Varla Ramaiah: చర్చి ఫాదర్లనే మభ్యపెట్టడం దారుణం..
ABN , Publish Date - Mar 12 , 2024 | 09:26 PM
ఏపీలో వైఎస్ జగన్ కోసం చర్చి ఫాదర్లనే మభ్యపెట్టాలని చూడడం దారుణమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగసంఘాల నేత వెంకట రామిరెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా..
అమరావతి: ఏపీలో వైఎస్ జగన్ కోసం చర్చి ఫాదర్లనే మభ్యపెట్టాలని చూడడం దారుణమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగసంఘాల నేత వెంకట రామిరెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి సీఎం జగన్ తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సివిల్ కాండక్ట్ రూల్స్ ప్రకారం రామిరెడ్డిని సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించాలన్నారు.
రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని మూడు రోజుల క్రితం చీఫ్ సెక్రటరీని కోరామని వర్ల రామయ్య చెప్పారు. ఇవాళ రాష్ట్ర ఎన్నికల అధికారి మీనాకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా సీఎం జగన్‌రెడ్డి మేనత్త విమలారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలో చర్చిలన్నీ సందర్శించి పాస్టర్లకు డబ్బు ఎర చూపి.. జగన్‌కు ఓటు వేయమని కోరడం చట్ట వ్యతిరేకమని చెప్పారు. శ్రీమతి విమలారెడ్డి పాస్టర్లతో మాట్లాడే మాటలు రెండు మతాల మధ్య.. వైషమ్యాలు రెచ్చగొట్టే రీతిలో ఉన్నాయన్నారు. వెంటనే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య పేర్కొన్నారు.