాల నుంచి వస్తున్న భక్తులతో సాకేతపురి భక్తజన సంద్రంగా మారింది. రద్దీ ఎక్కువగా ఉండటంతో రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం - టీటీడీ అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయాలని నిర్ణయించింది. దైవ దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్‌లో గంటల తరబడి నిల్చున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడంలో టీటీడీకి మంచి పేరుంది. ప్రపంచంలోనే ఎక్కువ మంది భక్తులు వచ్చే ఆలయంగా.. రెండో ధనిక దేవాలయంగా పేరుంది. దీంతో టీటీడీ అవలంబిస్తున్న రద్దీ నిర్వహణ పద్ధతుల అధ్యయనం కోసం త్వరలోనే అయోధ్య నుంచి ఓ బృందం తిరుమలకు రానున్నట్లు టీటీడీ వెల్లడించింది.
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్య ట్రస్ట్ అధికారులు, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డితో చర్చించారు. ఉత్తమ విధానాలను అధ్యయనం చేయడానికి తిరుపతికి వెళ్లాలనుకున్నారు. వారి విన్నపాన్ని అంగీకరించిన టీటీడీ తిరుపతికి రావాలని ఆహ్వానం పంపింది. అంతే కాకుండా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపింది. తిరుమల ఆలయానికి రోజూ 60,000 మందికి పైగా భక్తులు వస్తుంటారు. వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, పండుగలు, సెలవు రోజుల్లో ఈ సంఖ్య లక్ష దాటుతుంది.
దర్శన క్యూ లైన్లు, వసతి కేంద్రాలు, లడ్డూ కౌంటర్లు, టోకెన్ సెంటర్లు, అన్నప్రసాదం కాంప్లెక్స్ వంటి ప్రాంతాల్లో రద్దీ పెరుగుతుండటంతో టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. రద్దీ నిర్వహణ విధానం ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు చక్కబెడుతోంది. మహారాష్ట్రలోని షిర్డీ సంస్థాన్, జమ్మూలోని మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్ర ట్రస్ట్ ఇప్పటికే తిరుమలను సందర్శించింది. కాగా.. టీటీడీ జమ్మూ, హర్యానా, న్యూఢిల్లీ, ముంబయి, భువనేశ్వర్, హైదరాబాద్, చెన్నై, కన్యాకుమారి, బెంగళూరుల్లో దేవాలయాలను స్థాపించింది.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.