Share News

Rajamahendravaram: సినీఫక్కీలో పోలీసులపై దాడి.. ఎట్టకేలకు నిందితుల అరెస్ట్

ABN , Publish Date - Dec 17 , 2024 | 08:19 PM

పోలీసులపై సినీఫక్కీలో దాడిచేసి తమ ముఠా సభ్యుడిని ఎత్తుకెళ్లిన నిందితులను అదుపులోకి తీసుకున్న రాజమండ్రి పోలీసులు.. వారెలా అరెస్ట్ అయ్యారంటే..

Rajamahendravaram: సినీఫక్కీలో పోలీసులపై దాడి.. ఎట్టకేలకు నిందితుల అరెస్ట్
rajamahendravaram

శ్రీకాకుళం పోలీసులపై రాజమహేంద్రవరంలో దాడి చేసిన దొంగ నోట్ల ముఠా నిందితులు అరెస్టయ్యారు. పోలీసులను వాహనాలతో వెంబడించి ముఠా సభ్యుడు ప్రతాపరెడ్డిని ఎత్తుకెళ్లిన ఘటనలో.. 13 మందిని రాజమండ్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడికి వారు వినియోగించిన కారు, రూ.60 లక్షల నకిలీ నగదునూ స్వాధీనం చేసుకున్నారు.


శ్రీకాకుళం జిల్లాలో దొంగనోట్లు చలామణీ కేసులో రవి, రాజేష్ అనే ఇద్దరు నిందితులని జి.సిగడాం పరిధిలోని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో వారు చెప్పిన సమాచారం ఆధారంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన రాపాక ప్రభాకర్‌ అలియాస్‌ ప్రతాప్‌ రెడ్డి, కృష్ణ మూర్తిని ప్రధాన నిందితులని తేలింది. కృష్ణమూర్తి, ప్రతాపరెడ్డిని అరెస్టు చేసేందుకు ఈ నెల 12న భీమవరం వచ్చారు శ్రీకాకుళం పోలీసులు. అక్కడ ఓ హోటల్ నుంచి బయటకు వస్తూ కనిపించించిన ప్రతాప్‌ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత కృష్ణమూర్తిని పట్టుకునేందుకు వివరాల కోసం ప్రకాశం నగర్‌ పోలీసులను కలిశారు. ఎంత వెతికినా దొరక్కపోవడంతో శ్రీకాకుళానికి తిరుగు ప్రయాణం అయ్యారు.


ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో 18 మంది దుండగులు రెండు కార్లు, నాలుగు ద్విచక్రవాహనాలతో శ్రీకాకుళం పోలీసులను వెంబడించారు. ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి వీఎల్‌ పురం వెళ్లే మార్గంలో అడ్డుకున్నారు. పోలీసులు ప్రతిఘటించడంతో దాడికి పాల్పడ్డారు. చంపుతామని బెదిరిస్తూ నిందితుడు ప్రతాప్‌రెడ్డితో పాటు పోలీసుల వాహన తాళం తీసుకుని దుండగులు పరారయ్యారు. ఈ దాడిలో నలుగురు పోలీసులకు స్వల్పగాయాలవగా....వాహన అద్దాలు ధ్వంసమయ్యాయి.


నిందితులను పట్టుకునేందుకు రాజమహేంద్రవరంలోని ప్రకాశ్ నగర్ సీఐ బాజీలాల్ నేతృత్వంలో ఆరు పోలీసు బృందాలు ఏర్పాటయ్యాయి. దాడికి పాల్పడిన వారి గురించి నర్సాపురం, భీమవరంలో దర్యాప్తు చేసి 13 మంది నిందితులను గుర్తించారు. వారిని అరెస్టు చేసి దాడికి వినియోగించిన కారు సహా...18లక్షలు అసలు నగదుకు 60 లక్షలు నకిలీ నగదునుస్వాధీనం చేసుకున్నామనట్లు ఏఎస్పీ వెల్లడించారు. ఘటన జరిగిన రోజున కాకినాడలో నకిలీ నోట్ల చలామణీ చేస్తున్న నిందితుడు కృష్ణమూర్తి బస్టాండ్‌లో ఉన్నాడంటూ రాంగ్ అడ్రస్ ఇచ్చి పోలీసులను తప్పదోవ పట్టించారని తెలిపారు. ప్రధాన నిందితుడు ప్రతాప్ రెడ్డి ఇంకా దొరకలేదని...హత్యాయత్నం చేసిన మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.సెక్షన్ 307 తో పాటు పలు సెక్షన్లు కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. వీరిపై ఇంకా అనేక నేరారోపణలున్నాయని.. గాలింపు చర్యలు వేగంగా కొనసాగుతాయని వెల్లడించారు.

Updated Date - Dec 17 , 2024 | 08:23 PM