Share News

LV Subramaniam : హవ్వా... ఇదేమి చిత్రం!

ABN , Publish Date - Jun 28 , 2024 | 05:08 AM

వెనకటికెవరో ఇల్లు పీకి పందిరేస్తా అన్నాడంట! ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆలోచనా సరళి ఇలాగే వింతగా ఉండేదని మరోసారి స్పష్టమైంది.

LV Subramaniam : హవ్వా... ఇదేమి చిత్రం!
LV Subramaniam

  • స్టీల్‌ప్లాంటును ఎత్తేసి రాజధాని పెడతారట!

  • విశాఖ ఉక్కుతో కాలుష్యమట

  • నాటి ప్రతిపాదన బయటపెట్టిన ఎల్వీ


(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)

వెనకటికెవరో ఇల్లు పీకి పందిరేస్తా అన్నాడంట! ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆలోచనా సరళి ఇలాగే వింతగా ఉండేదని మరోసారి స్పష్టమైంది. అమరావతిలో 33 వేల ఎకరాల భూమి, అప్పటికే జరిగిన నిర్మాణాలను కాదని... జగన్‌ విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్కడ... విశాఖ ఉక్కును ఎత్తేసి, ఆ కర్మాగారానికి చెందిన 30 వేల ఎకరాల్లో రాజధాని పెట్టేద్దామని జగన్‌ ఒక చిత్ర విచిత్రమైన ఆలోచన చేశారట. జగన్‌ దగ్గర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, కొన్నాళ్లకే ఆయన ఆగ్రహానికి గురైన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రమణ్యం ఈ విషయం బయటపెట్టారు.


‘‘అది సాధ్యం కాదని, మంచి పద్ధతి కాదని నేను చెప్పాను. కానీ... స్టీల్‌ప్లాంటు వల్ల విశాఖపట్నం కాలుష్యమయం అవుతోందని, దానిని ఎలా కొనసాగిస్తామని జగన్‌ వాదించారు. మంచి ఆలోచన చేసినప్పుడు అడ్డం పడవద్దని హెచ్చరించారు’’ అని ఎల్వీ సుబ్రహ్మణ్యం ఓ టీవీ చానల్‌లో జరిగిన చర్చలో వెల్లడించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కును మూసేద్దామనడమే ఒక వింత! ఆ భూముల్లో రాజధాని పెడతామనడం వింతల్లోకే వింత! విశాఖలో భూములు, ఆస్తులపై తప్ప...


విశాఖ నగరం బాగుపై ఎప్పుడూ జగన్‌ దృష్టి సారించలేదు. విశాఖ ఉక్కును కాపాడేందుకు వీసమెత్తు ప్రయత్నం చేయలేదు. ఉక్కు స్థలంలో రాజధాని పెట్టాలనే ప్రతిపాదన చేయడం నిజమే. దాని వెనుక కూడా భూములను స్వాహా చేసే భారీ కుట్ర దాగి ఉంటుందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. విశాఖ ఉక్కుకు అనుసంధానంగా ఉండే గంగవరం పోర్టును అదానీకి కట్టబెట్టేసిన విషయాన్నీ జనం గుర్తు చేసుకుంటున్నారు.

Updated Date - Jun 28 , 2024 | 10:02 AM