Share News

Swarnandhra Vision 2047 : 100% అక్షరాస్యత

ABN , Publish Date - Dec 14 , 2024 | 03:39 AM

రాష్ట్రంలో 2047 నాటికి వందశాతం అక్ష్యరాస్యత రేటు సాధించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Swarnandhra Vision 2047 : 100% అక్షరాస్యత

  • 2047 నాటికి 100% అక్షరాస్యత నిరుద్యోగ రేటు 2% కంటే తగ్గాలి

  • పాఠశాల స్థాయిలోనే వృత్తి విద్య

  • ‘స్వర్ణాంధ్ర’ డాక్యుమెంట్‌లో లక్ష్యాలు

అమరావతి, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2047 నాటికి వందశాతం అక్ష్యరాస్యత రేటు సాధించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం విడుదల చేసిన స్వర్ణాంధ్ర-2047 విజన్‌ డాక్యుమెంట్‌లో విద్య, ఉపాధిపై లక్ష్యాలు నిర్దేశించింది. అక్షరాస్యత రేటు ప్రస్తుతం 72 శాతం ఉండగా, 2029 నాటికి 90 శాతం దాటాలని, 2047 నాటికి వందశాతం చేరుకోవాలని పేర్కొంది. రాష్ట్రంలో 15-59 ఏళ్ల మధ్య వయసు వారిలో నిరుద్యోగులు ప్రస్తుతం 4.1 శాతం ఉన్నారని, 2029 నాటికి దానిని 3 శాతం కంటే తక్కువకు, 2047 నాటికి 2 శాతం లోపునకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2047 నాటికి ప్రపంచంలోని టాప్‌-100 యూనివర్సిటీల్లో రాష్ట్రం నుంచి రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలని పేర్కొంది. ఉన్నత విద్యలో విద్యార్థుల నమోదు శాతం ప్రస్తుతం 64.5 శాతం ఉండగా, 2029 నాటికే 100 శాతానికి చేరుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది. ఉద్యోగాల కల్పనకు పాఠశాల విద్య నుంచే పునాదులు పడాలని, అందులోభాగంగా ప్రాథమిక స్థాయి నుంచే విద్యలో నాణ్యత పెరగాలని, అది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని పేర్కొంది. ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించి అంగన్‌వాడీలను ప్రాథమిక విద్యకు అనుసంధానం చేయనుంది.


  • 6వ తరగతి నుంచే వృత్తి విద్య

స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాల్లో భాగంగా పాఠశాల స్థాయిలోనే వృత్తి విద్యను అందుబాటులోకి తీసుకురానున్నారు. 6 నుంచి 8 తరగతులకు ఒకేషనల్‌ బోధన ప్రారంభిస్తారు. ఇందులో క్షేత్రస్థాయి సందర్శన, కార్యాచరణ ఆధారిత అభ్యసనం, ఇతర ప్రాక్టికల్స్‌ ఉంటాయి. 9, 10 తరగతుల విద్యార్థులకు ఒకటి లేదా రెండు రకాల నైపుణ్యాలు కచ్చితంగా ఉండేలా ప్రణాళిక రూపొందిస్తారు. 1 లేదా 2 రకాల స్కిల్‌ కోర్సులను ఎంపిక చేసుకునే ఆప్షన్‌ ఇస్తారు. పాఠశాలలను సమీపంలోని స్కిల్‌ సెంటర్లు, ఐటీఐలు, ఉన్నత విద్యా సంస్థలకు అనుసంధానం చేస్తారు. సాధారణ విద్యతో పాటు సమీపంలోని స్కిల్‌ సెంటర్ల ద్వారా ప్రత్యేక సెషన్లు ఉండేలా చూస్తారు. 11, 12 తరగతుల్లో 50 శాతం వరకు స్పెషలైజేషన్‌ కరిక్యులమ్‌ ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తారు. నైపుణ్య గణన ఆధారంగా స్థానిక అవసరాలకు తగ్గట్టుగా ఉన్నత విద్య కోర్సులు రూపొందిస్తారు. పరిశ్రమలతో అనుసంధానించేలా ఉపాధి కల్పన కోర్సులు ప్రారంభిస్తారు.

  • రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదం ఏపీ చాంబర్స్‌

సీఎం చంద్రబాబు ఆవిష్కరించిన ‘స్వర్ణాంధ్ర విజన్‌-2047’ ఆంధ్రప్రదేశ్‌ సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడుతుందని రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య (ఏపీ చాంబర్స్‌) అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు తెలిపారు. ‘ఈ విజన్‌ డాక్యుమెంటు ద్వారా రాష్ట్రం రెండు దశాబ్దాల్లో రెండు అంకెల వృద్ధిని నమోదు చేస్తుంది. అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రాలలో ఒకటిగా అవతరిస్తుంది. నాణ్యత ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా ఉత్పత్తి పరిపూర్ణత సాధిస్తుంది. ప్రపంచ మార్కెట్‌లో ఏపీ అగ్ర భాగస్వామిగా ఎదగడానికి దోహదపడుతుంది’ అని పొట్లూరి ఆశాభావం వ్యక్తం చేశారు.


  • పీ-4 విధానంతో పేదరిక నిర్మూలన

  1. సమ్మిళిత వృద్ధి, అందరికీ వనరులను అందుబాటులోకి తేవడం ద్వారా పేదరిక నిర్మూలన

  2. పబ్లిక్‌-ప్రైవేట్‌-పీపుల్‌-పార్టిసిపేషన్‌ (పీ4)తో అత్యుత్తమ రాజధానితో పాటు అందరికీ సమానస్థాయిలో జీవన ప్రమాణాల కల్పన

  3. అత్యధిక ఆదాయం గల తొలి 10 శాతం ప్రజలు అట్టడుగున ఉన్న 20 శాతం ప్రజలకు ఆర్థికంగా చేయూతనివ్వాలి. ఇళ్ల నిర్మాణం, ఇతర అత్యవసర సౌకర్యాలు కల్పించడం ద్వారా పేదరిక నిర్మూలన

  4. అందుబాటు ధరల్లో వైద్యం, ఆరోగ్య పరిరక్షణ

  5. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, నైపుణ్య శిక్షణ

  6. ప్రతి కుటుంబానికి 24 గంటల విద్యుత్‌, వంట గ్యాస్‌, బీమా సదుపాయం, మరుగుదొడ్లు, డ్రైనేజ్‌ సౌకర్యాలు

  • వ్యర్థాల ద్వారా సంపద సృష్టి

ప్రజలందరికీ నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రమైన వాతావరణం కల్పిండమే లక్ష్యం

ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణతో సంపద సృష్టించే విధానాలు అందుబాటులోకి

ప్రపంచస్థాయిలో నివాసానికి అత్యంత అనువుగా ఉన్న నగరాల జాబితాలో ఏపీ నుంచి రెండు నగరాలు ఉండేలా చర్యలు

పర్యావరణానికి హాని కలిగించని ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా భవిష్యత్‌ తరాలకు మెరుగైన వాతావరణం .

Untitled-2 copy.jpg


  • ఏపీ ఉత్పత్తులకు గ్లోబల్‌ బ్రాండ్‌

  1. అన్ని రంగాల్లో పరిపూర్ణమైన ఉత్పత్తులు సాధించడమే లక్ష్యం

  2. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు తదితర రంగాల్లో ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాల నిర్వహణకు ప్రోత్సాహకం. రాష్ట్రంలోని ఉత్పత్తులు, సేవలకు ప్రపంచ స్థాయిలో మార్కెటింగ్‌

  3. ఇంక్యుబేషన్‌ పార్కులు, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు రాష్ట్రంలో పర్యావరణ వ్యవస్థను, సాంకేతిక పరంగా నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్‌ లీడర్‌గా నిలబెట్టడానికి దోహదం చేస్తాయి

  4. డిజిటల్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విద్య, శిక్షణ

  5. ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలు, డిజిటల్‌ ఎక్స్‌పోలు, భారీస్థాయి ఈవెంట్లలో మెరుగైన భాగస్వామ్యం ద్వారా డిస్కవర్‌ ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. తద్వారా గ్లోబల్‌ బ్రాండ్‌తో ఉత్పత్తులు, సేవలు, ఆవిష్కరణలు ప్రపంచస్థాయిలో ప్రదర్శితమై పెట్టుబడులు, భాగస్వామ్యాల ఆకర్షణ

  6. పర్యాటక అనుభవాలు, సాంస్కృతిక, ఆర్థిక మార్పిడికి ఇంటిగ్రేటెడ్‌ నేషనల్‌, ట్రాన్స్‌నేషనల్‌ సర్క్యూట్‌లు ఆవిర్భవిస్తాయి

  7. ఇంతవరకు అన్వేషించని ప్రాంతాలను గుర్తించడం ద్వారా నీలి సముద్ర ఆర్థిక వ్యవస్థ (బ్లూ ఓషన్‌ ఎకానమీ)లో ఆంధ్రప్రదేశ్‌ తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటుంది.

Untitled-2 copy.jpg

Updated Date - Dec 14 , 2024 | 03:42 AM